Backbone
-
అరటి రైతుకు మహర్దశ
సాక్షి, అమరావతి: అరటి రైతుకు మహర్దశ పట్టనుంది. విత్తు నుంచి విపణి వరకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవనుంది. దిగుబడుల్లో నాణ్యత పెంచడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.269.95 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేసింది. రానున్న మూడేళ్లలో వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ని అమలు చేయనుంది. గడిచిన మూడేళ్లలో లక్ష టన్నుల ఎగుమతులు రాష్ట్రంలో 2,02,602 ఎకరాల్లో అరటి సాగవుతుండగా, 48.62 లక్షల టన్నుల దిగుబడులతో దేశంలో నం.1 స్థానంలో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 23వేల టన్నులు ఎగుమతులు జరుగగా, కరోనా పరిస్థితులున్నప్పటికీ గడిచిన మూడేళ్లలో లక్ష టన్నులకు పైగా అరటి ఎగుమతులు చేయగలిగారు. దేశంలోనే తొలిసారి తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేక రైలు ద్వారా అరటిని ఎగుమతి చేసి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వాల్యూచైన్ ప్రాజెక్టు వల్ల హెక్టార్‌కు 24 టన్నుల వరకు దిగుబడులు, టన్నుకు రూ.12వేల వరకు ఆదాయం పెరిగింది. ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో అనంతపురంలో రెండు ప్యాక్ హౌస్‌లు, రెండు కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించగా, పులివెందులలో ప్యాక్ హౌస్ నిర్మాణ దశలో ఉంది. 42,500 ఎకరాల్లో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తాజాగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ ఉద్యాన బోర్డు దేశవ్యాప్తంగా 12 క్లస్టర్స్‌ను ఎంపిక చేయగా, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అరటి ఎగుమతులను ప్రోత్సహించనున్నారు. అరటి ఎక్కువగా సాగవుతున్న వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, జిల్లాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. మూడు జిల్లాల పరిధిలో గుర్తించిన 42,500 ఎకరాల్లో సీడీపీ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూ.269.95కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మొత్తంలో రూ.100 కోట్లు గ్రాంట్ రూపంలో అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద సమీకరించనున్నారు. క్లస్టర్ గ్యాప్ అసెస్మెంట్ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతంలో మొక్కల నుంచి ఎగుమతి వరకు మూడు దశల్లో రైతులకు సపోర్టు ఇవ్వనున్నారు. విత్తు నుంచి కోత (ప్రీ ప్రొడక్షన్ – ప్రొడక్షన్)వరకు రూ.116.50 కోట్లు, కోత అనంతర నిర్వహణ–విలువ ఆపాదించడం (పోస్ట్‌హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యూఎడిషన్) కోసం రూ.74.75కోట్లు, ఎగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పనకు రూ.78.70కోట్లు ఖర్చు చేయనున్నారు. అరటికి కేరాఫ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గడిచిన మూడేళ్లలో అరటి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం రూ.269.95 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎగుమతుల్లో ఏపీకి త్వరలో అంతర్జాతీయఖ్యాతి లభించనుంది. –డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ రైతుకు చేయూత ఇలా.. సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సçస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం(ఐపీఎం), ఫ్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40వేల వరకు ఆర్థిక చేయూతనివ్వనున్నారు. తోట బడుల ద్వారా15వేల మందికి సాగులో మెళకువలపై శిక్షణనిస్తారు. సాగుచేసే ప్రతీ రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ)ఇస్తారు. కోతలనంతర నిర్వహణకు అవసరమైన ప్యాక్ హౌసెస్, కోల్డ్ స్టోరేజ్‌లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనపెట్టుబడులు అందించడంతో పాటు బ్రాండింగ్, విదేశాల్లో ప్రమోçషన్ వంటి కార్యకలాపాలకు ఆర్థిక చేయూతనందిస్తారు. (చదవండి: సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన) -
దేశానికి స్టార్టప్‌లే వెన్నెముక
