నేను మీ వెన్నుని | i am your Backbone | Sakshi
Sakshi News home page

నేను మీ వెన్నుని

Published Wed, Mar 2 2016 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

నేను మీ వెన్నుని

నేను మీ వెన్నుని

ఆనంద్ శరీరంలోని మిగిలిన అవయవాల కంటే నేనే తనను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాను. నేను ఆనంద్ వెన్నెముకను. దాదాపు ప్రతి ఏడాదీ తనకు నాతో ఇబ్బందులు తప్పవు. నేను పెట్టే బాధను తగ్గించుకోవడానికి తను కాపడం పెట్టడం, మర్దన చేయడం, మందులు తీసుకోవడం వంటివన్నీ చేస్తూ ఉంటాడు. నన్ను తను సరిగా చూసుకోకపోవడం వల్లనే నా ప్రతిస్పందనగా తనకు నొప్పులు కలిగిస్తుంటాను. నా నుంచి తలెత్తే సమస్యలను ఆనంద్ తనకు తానుగా పరిష్కరించుకోలేడు. ఇది నా లోపమే అనుకోండి. అయితే, ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడే నా పనితీరులో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేను నేలకు సమాంతరంగా వంతెనలా ఉండే బదులు, నేలలో నిటారుగా నాటిన గడకర్రలా మారాను. అలాగని నేను మరీ పెళుసుగా ఏమీ ఉండను. వంగగలను, మెలితిరగగలను, నాపై ఉన్న తలను అటూ ఇటూ తిప్పగలను. మరీ ముఖ్యంగా చాలావరకు శరీరభారాన్ని మోయగలను.

వెన్నుపాము నుంచే 31 జతల నరాలు
ఆనంద్‌కు గల 45 సెంటీమీటర్ల వెన్నుపాముకు నేను రక్షణ కల్పిస్తుంటాను. పూసలదండలోని దారంలా నా మధ్యగా సాగిపోయే తెల్లని వెన్నుపాము సెంటీమీటరు మందంలో ఉంటుంది. సున్నితమైన వెన్నుపాముకు నేను మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాను. నాలోని వెన్నుపాము నుంచే 31 జతల నరాలు శరీరమంతా పాకి ఉంటాయి. వీటిలో సగానికి సగం నరాలు మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగతావి మెదడు నుంచి వచ్చే ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వెన్నుపాము స్వయంగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్ పొరపాటున వేడి గిన్నె మీద చెయ్యి పెట్టాడనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసేంత సమయాన్ని కూడా వెన్నుపాము వృథా కానివ్వదు. వెంటనే అసంకల్పిత ప్రతీకార చర్యకు ఆదేశిస్తుంది. ఆనంద్ తన చేతిని చటుక్కున వెనక్కు తీసుకునేలా చేస్తుంది.
 
అలా వంపులు తిరుగుతా

ఆనంద్ పుట్టినప్పుడు నేను దాదాపు నిటారుగానే ఉంటాను. తను తల పెకైత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే నాలోని భాగం కాస్త వంపు తిరుగుతుంది. ఆనంద్ పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే నాలోని భాగం కూడా వంపు తిరుగుతుంది. ఇప్పుడు నేను అస్పష్టంగా రాసిన ఇంగ్లీష్ అక్షరం ‘ఎస్’ ఆకారంలో ఉన్నాను. నిజానికి ఎలాంటి వంపులు లేని సరళరేఖ ఆకారం కంటే ఇదే నాకు అనువైన ఆకారం. నాలోని వంపులే నాకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. వంపులు మాత్రమే కాదు, నాలో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే లేకుంటే, నాలోని పూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. నాలోని పూసల మధ్య కుషన్‌లాంటిది ఉంటుంది. దానినే మృదులాస్థి (కార్టిలేజ్) అంటారు. అందులో ఉండే జెల్లీలాంటి పదార్థమే నన్ను కుదుపుల బారి నుంచి కాపాడుతూ ఉంటుంది.
 
