జనగామ జిల్లా బహుమతిగా ఇవ్వాలి
-
ప్రతిపక్ష పార్టీ నేతలకు రాఖీ కట్టి కోరిన మహిళా ప్రజాప్రతినిధులు
జనగామ : జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న నిర్వహించే ప్రజాప్రతినిధుల సమావేశంలో జనగామకు అనుకూలంగా వాణి వినిపించాలని కోరుతూ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో ప్రతిపక్ష పార్టీ నేతలను బుధవారం కలిశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, జిల్లా కోసం రాజీ నామా చేసిన 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజని, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, ప లువురు జేఏసీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్, అరవింద్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి జనగామ జిల్లా చేయాలని ఏకవాక్య తీర్మాణంతో సంపూర్ణ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. పలు పార్టీల నేతలకు మహిళా ప్రజాప్రతి నిధులు రాఖీ కట్టి జనగామ జిల్లా కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దశమంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలకు చెందిన నేతలు జనగామ జిల్లాకు అనుకూలంగా పూర్తి సహకారం అందిస్తామన్నారని తెలిపారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, ఆలేటి సిద్దిరాములు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళంపల్లి రాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, తీగల సిద్దుగౌడ్, బెడిదె మైసయ్య ఉన్నారు.