అప్పుల బాధతో ఓ యువ రైతు తన ఐదేళ్ల కుమారునికి పురుగుల మందుతో కలిపిన అన్నం తినిపించి తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన అనంతపురం జిల్లా కుందర్పిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...ఏడాది క్రితం తండ్రి చెన్నరాయప్పతో విడిపోయిన సజ్జన నాగన్న (36) భార్య, కుమారుడు ముఖేష్(5), హిమాచల్ (7)తో కలిసి వేరుకాపురం పెట్టాడు. తన వాటాగా వచ్చిన 4 ఎకరాలు వచ్చింది. అయితే అంతా మెట్టభూమి కావడంతో కాస్త సాగునీరందింతే బిందుసేద్యంతో పంటలు సాగుచేయాలని భావించాడు. దీంతో వెంటనే స్థానికుల వద్ద అప్పులు చేసి ఒకటి తర్వాత ఒకటి ఐదు బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడకపోగా, 4 లక్షల అప్పులు మిగిలాయి.
అప్పులు తీర్చే మార్గం కనిపించక , కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక నిత్యం సతమయ్యాడు. ఈ పరిస్థితుల్లోనే ఏడు నెలల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఓ వైపు అప్పుల కుప్పలు, మరోవైపు భార్య దూరం కావడంతో పాటు పిల్లల ఆలనా, పాలానా చూసే వారు కరువవడంతో నాగన్న జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున తన చిన్న కుమారుడు ముఖేష్ (5)కు పురుగు మందు కలిపిన అన్నం తినిపించించాడు. అనంతరం తానూ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబీకులు గమనించేలోగానే తండ్రీకొడుకు విగతజీవులుగా కనిపించారు. కాగా నాగన్న పెద్ద కుమారుడు హిమాచల్ పక్కింట్లో నిద్రిస్తుండడంతో బతికి బయట పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుందుర్పి పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాను విషం తాగి.. కుమారుడిని చంపి..
Published Sun, May 22 2016 8:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement