రాక్షస పాలనకు చరమగీతం
రాక్షస పాలనకు చరమగీతం
Published Wed, Jun 14 2017 12:31 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
రాట్నాలకుంట (దెందులూరు) : టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అభివృద్ధి, సంక్షేమం విస్మరించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడితే దీటుగా గుణపాఠం చెబుతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని హెచ్చరించారు. మంగళవారం పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మతల్లి కల్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీ నియోజకవర్గ కన్వీనర్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో దెందులూరుతో కలిపి 14 నియోజకవర్గాల ప్లీనరీలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. ప్రతి నియోజకవర్గ ప్లీనరీలోనూ ప్రజా సమస్యలు, పరిష్కారం, ప్రణాళికలు, తీర్మానాలు చేయటం జరిగిందన్నారు. టీడీపీ విశాఖపట్నం, కొవ్వూరుల్లో నిర్వహించిన మహానాడుల్లో ఒక్క ప్రజా సమస్యపై అయినా చర్చించారా అని ప్రశ్నించారు. మూడు సంవత్సరాల పాలనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని అయినా చేశారా? పేదవాడికి ఒక్క ఇల్లు అయినా కట్టారా? అని ఎద్దేవా చేశారు. వనరులను దోచుకోవడం, ఆస్తులు కూలగొట్టడం, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం విచారకరమన్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన పోలవరం కాలువను పేరు మార్చి పట్టిసీమ నామకరణం చేసి పైప్‌లైన్ల ద్వారా కొంతమంది రైతులకు సాగునీరు అందించి రైతులకు నీరిచ్చామని సంబరాలు చేసుకోవటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పైపులతో కాకుండా అదే ప్రాంతంలో రూ.2 కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పెడితే నియోజకవర్గంలో ఎంతోమంది రైతులకు మేలు జరిగేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మట్టి, ఇసుక మేటలను ఎవరు కొల్లగొట్టారో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ప్రతి పని ప్రచార ఆర్భాటం కోసమే చేస్తున్నారు తప్ప పేదల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా చేయటం లేదని విమర్శించారు. టీడీపీ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా జిల్లాలో కొల్లేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని నాని ప్రశ్నించారు. దెందులూరులో ప్లీనరీ నిర్వహణ కోసం వైఎస్సార్ సీపీ జెండాలు కడుతుంటే బెంబేలెత్తి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తీసేయాలని టీడీపీ నేత ఒత్తిడి చేయడంతోనే వైఎస్సార్ సీపీ అంటే ఎంత భయపడుతున్నారో తెలుస్తుందన్నారు. ఐదేళ్లుగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన కొఠారు రామచంద్రరావును ఈ సందర్భంగా అభినందిస్తున్నానని నాని చెప్పారు.
కొల్లేరులో డ్యామ్, రెగ్యులేటర్ కడతాం
కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ జిల్లాలో ఎమ్మెల్యేలుగా రౌడీలకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించారని, ఉద్యోగులు, అధికారులు ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు, బూతుల పంచాంగం టీడీపీ నేతలకే చెల్లిందన్నారు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలవటం ఖాయమన్నారు. వ్యవసాయం దండగంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, జపాన్, ఇతర దేశాల్లో పర్యటించినా ఆంధ్రాకు పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొల్లేరులో డ్యామ్, రెగ్యులేటర్ కట్టి తీరుతామని, రైతులకు దివంగత కోటగిరి విద్యాధరరావు స్ఫూర్తితో సేవలందిస్తానని శ్రీధర్ అన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి విషయానికి హద్దు ఉంటుందని దెందులూరు నియోజకవర్గంలో హద్దుదాటిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అదే రీతిలో గుణపాఠం చెబుతానన్నారు. మహిళా అధికారిని జుట్టు పట్టుకుని ఈడ్చి, పెదవేగి మండలంలో ఇద్దరు ఎస్సైలను కొట్టి, అధికారులను బండ బూతులు తిడుతున్న ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్ దురాగతాలను నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తొలుత సమావేశంలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, గోపాలపురం, చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకటరావు, డి.నవీన్‌బాబు, పుప్పాల వాసుబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్. సాయిబాల పద్మ పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్లీనరీకి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
Advertisement