అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు.
దేవరకొండ
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినా ప్రణాళికాబద్ధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి కషి చేస్తామన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ డాక్టర్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులున్నారు.