రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వాలు విఫలం
మిర్యాలగూడ అర్బన్l: రైతుల ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట టెయిల్ పాండ్ నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముంపు బాధితులకు పరిహారం ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. ప్రభుత్వాల విధానాల వలన రైతులు పంటలు పండిచాలంటేనే భయపడుతున్నారన్నారు. అదే జరిగితే వ్యవసాయం కుంటుపడి దేశ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓలతో కాలం కడుపుతున్న ప్రభుత్వం నష్టపరిహారం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. పుష్కరాలు, దేవుని గుళ్లు అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగకొడుతున్న కోటీశ్వరులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, పంటలు పండించే రైతులకు రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతులు సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వస్కుల మట్టయ్య, జగదీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.