‘ఉద్ధండ’ వేడుక | The foundation stone of the capital of Andhra Pradesh Amravati | Sakshi
Sakshi News home page

‘ఉద్ధండ’ వేడుక

Published Wed, Oct 21 2015 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

‘ఉద్ధండ’ వేడుక - Sakshi

‘ఉద్ధండ’ వేడుక

♦ సర్వాంగ సుందరంగా ఉద్ధండరాయునిపాలెం
♦ మూడు వేదికలు సిద్ధం.. రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ
♦ శంకుస్థాపన ప్రాంతం మొత్తం కలియతిరిగిన ముఖ్యమంత్రి
♦ ‘మన నీరు-మన మట్టి’ని నిక్షిప్తం చేసేందుకు ప్రత్యేక కట్టడం
♦ భూములిచ్చిన స్థానికేతరులకు అందని ఆహ్వానాలు
♦ వ్యవసాయ కార్మికులు, కౌలుదారులను విస్మరించిన సర్కారు
 
 ఉద్ధండరాయునిపాలెం నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి:
 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఉద్ధండరాయునిపాలెం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శంకుస్థాపనను కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన జరిగే ప్రాంతం ఉద్ధండరాయునిపాలెంకు చేరుకుని ఏర్పాట్లన్నీ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం రెండు గంటల పాటు కలియదిరిగి అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టరు, జేసీలతో విడిగా అరగంటపాటు చర్చించారు. శంకుస్థాపనకు వెళ్లే అన్ని మార్గాలను రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని మరీ పరిశీలించారు. ప్రధాని మోదీ ఆసీనులయ్యే ప్రధాన వేదిక నుంచే యాగశాల, శంకుస్థాపన స్థలం, ప్రాంగణం ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతిని వెలిగించారు. ఎస్పీజీ ఐజీ పీయూష్ పాండే ఆధ్వర్యంలో సభా వేదిక పక్కన ఏర్పాటు చేసిన ప్రధాని దిగే హెలిప్యాడ్‌ల నుంచి కాన్వాయ్‌లు, రెండు నేవీ హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. శంకుస్థాపన ప్రాంగణం, వేదిక పరిసరాలన్నీ ప్రధాని ప్రత్యేక భద్రతా అధికారులు అణువణువూ పరిశీలించారు. ప్రధాని సేద తీరేందుకు ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరాన్ని తనిఖీ చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన క్రతువైన హోమం, పూజలు జరిపేందుకు వీలుగా నిర్మించిన యాగశాలలో రాష్ట్ర మంత్రులంతా పూజలు నిర్వహించారు.

శంకుస్థాపన ప్రదేశంలో మొత్తం మూడు వేదికలు నిర్మించారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు ఉప వేదికలు నిర్మించారు. ప్రధాన వేదికకు ఎదురుగా సాంస్కృతిక కళా వేదిక నిర్మించారు. ఉప వేదికలో ఓ దానిపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆసీనులయ్యేలా ఆదేశాలు జారీ అయ్యాయి. మరో ఉప వేదికపై భారత రాయబారులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక ప్రముఖులు ఉంటారు. వీఐపీ, వీవీఐపీలు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కూర్చొనేందుకు వీలుగా ప్రధాన వేదికకు అభిముఖంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి అమరావతి సంకల్ప యాత్ర పేరిట నీరు-మట్టిని ప్రత్యేక వాహనాల్లో మంగళవారం సాయంత్రానికి సభా ప్రాంగణం వద్దకు చేర్చారు.

నీరు-మట్టిని నిక్షిప్తం చేసేందుకు వేదిక వద్దే ప్రత్యేక కట్టడాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు 500 మీటర్ల దూరంలోనే పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. రాజధాని శంకుస్థాపన జరిగే ప్రధాన వేదిక వెనుక ‘అమరావతీ గ్యాలరీ’ని ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే దిశగా జాతీయ రహదారులపై వాహనాల మళ్లింపులు చేపట్టాలని డీజీపీ జేవీ రాముడు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ 300 బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు బస్సుల్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ నుంచి సూచనలు అందాయి.

ఇదిలా ఉండగా, శంకుస్థాపనకు గడువు సమీపించినా ఆహ్వానపత్రికల పంపిణీ పూర్తికాలేదు. రాజధాని ప్రాంతంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆహ్వాన పత్రికలు అందనేలేదు. మరోవైపు వ్యవసాయ కార్మికులు, కౌలుదారులను పూర్తిగా విస్మరించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన స్థానికేతరులకు ఆహ్వాన పత్రాలు అందకపోవడంతో వారు ఇంకా ఎదురుచూపుల్లోనే ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement