ఇక క్షేత్ర స్థాయి పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: నూతన రాష్ట్రంలో ఇన్నాళ్లూ అభివృద్ధి ప్రణాళికల తయారీకి ప్రాధాన్యత ఇచ్చామని.. ప్రతీ రంగంలో ప్రణాళికలను సిద్ధం చేసినందున వాటి అమలు కోసం ఇకపై క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజలతో నేరుగా భేటీ అయ్యేందుకు త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్ మడత రమతో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకట్‌గౌడ్, 13 మంది కౌన్సిలర్లు, పినపాక జెడ్పీటీసీ సభ్యురాలు జాడి జానమ్మ, కూసుమంచి ఎంపీపీ వెంకటరెడ్డి, ఇల్లందు, వైరా నియోజకవర్గాలకు చెందిన 14 మంది ఎంపీటీసీ సభ్యులు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల కోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని చేపట్టామని, రెండు తరాలకు ఉపయోగపడేలా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపా రు. బీసీలతో పాటు రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తిం ప చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చుతామన్నారు. మైనార్టీలు, దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఖమ్మంలోని అన్ని ప్రాంతాలకూ సాగునీరు
గోదావరి జలాలను తరలించడం ద్వారా ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పా రు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను మిళితం చే సి ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్ర ణాళికలు రూపొందించామన్నారు. రాజకీయం గా, అభివృద్ధి పరంగా ఖమ్మం జిల్లా నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందన్నారు. ఖమ్మం పట్టణానికి ఈ ఏడాది రెండు వేల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు కనకయ్య, మదన్‌లాల్, వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బేగ్ తదితరులు పాల్గొన్నారు.