నొప్పులన్నిటికీ నేనే కారణం కాదు
అయితే, ఆనంద్ వెన్నులో తలెత్తే అన్ని రకాల నొప్పులకూ నేనే కారణం కాదు. వెన్నులో చాలాసార్లు తలెత్తే నొప్పులకు ఇతరేతర కారణాలు కూడా ఉండొచ్చు. కిడ్నీల్లో సమస్యలు ఉన్నా, లివర్ లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా, ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే కండరాలు బిగుసుకుంటాయి. రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల నాకు నొప్పులు తప్పవు. ఆనంద్ అలాంటి భావోద్వేగాల నుంచి తేరుకుంటే, నేను కూడా త్వరగా కోలుకుంటాను. కాస్త తీవ్రంగా నొప్పి కలిగితే, నా డిస్కులు జారిపోయాయనుకుంటాడు ఆనంద్. అదృష్టవశాత్తు అతడికి ఇంతవరకు అలాంటి ప్రమాదమేదీ కలగలేదు. రోడ్డు ప్రమాదం వంటి సంఘటనల్లో తీవ్ర గాయమేదైనా అయితే తప్ప నా డిస్కులు అంత తేలికగా దెబ్బతినవు. నా పూసల మీద భారీ దెబ్బ ఏదైనా తగిలితే వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నన్ను అంటిపెట్టుకున్న కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దెబ్బతినడం వల్ల నా పూసలు రాపిడికి గురై, వెన్నుపూస నుంచి వ్యాపించే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. ఈ నొప్పి అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. ఒకరకంగా ఈ నొప్పి జాగ్రత్తకు సంకేతం. దెబ్బతిన్న వెన్నుపూసలు మరింత దెబ్బతినకుండా వాటి కదలికలను నివారించేందుకు దోహదపడుతుంది.
 
శరీర భారంతో పెరిగే నొప్పులు
చాలామంది నడి వయస్కుల్లాగే ఆనంద్‌కు కూడా నా భాగంలో నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులన్నీ నన్ను అంటిపెట్టుకున్న కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చినవే. ప్రతి వారం గోల్ఫ్ ఆడే ఆనంద్... ఆ మాత్రం వ్యాయామంతోనే నేను దృఢంగా ఉంటాననుకుంటాడు. కానీ, అది సరికాదు. నన్ను అంటిపెట్టుకుని ఉండే నాలుగువందల కండరాలు, వెయ్యి లిగమెంట్ల నిర్మాణాన్ని తెలుసుకుంటే ఆనంద్ ఆశ్చర్యపోతాడు. ఆనంద్ ఇటీవల నాలుగు కిలోల బరువు పెరిగాడు. అతడి పొట్టవద్ద పేరుకుపోయిన కొవ్వువల్ల ఏర్పడిన భారాన్ని నేనే మోయాలి. మెత్తని కుషన్ సోఫాల్లో, కుర్చీల్లో అడ్డదిడ్డంగా కూర్చుంటూ విశ్రాంతి తీసుకుంటున్నానని అనుకుంటాడు ఆనంద్. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి విశ్రాంతీ ఉండదు. పైగా నాపై అదనపు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అతడు నాపై ఎక్కువగా భారం మోపకుండా, కాళ్లకు, చేతులకు పని చెబితేనే నేను క్షేమంగా ఉంటాను.
 
వెన్నుపూస నిర్మాణం

తల వెనుక మెడను అంటిపెట్టుకుని ఉండే నా పైభాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. ఇవి పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. నడుము భాగంలో ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. శరీర బరువును చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి.
 
 
మన వీపు భాగంలో అందరికీ ఒక ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ షేప్ ఆకృతి ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ఎస్ షేప్‌డ్ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన వంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్‌మెంట్‌లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది.
 
కొద్దిపాటి జాగ్రత్తలతో వెన్ను క్షేమం...
నిలబడే సమయంలో వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవడం.  వెన్నును అంటిపెట్టుకున్న కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి.  కంప్యూటర్ ముందు కూర్చునే వెన్ను వంగిపోకుండా జాగ్రత్త పడటం బరువులు ఎత్తే సమయం అకస్మాత్తుగా వంగకుండా, కూర్చొని మెల్లగా ఎత్తడం వంటి జాగ్రత్తలతో వెన్ను పదిలంగా ఉంటుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement