Nerves
-
నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!
జెనీవా: పక్షవాత రోగులకు శుభవార్త. నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స, మెరుగైన ఫిజియోథెరపీ ద్వారా పక్షవాతానికి చెక్ పెట్టడంలో వైద్య పరిశోధక బృందం విజయం సాధించింది. తొమ్మిది మంది పక్షవాత రోగులు ఈ రెండు చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకుని తిరిగి నడవగలిగారు! వీరంతా వెన్నుముక తీవ్రంగా దెబ్బతినడం వల్ల పక్షవాతం బారిన పడ్డవారే! ఈ ప్రయోగాత్మక చికిత్స ఫలితం పట్ల పరిశోధకులు, వైద్యులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రయోగం... ‘స్విస్ రీసెర్చ్ గ్రూప్ న్యూరో రీసెర్చ్’ అనే పరిశోధక బృందం ఇటీవల ఓ ప్రయోగం జరిపింది. దీన్ని తొలుత ఎలుకలపై జరిపిన అనంతరం మనుషులను ఎన్నుకుంది. వీరంతా ప్రమాదాల్లో నడకకు తోడ్పడే వెన్నెముక చివరి భాగంలోని కీలక నరాల సమూహమైన లంబార్ న్యూరాన్లు దెబ్బతిన్నవారే. దాంతో నడివాల్సిందిగా మెదడు ఇచ్చే ఆదేశాలు కాళ్లను చేరవు. ఫలితం...? శాశ్వత పక్షవాతం! ఇలాంటి 9 మంది రోగులకు స్వీస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాసెన్నేకు చెందిన క్లాడియా కేథీ అనే న్యూరో సైంటిస్ట్ బృందం ఎపిడ్యూరల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చింది. తద్వారా నడకకు తోడ్పడే నరాలను ఉద్దీపింపజేసింది. ఇందుకోసం శస్త్రచికిత్స ద్వారా వెన్నుపాములో న్యూరో ట్రాన్స్మిటర్ అమర్చారు. దాని ద్వారా వెన్నెముక ఉత్తేజితమయ్యేలా చూశారు. దీంతోపాటు రొబో టిక్ ప్రక్రియలతో ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చారు. వారిని పలు దిశల్లో కదిలించడంతోపాటు నడిపించారు. దాంతో రోగులు ఐదు నెలల్లోనే నడవడం,వాకర్ సాయంతో మెట్లెక్కడం మొదలుపెట్టారు. కొత్త మార్గం దొరికినట్టే... ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్‌తో పాటు అక్కడి కణజాలం పనితీరుపై స్పేషియల్ ట్రాన్స్క్రిప్టోమెటిక్స్ టెక్నిక్ సాయంతో కేథీ బృందం అవగాహనకు వచ్చింది. ‘‘వెన్నెముకకు గాయమయ్యాక కోలుకునేందుకు ఎస్సీ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 అనే న్యూరాన్లతో తయారైన కణజాలం సాయపడుతుందని గుర్తించాం. బ్రెయిన్‌స్టెమ్ నుంచి అందే ఆదేశాలను అమల్లో పెట్టేందుకు వీలుగా ఈ నాడీ కణజాలం చాలా విలక్షణమైన రీతిలో అమరి ఉంది. నడకకు అవే దోహదపడ్డాయి’’ అని కేథీ వివరించారు. అయితే, ‘అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎస్సీ టు ద పవర్ ఆఫ్ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 కణజాలం పక్షవాతం తర్వాత కోలుకుని నడకకు దోహదపడే ప్రాథమిక అంశాలన్నది మా పరిశోధనలో తేలింది. పక్షవాత చికిత్సలో కొత్త పద్ధతులకు ఈ అవగాహన మార్గాలు తెరచినట్టే’’ అంటూ ముక్తాయించారు. -
కాళ్లూ చేతులూ తిమ్మిర్లు, చేతులు వణుకుతున్నాయా? కారణాలు, పరిష్కారాలు
