జిల్లాకు రూ.95 కోట్లు అవసరం
సీఎంకు వివరించిన కలెక్టర్
ఒంగోలు టౌన్ : జిల్లాకు తక్షణం 95 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కలెక్టర్ సుజాతశర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి సుజాతశర్మ వివరిస్తూ ప్రస్తుతం తమ వద్ద 25 కోట్ల రూపాయల నగదు సిద్ధంగా ఉందన్నారు. 8500 మందికి కోటి రూపాయల పింఛన్లు ఇచ్చినట్లు తెలిపారు. 21 వేల మంది వృద్ధులు, వికలాంగులకు 200 రూపాయల చొప్పున నగదు రూపంలో అందించినట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కూడా నగదు చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల ఈ-పాస్ మిషన్లు అవసరం అవుతాయన్నారు. 1684 మొబైల్ ట్రాన్షక్షన్లు, 4 వేల మైక్రో ట్రాన్షక్షన్లు నిర్వహించినట్లు వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించి బ్యాంకు మిత్రలు, సీసీలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. శిక్షణ పొందిన వారు తమకు కేటారుుంచిన ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలపై క్షేత్ర స్థారుులో ప్రజలకు అవగాహన కలిగిస్తారని తెలిపారు.
నగదు రహిత లావాదేవీల ద్వారా ఉపాధి : సీఎం
నగదు రహిత లావాదేవీల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిర్ణరుుంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీ నిర్వహిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు కింద 15 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి నగదు రహిత లావాదేవీలపై పూర్తి స్థారుులో అవగాహన కలిగిస్తే 20 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. మొత్తంగా ఒక నిరుద్యోగి ఒక వ్యక్తికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగించినందుకు నెలకు 35 రూపాయలు ఇస్తామని వివరించారు.
బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు ప్రకటిస్తున్న ప్రోత్సాహకాల మాదిరిగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలకు కూడా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. అతి చిన్న గ్రామానికి రూ.10 వేలు, చిన్న గ్రామానికి రూ.25 వేలు, పెద్ద గ్రామానికి రూ.50 వేలు, మేజర్ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు చెల్లించనున్నట్లు వివరించారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎల్‌డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.