నల్లింగాయపల్లె(కమలాపురం): కమలాపురం మండల పరిధిలోని నల్లింగాయపల్లె సమీపంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ రైల్వే లైను వద్ద ప్రమాదవశాత్తు రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మహ్మద్ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం, పెద్దన్నగారిపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35) గత మూడేళ్లుగా భారతి పరిశ్రమకు బయటి నుంచి బొగ్గు వచ్చే రైల్వే విభాగంలో పాయింట్ మెన్‌గా పని చేస్తున్నాడు. మృతుడు బొగ్గు అన్‌లోడింగ్ అయ్యాక వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేసి జాయింట్ చేసే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున బొగ్గు అన్‌లోడ్ అయ్యాక రెండు వ్యాగన్లకు మధ్య కప్లింగ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వ్యాగన్లకు ఉన్న రాడ్లు మృతుని కుడి చేతి వైపు బలంగా గుద్దు కోవడంతో వ్యాగన్ల మద్య ఇరుక్కుని మృతి చెందాడు. మృతుని భార్య తాహరాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. రిమ్స్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతునికి భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు ఉన్నారు.