కాళ్లూ చేతులు తిమ్మిర్లు రావడం, ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు ఎత్తలేకపోవడం, పట్టేసినట్టుగా ఉండడం, చేతులలో ఒక్కొక్కసారి వణుకు వస్తుంటుంది. ఇది నరాల బలహీనతకు సంకేతం. ఇంతకూ నరాల బలహీనత ఎందుకు వస్తుందో, రాకుండా ఏం చేయాలో చూద్దాం... ⇔ నరాల బలహీనత అనేది ఒత్తిడి కారణంగా, పని మీద శ్రద్ధ లేకపోయినా ఒత్తిడి వల్ల చెయ్యడం వంటి కారణాల వల్ల వస్తుంది. ⇔ ముఖ్యంగా చెప్పాలంటే నరాలలో రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం, మెదడులోనూ, వెన్నెముకలోనూ రక్త సరఫరా తగ్గిపోవడం, కుంగుబాటు వల్ల్ల నరాల బలహీనత వస్తుంది. ⇔ వ్యాయామం చేయడం, సరైన పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ఇలాంటివి చెయ్యాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవాలి. ⇔ అలాగే మాంసాహారం తినని వాళ్ళు పప్పు దినుసులు పనీర్ లాంటివి తీసుకోవడం మంచిది. ∙మద్యపానానికి దూరంగా ఉండాలి. ⇔ ముఖ్యంగా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని కల్పించుకుని చెయ్యడం అవసరం. ∙6 నుంచి 8 గంటలు నిద్రపోవడం, వ్యాయామం చెయ్యడం. ⇔ సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన నరాల బలహీనతను మందులు వాడకుండా మొదట్లోనే నివారించుకోవచ్చు. ⇔ ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే సూత్రాన్ని పాటించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సమస్య శ్రుతి మించుతున్నట్లు అనిపిస్తే వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం. -
తీవ్రమైన వెన్ను నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 39 ఏళ్లు. విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. ఎక్కువగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. చికిత్స: మెడ ఫ్రీగా తిరగకుండా పట్టేసినట్లుగా ఉన్నవారికి యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్క్యులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నాడుల పెరుగుదలకు కొత్త పద్ధతి
ప్రమాదాలు.. గాయాలు.. ఆ మాటకొస్తే స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లపై ఎక్కువగా టైపింగ్ చేసినా సరే.. శరీరంలోని కొన్ని నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా చేతులు, కాళ్లలో తిమ్మిరి, బలహీనత, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటివరకూ ఈ పెరిఫరల్ న్యూరోపతికి చికిత్స కొన్ని నెలలపాటు మందులు వాడటమే. అయితే వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని సమీప భవిష్యత్తులో దెబ్బతిన్న నాడులను వేగంగా నయం చేసే వీలుంది. శరీరంలోకి జొప్పించగల చిన్న పరికరం ద్వారా నాడులకు క్రమంగా విద్యుత్ ప్రచోదనాలు అందించడం ద్వారా ఎలుకల్లో తాము నాడీ గాయాలు వేగంగా మానిపోయేలా చేయగలిగామని విల్సన్ జాక్ రే అనే శాస్త్రవేత్త తెలిపారు. పావలా కాసంత ఉండే ఈ పరికరం రెండు వారాల్లోపు నిరపాయకరంగా శరీరంలో కరిగిపోతుందని అన్నారు. విద్యుత్ ప్రచోదనాలతో నాడులు మళ్లీ పెరిగేలా చేయవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ ఎలా దీన్ని సాధ్యం చేయాలన్నది ఇప్పటివరకూ సమస్యగా ఉండిందని, కొత్త పరికరంతో ఈ సమస్య తీరినట్లేనని జాక్ రే తెలిపారు. మెదడులోని న్యూరాన్లు, వెన్నెముక నాడులను మినహాయిస్తే మిగిలినవి మళ్లీ పెరిగేలా చేయవచ్చు. విద్యుత్తు ప్రచోదనాల ఫలతంగా కొన్ని ప్రొటీన్లు విడుదలై గాయం వేగంగా మానుతుందని అంచనా. -
నాడులను మారిస్తే.. కదలిక వచ్చింది
పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోతే తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫిజియోథెరపీతో కొందరిలో మార్పు వచ్చే అవకాశమున్నా కాస్త శ్రమ, సమయం తప్పదు. కెనడాలో ఇటీవల జరిగిన ఓ శస్త్రచికిత్స పుణ్యమా అని ఇకపై ఆ పరిస్థితి మారనుంది. ఈ ఆపరేషన్ ద్వారా తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయిన ఓ వ్యక్తి తన చేతులను మళ్లీ కదిలించగలిగాడు. టిమ్ రాగ్లిన్ అనే వ్యక్తి 2007లో ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో టిమ్‌కు ఒట్టావా ఆస్పత్రి డాక్టర్ క్రిస్టీ బాయిడ్ సరికొత్త శస్త్రచికిత్స చేశారు. టిమ్ శరీరంలో సక్రమంగా పనిచేసే కొన్ని నాడీ కణాలను గుర్తించి వాటిని అతడి చేతుల్లోకి చొప్పించారు. దాదాపు ఏడాది పాటు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా ఆ తర్వాత అతడి చేతుల్లో చిన్న కదలికలు మొదలయ్యాయి. కొత్తగా అమర్చిన నాడులు అంతకంతకూ పెరుగుతూ ముడుచుకుపోయిన వేళ్లను విడదీయగలిగే స్థాయికి చేరాయి. అయితే ప్రస్తుతం చిన్నచిన్న పనులకే కండరాలు అలసిపోతున్నాయని టిమ్ పేర్కొంటున్నాడు. నాడులు మరింతగా బలపడితే సాధారణ పనులు చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
నేను మీ వెన్నుని
ఆనంద్ శరీరంలోని మిగిలిన అవయవాల కంటే నేనే తనను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాను. నేను ఆనంద్ వెన్నెముకను. దాదాపు ప్రతి ఏడాదీ తనకు నాతో ఇబ్బందులు తప్పవు. నేను పెట్టే బాధను తగ్గించుకోవడానికి తను కాపడం పెట్టడం, మర్దన చేయడం, మందులు తీసుకోవడం వంటివన్నీ చేస్తూ ఉంటాడు. నన్ను తను సరిగా చూసుకోకపోవడం వల్లనే నా ప్రతిస్పందనగా తనకు నొప్పులు కలిగిస్తుంటాను. నా నుంచి తలెత్తే సమస్యలను ఆనంద్ తనకు తానుగా పరిష్కరించుకోలేడు. ఇది నా లోపమే అనుకోండి. అయితే, ఆనంద్ పూర్వీకులు నిటారుగా నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడే నా పనితీరులో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేను నేలకు సమాంతరంగా వంతెనలా ఉండే బదులు, నేలలో నిటారుగా నాటిన గడకర్రలా మారాను. అలాగని నేను మరీ పెళుసుగా ఏమీ ఉండను. వంగగలను, మెలితిరగగలను, నాపై ఉన్న తలను అటూ ఇటూ తిప్పగలను. మరీ ముఖ్యంగా చాలావరకు శరీరభారాన్ని మోయగలను. వెన్నుపాము నుంచే 31 జతల నరాలు ఆనంద్‌కు గల 45 సెంటీమీటర్ల వెన్నుపాముకు నేను రక్షణ కల్పిస్తుంటాను. పూసలదండలోని