వెన్ను విరిగిన కుటుంబం..!
జీవచ్ఛవంలా ఇంటి యజమాని
–రెండు కాళ్లు సచ్చుబడడంతో మంచానికే పరిమితం
–వైద్యానికి లక్షల రూపాయల ఖర్చు
–భార్యపై కుటుంబ భారం
–దీనస్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
అసలే పేదరికం. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి. వచ్చిన కొద్దిపాటి సంపాదనతో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇంటి యజమాని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆ ఘటనలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్షల రూపాయలు అప్పు తెచ్చి రెండు కాళ్లకు ఆపరేషన్ చేయించారు. అయినా దురదృష్టం వెంటాడింది. ఇన్‌ఫెక్షన్ రావడంతో రెండు కాళ్లు సచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు.. మిర్యాలగూడకు చెందిన చిలుకూరి ప్రభాకర్. నాటి నుంచి కుటుంబ భారాన్ని మోస్తున్న అతని భార్య శ్రావణి దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది.
మిర్యాలగూడ టౌన్ : దేవరకొండకు చెందిన చిలుకూరి ప్రభాకర్‌ది నిరుపేద కుటుంబం. బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్ల క్రితం మిర్యాలగూడకు వలస వచ్చాడు. స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉంటూ టైలర్ పని చేసుకుంటున్నాడు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014లో బైక్‌పై నల్లగొండ నుంచి మిర్యాలగూడకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి రెండు కాళ్లు విరిగిపోయాయి. రూ. 2.60లక్షలు అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించారు. కానీ, ఇన్స్‌ఫెక్షన్ వచ్చి రెండు కాళ్లు సచ్చుబడిపోయాయి. దీంతో వృత్తి పని చేయలేక ఉపాధి కోల్పోయి కుటుంబ గడవడమే కష్టంగా మారింది. నాటి నుంచి కుటుంబ భారం అతని భార్య శ్రావణిపై పడింది. భర్తకు కాళ్లు సచ్చుబడడంతో పాటు ఇతర జబ్బులు కూడా సోకడంతో వైద్యులను సంప్రదించగా రూ.5లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. కుమారుడిని కూడా చదివించలేదని దీన స్థితి. ఇరుగుపొరుగు వారు చేసే సాయంతో వీరి కుటుంబం గడుస్తోంది.
అన్నీ తానై...
జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తన భర్త ప్రభాకర్‌కు సపర్యలన్నీ భార్యే చేస్తోంది. స్నానం చేయించడం, మల విసర్జన, మూత్రానికి తీసుకెళ్తుంది.
నా భర్తను చూస్తే కడుపు తరుక్కుపోతుంది
–చిలుకూరి శ్రావణి(ప్రభాకర్ భార్య)
జీవచ్ఛవంలా ఉన్న తన భర్తను చూస్తే కడుపుతరుక్కుపోతుంది. ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పులు తెచ్చాం. మళ్లీ అప్పు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సాయం చేస్తే నా భర్తను బాగు చేయించుకుంటా. సాయం చేయాలనుకునే వారు బాధిత కుటుంబ సభ్యుల సెల్ నంబర్ 9908758598, ‘సాక్షి’ కార్యాలయం : 9705348038, 9705346232లో సంప్రదించవచ్చు. బ్యాంక్ అకౌంట్ నంబర్ 62289649001, ఎస్‌బీహెచ్, మిర్యాలగూడ