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా భారత్ నుంచి భారత్ కోసం ఆవిష్కరణలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల ప్రతినిధులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ‘‘మన స్టార్టఫ్‌లు ఆట (పోటీ) నిబంధనలను మార్చేస్తున్నాయి. భారత్‌కు స్టార్టప్‌లు వెన్నెకముగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో 60,000 స్టార్టప్‌లు, 42 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం మూడింటిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ప్రభుత్వ చట్రం నుంచి, అధికారిక అడ్డుగోడల నుంచి వ్యవస్థాపకత, ఆవిష్కరణలకు విముక్తి కల్పించడం. ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేయడం. యువ ఆవిష్కర్తలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలవడం’’ అని ప్రధాని వివరించారు. ఎంతో పురోగతి.. 2013–14లో కేవలం 4,000 పేటెంట్లు భారత సంస్థలకు మంజూరు అయితే, గతేడాది 28,000 పెటెంట్లు మంజూరైన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2013–14లో 70,000 ట్రేడ్‌మార్క్‌లు సంఖ్య వృద్ధి చెందినట్టు చెప్పారు. అలాగే 2013–14లో 4,000 కాపీరైట్లు మంజూరు అయితే, 2021–22 మంజూరైనవి 16,000గా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్ స్థానం 2015లో 81 ఉంటే, అది ఇప్పుడు 46కు మెరుగుపడినట్టు పేర్కొన్నారు. స్టార్టప్‌లు ప్రదర్శన.. 150కుపైగా స్టార్టప్‌లు ఆరు రకాల గ్రూపులుగా ఏర్పడి ఈ సందర్భంగా ఆరు రకాల థీమ్‌లపై ప్రదర్శన ఇచ్చాయి. సాగు రంగంలో విస్తృతమైన డేటా సమీకరణకు యంత్రాంగం, భారత్‌ను వ్యవసాయానికి ప్రాధాన్య కేంద్రంగా మార్చడం, టెక్నాలజీ సాయంతో హెల్త్‌కేర్‌కు మద్దతునివ్వడం, మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారం, వర్చువల్ టూర్స్ ద్వారా రవాణా, పర్యాటకానికి ప్రోత్సాహాన్నివ్వడం, ఎడ్యుటెక్, ఉపాధి అవకాశాల గుర్తింపు, ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలను ఈ కామర్స్‌తో అనుసంధానించడంపై స్టార్టప్‌లు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి. ఉపాధి అవకాశాలకు వేదిక స్టార్టప్‌లు ఆవిష్కరణలు తీసుకురావడే కాదు భారీ ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కింది స్థాయి వరకు స్టార్టప్ సంస్కృతి ఫరిడవిల్లేందుకు వీలుగా ఏటా జనవరి 16న ‘నేషనల్ స్టార్టప్ డే’గా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌లకు 2022 ఎన్నో అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్నిస్తుంది.. నేషనల్ స్టార్టప్ డే అన్నది దేశ జీడీపీ వృద్ధిలో స్టార్టప్‌ల పాత్రను గుర్తించడమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, యువ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేసేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని బోలోలైవ్ (షార్ట్ వీడియోల ప్లాట్‌ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ సక్సేనా పేర్కొన్నారు. -
ఆ ప్రాణం కోసం లక్షల్లో ఖర్చుపెట్టారు!
వేములవాడ: తండ్రి మేకలకాపరి, తల్లి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబలోని పెద్దకుమారుడు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రులల్లో చికిత్సకోసం రూ.7 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించారు. కుమారుడి వైద్యంకోసం అప్పులు చేశామని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన చెన్నవేని బక్కన్న రాజమల్లు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరిలో పెద్దకుమారుడు బాలకృష్ణ(21) రెండేళ్లక్రితం వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో మంచం పట్టాడు. అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు. అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాలేదు. చికిత్సపొందుతూ జనవరి 10న బాలకృష్ణ మృతిచెందాడు. ఆసుపత్రుల్లో చికిత్సకోసం చేసిన అప్పు అలాగే ఉంది. సీఎం రిలీఫ్‌ఫండ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదని వారు వాపోయారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బక్కన్న–రాజమల్లుదంపతులు వేడుకుంటున్నారు. -
నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు
మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్ బ్యాంకులో రూ. 4 వేల నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మ ద్య ఉన్న జారుుంట్ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేరుుంచుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. -
వెన్ను విరిగిన కుటుంబం..!
జీవచ్ఛవంలా ఇంటి యజమాని –రెండు కాళ్లు సచ్చుబడడంతో మంచానికే పరిమితం –వైద్యానికి లక్షల రూపాయల ఖర్చు –భార్యపై కుటుంబ భారం –దీనస్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అసలే పేదరికం. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి. వచ్చిన కొద్దిపాటి సంపాదనతో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఇంటి యజమాని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆ ఘటనలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. లక్షల రూపాయలు అప్పు తెచ్చి రెండు కాళ్లకు ఆపరేషన్ చేయించారు. అయినా దురదృష్టం వెంటాడింది. ఇన్ఫెక్షన్ రావడంతో రెండు కాళ్లు సచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు.. మిర్యాలగూడకు చెందిన చిలుకూరి ప్రభాకర్. నాటి నుంచి కుటుంబ భారాన్ని మోస్తున్న అతని భార్య శ్రావణి దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది. మిర్యాలగూడ టౌన్ : దేవరకొండకు చెందిన చిలుకూరి ప్రభాకర్‌ది నిరుపేద కుటుంబం. బతుకుదెరువు నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్ల క్రితం మిర్యాలగూడకు వలస వచ్చాడు. స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉంటూ టైలర్ పని చేసుకుంటున్నాడు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014లో బైక్‌పై నల్లగొండ నుంచి మిర్యాలగూడకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి రెండు కాళ్లు విరిగిపోయాయి. రూ. 2.60లక్షలు అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించారు. కానీ, ఇన్స్ఫెక్షన్ వచ్చి రెండు కాళ్లు సచ్చుబడిపోయాయి. దీంతో వృత్తి పని చేయలేక ఉపాధి కోల్పోయి కుటుంబ గడవడమే కష్టంగా మారింది. నాటి నుంచి కుటుంబ భారం అతని భార్య శ్రావణిపై పడింది. భర్తకు కాళ్లు సచ్చుబడడంతో పాటు ఇతర జబ్బులు కూడా సోకడంతో వైద్యులను సంప్రదించగా రూ.5లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. కుమారుడిని కూడా చదివించలేదని దీన స్థితి. ఇరుగుపొరుగు వారు చేసే సాయంతో వీరి కుటుంబం గడుస్తోంది. అన్నీ తానై... జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తన భర్త ప్రభాకర్‌కు సపర్యలన్నీ భార్యే చేస్తోంది. స్నానం చేయించడం, మల విసర్జన, మూత్రానికి తీసుకెళ్తుంది. నా భర్తను చూస్తే కడుపు తరుక్కుపోతుంది –చిలుకూరి శ్రావణి(ప్రభాకర్ భార్య) జీవచ్ఛవంలా ఉన్న తన భర్తను చూస్తే కడుపుతరుక్కుపోతుంది. ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయలు అప్పులు తెచ్చాం. మళ్లీ అప్పు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సాయం చేస్తే నా భర్తను బాగు చేయించుకుంటా. సాయం చేయాలనుకునే వారు బాధిత కుటుంబ సభ్యుల సెల్ నంబర్ 9908758598, ‘సాక్షి’ కార్యాలయం : 9705348038, 9705346232లో సంప్రదించవచ్చు. బ్యాంక్ అకౌంట్ నంబర్ 62289649001, ఎస్బీహెచ్, మిర్యాలగూడ -
నేను మీ వెన్నుని
ఆనంద్ శరీరంలోని మిగిలిన అవయవాల కంటే నేనే తనను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాను. నేను ఆనంద్ వెన్నెముకను. దాదాపు ప్రతి ఏడాదీ తనకు నాతో ఇబ్బందులు తప్పవు. నేను పెట్టే బాధను తగ్గించుకోవడానికి తను కాపడం పెట్టడం, మర్దన చేయడం, మందులు తీసుకోవడం వంటివన్నీ చేస్తూ ఉంటాడు. నన్ను తను సరిగా చూసుకోకపోవడం వల్లనే నా ప్రతిస్పందనగా తనకు నొప్పులు కలిగిస్తుంటాను. నా నుంచి తలెత్తే సమస్యలను ఆనంద్ తనకు తానుగా పరిష్కరించుకోలేడు. ఇది నా లోపమే అనుకోండి. అయితే, ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడే నా పనితీరులో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేను నేలకు సమాంతరంగా వంతెనలా ఉండే బదులు, నేలలో నిటారుగా నాటిన గడకర్రలా మారాను. అలాగని నేను మరీ పెళుసుగా ఏమీ ఉండను. వంగగలను, మెలితిరగగలను, నాపై ఉన్న తలను అటూ ఇటూ తిప్పగలను. మరీ ముఖ్యంగా చాలావరకు శరీరభారాన్ని మోయగలను. వెన్నుపాము నుంచే 31 జతల నరాలు ఆనంద్‌కు గల 45 సెంటీమీటర్ల వెన్నుపాముకు నేను రక్షణ కల్పిస్తుంటాను. పూసలదండలోని దారంలా నా మధ్యగా సాగిపోయే తెల్లని వెన్నుపాము సెంటీమీటరు మందంలో ఉంటుంది. సున్నితమైన వెన్నుపాముకు నేను మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాను. నాలోని వెన్నుపాము నుంచే 31 జతల నరాలు శరీరమంతా పాకి ఉంటాయి. వీటిలో సగానికి సగం నరాలు మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగతావి మెదడు నుంచి వచ్చే ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వెన్నుపాము స్వయంగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్ పొరపాటున వేడి గిన్నె మీద చెయ్యి పెట్టాడనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసేంత సమయాన్ని కూడా వెన్నుపాము వృథా కానివ్వదు. వెంటనే అసంకల్పిత ప్రతీకార చర్యకు ఆదేశిస్తుంది. ఆనంద్ తన చేతిని చటుక్కున వెనక్కు తీసుకునేలా చేస్తుంది. అలా వంపులు తిరుగుతా ఆనంద్ పుట్టినప్పుడు నేను దాదాపు నిటారుగానే ఉంటాను. తను తల పెకైత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే నాలోని భాగం కాస్త వంపు తిరుగుతుంది. ఆనంద్ పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే నాలోని భాగం కూడా వంపు తిరుగుతుంది. ఇప్పుడు నేను అస్పష్టంగా రాసిన ఇంగ్లీష్ అక్షరం ‘ఎస్’ ఆకారంలో ఉన్నాను. నిజానికి ఎలాంటి వంపులు లేని సరళరేఖ ఆకారం కంటే ఇదే నాకు అనువైన ఆకారం. నాలోని వంపులే నాకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. వంపులు మాత్రమే కాదు, నాలో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే లేకుంటే, నాలోని పూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. నాలోని పూసల మధ్య కుషన్లాంటిది ఉంటుంది. దానినే మృదులాస్థి (కార్టిలేజ్) అంటారు. అందులో ఉండే జెల్లీలాంటి పదార్థమే నన్ను కుదుపుల బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. నొప్పులన్నిటికీ నేనే కారణం కాదు అయితే, ఆనంద్ వెన్నులో తలెత్తే అన్ని రకాల నొప్పులకూ నేనే కారణం కాదు. వెన్నులో చాలాసార్లు తలెత్తే నొప్పులకు ఇతరేతర కారణాలు కూడా ఉండొచ్చు. కిడ్నీల్లో సమస్యలు ఉన్నా, లివర్ లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా, ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే కండరాలు బిగుసుకుంటాయి. రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల నాకు నొప్పులు తప్పవు. ఆనంద్ అలాంటి భావోద్వేగాల నుంచి తేరుకుంటే, నేను కూడా త్వరగా కోలుకుంటాను. కాస్త తీవ్రంగా నొప్పి కలిగితే, నా డిస్కులు జారిపోయాయనుకుంటాడు ఆనంద్. అదృష్టవశాత్తు అతడికి ఇంతవరకు అలాంటి ప్రమాదమేదీ కలగలేదు. రోడ్డు ప్రమాదం వంటి సంఘటనల్లో తీవ్ర గాయమేదైనా అయితే తప్ప నా డిస్కులు అంత తేలికగా దెబ్బతినవు. నా పూసల మీద భారీ దెబ్బ ఏదైనా తగిలితే వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నన్ను అంటిపెట్టుకున్న కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దెబ్బతినడం వల్ల నా పూసలు రాపిడికి గురై, వెన్నుపూస నుంచి వ్యాపించే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. ఈ నొప్పి అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. ఒకరకంగా ఈ నొప్పి జాగ్రత్తకు సంకేతం. దెబ్బతిన్న వెన్నుపూసలు మరింత దెబ్బతినకుండా వాటి కదలికలను నివారించేందుకు దోహదపడుతుంది. శరీర భారంతో పెరిగే నొప్పులు చాలామంది నడి వయస్కుల్లాగే ఆనంద్‌కు కూడా నా భాగంలో నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులన్నీ నన్ను అంటిపెట్టుకున్న కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చినవే. ప్రతి వారం గోల్ఫ్ ఆడే ఆనంద్... ఆ మాత్రం వ్యాయామంతోనే నేను దృఢంగా ఉంటాననుకుంటాడు. కానీ, అది సరికాదు. నన్ను అంటిపెట్టుకుని ఉండే నాలుగువందల కండరాలు, వెయ్యి లిగమెంట్ల నిర్మాణాన్ని తెలుసుకుంటే ఆనంద్ ఆశ్చర్యపోతాడు. ఆనంద్ ఇటీవల నాలుగు కిలోల బరువు పెరిగాడు. అతడి పొట్టవద్ద పేరుకుపోయిన కొవ్వువల్ల ఏర్పడిన భారాన్ని నేనే మోయాలి. మెత్తని కుషన్ సోఫాల్లో, కుర్చీల్లో అడ్డదిడ్డంగా కూర్చుంటూ విశ్రాంతి తీసుకుంటున్నానని అనుకుంటాడు ఆనంద్. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి విశ్రాంతీ ఉండదు. పైగా నాపై అదనపు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అతడు నాపై ఎక్కువగా భారం మోపకుండా, కాళ్లకు, చేతులకు పని చెబితేనే నేను క్షేమంగా ఉంటాను. వెన్నుపూస నిర్మాణం తల వెనుక మెడను అంటిపెట్టుకుని ఉండే నా పైభాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. ఇవి పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. నడుము భాగంలో ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. శరీర బరువును చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. మన వీపు భాగంలో అందరికీ ఒక ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ షేప్ ఆకృతి ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ఎస్ షేప్డ్ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన వంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో వెన్ను క్షేమం... నిలబడే సమయంలో వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవడం. వెన్నును అంటిపెట్టుకున్న కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి. కంప్యూటర్ ముందు కూర్చునే వెన్ను వంగిపోకుండా జాగ్రత్త పడటం బరువులు ఎత్తే సమయం అకస్మాత్తుగా వంగకుండా, కూర్చొని మెల్లగా ఎత్తడం వంటి జాగ్రత్తలతో వెన్ను పదిలంగా ఉంటుంది. -
వెన్నుదన్ను
మానవదేహంలో అత్యంత ప్రధాన అవయవం వెన్నెముక. మనిషిని బలంగా నిలబెట్టేది, బలహీనుడ్ని చేసిపడగొట్టేది ఇదే. అందుకే దీనిని ఎంత బలంగా ఉంచితే మనిషి అంత ఆరోగ్యవంతంగా ఉంటాడు. యోగాలో పలు ఆసనాలు వెన్నెముక సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపకరిస్తాయి. అందులో కొన్ని... వీరభద్రాసనం 1 సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచేతిని ముందు నుంచి స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకువెళ్లి, శ్వాస వదులుతూ కుడిచేతిని ఎడమకాలును సమాంతరంగా ఉంచి ముందుకు వంగాలి. నేలకు సమాంతరంగా వంగినపుడు కుడిచెయ్యి ఎడమకాలు స్ట్రెయిట్ లైన్లో ఉండటం గమనించవచ్చు. ఎడమచేతిని నడుము పక్కనే నిటారుగా ఉంచాలి. చేతివేళ్లు కూడా స్ట్రెచింగ్ పొజిషన్లో ఉండటం గమనించగలరు. 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ కుడిచేతిని పైకి ఎడమకాలును క్రిందకు, శ్వాస వదులుతూ కుడిచేతిని భూమివైపు చూపిస్తూ, కుడిపక్క నుండి క్రిందకు నడుము పక్కకి తీసుకురావాలి. మళ్లీ సమస్థితికి రావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. వీర భద్రాసనం 2 సమస్థితిలో నిలబడి రెండు చేతులూ స్ట్రెచ్ చేస్తూ అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ పైకి తీసుకువెళ్లి పైన లింగముద్రలో (చేతులు రెండు ఇంటర్‌లాక్ చేసిన తరువాత ఎడమచేతి బొటనవేలును పైకి నిలబెట్టి ఉంచాలి) లేదా నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును కొంచెం వెనుకకు తీసుకొని పొజిషన్ తీసుకుని శ్వాస వదులుతూ చేతులు రెండూ కలిపి ముందుకి స్ట్రెచ్ చేస్తూ వంగాలి. వెనుక కాలును పైకి లేపాలి. చేతులు, వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసల తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపాలి. చేతులు వెనుక కాలు భూమికి సమాంతరంగా వస్తాయి. 5 శ్వాసలు తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి ఎడమకాలు వెనుకకు, కిందకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ అరచేతులు రెండూ భూమివైపుకి చూపిస్తూ నడముకు ఇరువైపులా కిందకు తీసుకురావాలి. ఇలా చేయలేని వారు ముందు వైపు కుర్చీ, డైనింగ్ టేబుల్గాని రెండడుగుల దూరంలో ఉంచి ముందుకు వంగినపుడు చేతులతో వాటికి సపోర్ట్ పెట్టి వెనుక కాలును వీలైనంత పైకి నిటారుగా లేపవచ్చు. అనుభవమున్న సాధకులు కూడా కుర్చీ సపోర్ట్ తీసుకుంటే అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. గరుడాసన ఆకాశంలో ఎగురుతూ నీటిలో ఉన్న ఆహారాన్ని పసిగట్టి గంటకు 200 మైళ్ల వేగంతో కిందకు దూసుకువచ్చి గురి తప్పకుండా ఆహారాన్ని నోట కరచుకోగల సామర్థ్యం గరుడపక్షి సొంతం. అత్యంత ఏకాగ్రత ఇందులో ఇమిడి ఉంది. అందుకే గరుడ అంటే శక్తికి, ఏకాగ్రతకు చిహ్నం. చేసే విధానం: ఎడమ మోకాలు కొంచెం ముందుకు వంచి ఎడమకాలు మీద నిలబడి కుడికాలును పై నుంచి ఎడమకాలు చుట్టూ ట్విస్ట్ చేయాలి. ఎడమచేతిని ముఖానికి ఎదురుగా నిలువుగా ఉంచి కుడిచేతిని ఎడమ చేతి చుట్టూ ట్విస్ట్ చేస్తూ రెండు అరచేతులనూ దగ్గరగా నమస్కారముద్రలోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ కలిపి ఉంచిన రెండు చేతులను నమస్కార ముద్రలోనే పైకి తీసుకెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత క్రమంగా చేతుల్ని ఆ తరువాత కాళ్లను అన్‌లాక్ చేస్తూ సమస్థితికి రావాలి. అదే విధంగా రెండోవైపునకు కూడా చేయాలి. ఉపయోగాలు: వీపు పైభాగాలైన షోల్డర్ బ్లేడ్స్‌కి, ట్రెఫీజియస్ కండరాలకు, కాళ్లలో ఉన్న కండరాలు బలంగా తయారవడానికి బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసికంగా కూడా బలంగా తయారవుతారు. సాధారణ త్రికోణాసన కాళ్ల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం ఉంచాలి. ఎడమ పాదం పక్కకు, కుడిపాదం ముందుకు ఎడమపాదానికి సమాంతరంగా రెండు చేతులూ 180 డిగ్రీలలో సమాంతర రేఖలో భూమికి సమాంతరంగా ఉంచి శ్వాస తీసుకుంటూ నడుమును పూర్తిగా పక్కకు తిప్పాలి. శ్వాస వదిలేస్తూ కుడిచేయి కిందకు కుడి పాదం పక్కనే నేల మీదకు (నేల మీద పెట్టలేకపోతే కుడిపాదాన్ని కాని చీలమండను కాని లేదా మోకాలి కిందిభాగాన్ని కాని పట్టుకోవచ్చు) ఎడమ చేయి పైకి కుడిచేతికి సమాంతరంగా చాతీని నేలవైపు ముందుకు వంగిపోకుండా వీలైనంత పక్కకు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి, చేతులు భూమికి సమాంతరంగా తీసుకువచ్చి శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకు తీసుకురావాలి. రెండోవైపు కూడా ఇదే విధంగా చేయాలి. ఉపయోగాలు: శ్వాసకోస మరియు రక్తప్రసరణ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. వెన్నుపూసల అలైన్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. ఉపయోగాలు: వెన్నెముకను, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. లోయర్ బ్యాక్ సమస్యకు పరిష్కారం. గుండె, ఊపిరితిత్తుల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.