దారంలా నా మధ్యగా సాగిపోయే తెల్లని వెన్నుపాము సెంటీమీటరు మందంలో ఉంటుంది. సున్నితమైన వెన్నుపాముకు నేను మూడు పొరల రక్షణ కల్పిస్తుంటాను. నాలోని వెన్నుపాము నుంచే 31 జతల నరాలు శరీరమంతా పాకి ఉంటాయి. వీటిలో సగానికి సగం నరాలు మెదడుకు సమాచారం చేరవేస్తూ ఉంటాయి. మిగతావి మెదడు నుంచి వచ్చే ఆదేశాలను శరీరంలోని వివిధ కండరాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వెన్నుపాము స్వయంగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆనంద్ పొరపాటున వేడి గిన్నె మీద చెయ్యి పెట్టాడనుకోండి... ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసేంత సమయాన్ని కూడా వెన్నుపాము వృథా కానివ్వదు. వెంటనే అసంకల్పిత ప్రతీకార చర్యకు ఆదేశిస్తుంది. ఆనంద్ తన చేతిని చటుక్కున వెనక్కు తీసుకునేలా చేస్తుంది. అలా వంపులు తిరుగుతా ఆనంద్ పుట్టినప్పుడు నేను దాదాపు నిటారుగానే ఉంటాను. తను తల పెకైత్తడం మొదలుపెట్టినప్పుడు మెడ వద్ద ఉండే నాలోని భాగం కాస్త వంపు తిరుగుతుంది. ఆనంద్ పాకడం నేర్చుకునేటప్పుడు తన నడుము వద్ద ఉండే నాలోని భాగం కూడా వంపు తిరుగుతుంది. ఇప్పుడు నేను అస్పష్టంగా రాసిన ఇంగ్లీష్ అక్షరం ‘ఎస్’ ఆకారంలో ఉన్నాను. నిజానికి ఎలాంటి వంపులు లేని సరళరేఖ ఆకారం కంటే ఇదే నాకు అనువైన ఆకారం. నాలోని వంపులే నాకు షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేస్తాయి. వంపులు మాత్రమే కాదు, నాలో మరికొన్ని షాక్ అబ్జార్బర్స్ కూడా ఉన్నాయి. అవే లేకుంటే, నాలోని పూసలు ఒకదానికొకటి తాకినప్పుడు రాపిడికి గురై, అరిగిపోయేవి. నాలోని పూసల మధ్య కుషన్లాంటిది ఉంటుంది. దానినే మృదులాస్థి (కార్టిలేజ్) అంటారు. అందులో ఉండే జెల్లీలాంటి పదార్థమే నన్ను కుదుపుల బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. నొప్పులన్నిటికీ నేనే కారణం కాదు అయితే, ఆనంద్ వెన్నులో తలెత్తే అన్ని రకాల నొప్పులకూ నేనే కారణం కాదు. వెన్నులో చాలాసార్లు తలెత్తే నొప్పులకు ఇతరేతర కారణాలు కూడా ఉండొచ్చు. కిడ్నీల్లో సమస్యలు ఉన్నా, లివర్ లేదా ప్రొస్టేట్ సరిగా పనిచేయకపోయినా, ఆర్థరైటిస్, ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నా, ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలకు గురైనా వెన్నునొప్పి రావచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే కండరాలు బిగుసుకుంటాయి. రోజుల తరబడి తీవ్ర భావోద్వేగాలు కొనసాగితే బిగుసుకున్న కండరాల వల్ల నాకు నొప్పులు తప్పవు. ఆనంద్ అలాంటి భావోద్వేగాల నుంచి తేరుకుంటే, నేను కూడా త్వరగా కోలుకుంటాను. కాస్త తీవ్రంగా నొప్పి కలిగితే, నా డిస్కులు జారిపోయాయనుకుంటాడు ఆనంద్. అదృష్టవశాత్తు అతడికి ఇంతవరకు అలాంటి ప్రమాదమేదీ కలగలేదు. రోడ్డు ప్రమాదం వంటి సంఘటనల్లో తీవ్ర గాయమేదైనా అయితే తప్ప నా డిస్కులు అంత తేలికగా దెబ్బతినవు. నా పూసల మీద భారీ దెబ్బ ఏదైనా తగిలితే వాటి మధ్య కుషన్‌లా ఉన్న కార్టిలేజ్ దెబ్బతింటుంది. అందులోని జెల్లీలాంటి పదార్థం బయటకు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నన్ను అంటిపెట్టుకున్న కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దెబ్బతినడం వల్ల నా పూసలు రాపిడికి గురై, వెన్నుపూస నుంచి వ్యాపించే సయాటికా నరంపై ఒత్తిడి కలిగిస్తాయి. ఈ నొప్పి అరిపాదాల వరకు వ్యాపిస్తుంది. ఒకరకంగా ఈ నొప్పి జాగ్రత్తకు సంకేతం. దెబ్బతిన్న వెన్నుపూసలు మరింత దెబ్బతినకుండా వాటి కదలికలను నివారించేందుకు దోహదపడుతుంది. శరీర భారంతో పెరిగే నొప్పులు చాలామంది నడి వయస్కుల్లాగే ఆనంద్‌కు కూడా నా భాగంలో నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులన్నీ నన్ను అంటిపెట్టుకున్న కండరాలు బలహీనంగా మారడం వల్ల వచ్చినవే. ప్రతి వారం గోల్ఫ్ ఆడే ఆనంద్... ఆ మాత్రం వ్యాయామంతోనే నేను దృఢంగా ఉంటాననుకుంటాడు. కానీ, అది సరికాదు. నన్ను అంటిపెట్టుకుని ఉండే నాలుగువందల కండరాలు, వెయ్యి లిగమెంట్ల నిర్మాణాన్ని తెలుసుకుంటే ఆనంద్ ఆశ్చర్యపోతాడు. ఆనంద్ ఇటీవల నాలుగు కిలోల బరువు పెరిగాడు. అతడి పొట్టవద్ద పేరుకుపోయిన కొవ్వువల్ల ఏర్పడిన భారాన్ని నేనే మోయాలి. మెత్తని కుషన్ సోఫాల్లో, కుర్చీల్లో అడ్డదిడ్డంగా కూర్చుంటూ విశ్రాంతి తీసుకుంటున్నానని అనుకుంటాడు ఆనంద్. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి విశ్రాంతీ ఉండదు. పైగా నాపై అదనపు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అతడు నాపై ఎక్కువగా భారం మోపకుండా, కాళ్లకు, చేతులకు పని చెబితేనే నేను క్షేమంగా ఉంటాను. వెన్నుపూస నిర్మాణం తల వెనుక మెడను అంటిపెట్టుకుని ఉండే నా పైభాగంలో ఏడు ఎముకలు ఉంటాయి. వీటిని సెర్వికల్ వెర్టిబ్రే అంటారు. ఛాతీ వెనుక 12 ఎముకలు ఉంటాయి. వీటినే థొరాసిక్ వెర్టిబ్రే అంటారు. ఇవి పక్కటెముకలు వీటిని అతుక్కుని ఉంటాయి. నడుము భాగంలో ఐదు బరువైన ఎముకలను లంబార్ వెర్టిబ్రే అంటారు. శరీర బరువును చాలా వరకు భారాన్ని ఇవే మోస్తాయి. మన వీపు భాగంలో అందరికీ ఒక ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’ షేప్ ఆకృతి ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ఎస్ షేప్డ్ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్) ప్రాంతం తన వంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్ లేదా మిడ్ బ్యాక్), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్మెంట్లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో వెన్ను క్షేమం... నిలబడే సమయంలో వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవడం. వెన్నును అంటిపెట్టుకున్న కండరాలు బలహీనం కాకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయాలి. కంప్యూటర్ ముందు కూర్చునే వెన్ను వంగిపోకుండా జాగ్రత్త పడటం బరువులు ఎత్తే సమయం అకస్మాత్తుగా వంగకుండా, కూర్చొని మెల్లగా ఎత్తడం వంటి జాగ్రత్తలతో వెన్ను పదిలంగా ఉంటుంది.