కేసీఆర్ కుటుంబానికే సంబరాలు
► మెట్‌పల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతుల ఆందోళన
► చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్
మెట్‌పల్లి(జగిత్యాల): తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెట్‌పల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవడంతో పాటు గత సీజన్‌కు సంబంధించిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ డివిజన్‌కు చెందిన రైతులు ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెరుకు రైతుల సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నిజాందక్కన్ చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటిని మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తి ఫ్యాక్టరీకి ప్రయోజనం కలిగించడానికే ఎన్‌డీసీఎల్ ఫ్యాక్టరీలు మూసివేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని.. ప్రభుత్వ విధానాలతో ఉన్న ఫ్యాక్టరీలు మూతబడడంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా కేసీఆర్ మేల్కొని ఫ్యాక్టరీలు తెరవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా కేసీఆర్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ ఏవో సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కంది బుచ్చిరెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు నల్ల గంగారెడ్డి, బాపురెడ్డి, లింగారెడ్డి, లింబారెడ్డి, మల్లారెడ్డి, ధర్మారెడ్డి, రాజేందర్ తదితరులు ఉన్నారు.