♦ అనుమతుల కోసం నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో
♦ ఇక బహుళజాతి కంపెనీల ప్రయోగాలకూ రంగం సిద్ధం
♦ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేయడానికి అనుమతులిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థకు జన్యుమార్పిడి పంటలు ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ఇక్కడి నేలల్లో సాగు చేసే వీలుంటుంది. అందుకోసం ఈ కమిటీని ఏర్పాటుచేశారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్‌గా, డెరైక్టర్ సభ్య కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో అనుమతించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోతో ఇక బహుళజాతి కంపెనీలకు కూడా జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు పచ్చజెండా ఊపినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది తిరస్కరణ: జన్యుమార్పిడి ఆహార పంట ప్రయోగాల కోసం బహుళ జాతి కంపెనీల (ఎంఎన్‌సీ)కు అనుమతి విషయంలో ప్రభుత్వం గత ఏడాది ఆసక్తి చూపలేదు. ఆహార పంటల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని ఆయా కంపెనీలు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే వ్యవసాయశాఖ అప్పట్లో ప్రయోగాలు ఎందుకు? ఏ పంటలపై చేస్తా రు? రైతుకు లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ దేశంలో ఏ లేబరేటరీలో ఏ వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ పూర్తి సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. కానీ ఆ వివరాలను ఆయా కంపెనీలు ఇవ్వలేదు. ఎందుకంటే సాంకేతికంగా చూస్తే అవి ఇక్కడ ప్రయోగించడమే దుష్ర్పరిణామాలకు దారి తీస్తుందనేది అందరికీ తెలిసిందే. కాగా ఎంఎన్‌సీలు ప్రభుత్వంతో భారీగా లాబీయింగ్ చేసినట్లు తెలిసింది. అందువల్లే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎంఎన్‌సీల వల్లో పడటమే
అనుమతి ఇచ్చే విషయంపై కమిటీని ఏర్పాటు చేయడమంటే జన్యుమార్పిడి పంటల ప్రయోగాలకు పచ్చజెండా ఊపడమే. ప్రభుత్వం ఎంఎన్‌సీలకు అమ్ముడుపోయింది. సేంద్రియ వ్యవసాయంపై ఉపన్యాసాలిస్తూ ఇలా జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వడం పరాకాష్ట. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లినట్లే.
సారంపల్లి మల్లారెడ్డి, రైతు నాయకుడు
కేవలం కమిటీ వేశామంతే
ఉమ్మడి రాష్ట్రంలో కమిటీ ఉండేది. తెలంగాణ వచ్చాక నూతనంగా కమిటీని ఏర్పాటు చేశాం. అంతే తప్ప ఆషామాషీగా అనుమతులివ్వడం కోసం కాదు. జన్యు మార్పిడి ప్రయోగాలకు అనుమతి రాజకీయపర నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
పార్థసారథి, వ్యవసాయశాఖ కార్యదర్శి
‘జన్యుమార్పిడి’ ప్రయోగాలకు పచ్చజెండా!
Published Wed, Oct 28 2015 4:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement