బంగారు తెలంగాణకు బాటలు | The golden paths of Telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు బాటలు

Published Wed, Aug 16 2017 1:03 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

బంగారు తెలంగాణకు బాటలు

బంగారు తెలంగాణకు బాటలు

అభివృద్ధిలో పరుగులు పెడుతున్న జిల్లా..
అనేక పథకాల్లో ముందంజ
మొక్కల సంరక్షణ బాధ్యులకు అభినందనలు
ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌తో   రెండు పంటలకు నీరు
స్వాతంత్య్ర వేడుకల్లో చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌


జగిత్యాల: గ్రామీణప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. ఈ ప్రభుత్వ సంకల్పంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతోపాటు అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని చారిత్రాత్మక ఖిలాలో జాతీయ పతాకాన్ని మంగళవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న త్యాగధనులకు కొప్పుల నివాళులర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో, అహింస, శాంతి మార్గంలో తెలంగాణను సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మూడేళ్లలో జిల్లా గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు. అనేక పథకాల అమలులో జగిత్యాల మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా  నిలిచిందన్నారు.

హరితహారం అమలులో భాగంగా ఈ ఏడాది 1.32 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, 125 నర్సీలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 70లక్షల మొక్కలు నాటామని వివరించారు. 1,669 హరిత దళాలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. జిల్లాలో మొక్కల సంరక్షణకు బాధ్యత తీసుకున్న వారిని అభినందించారు. హరితహారం విజయవంతం చేసేందుకు జిల్లాకు ఒక రాష్ట్ర, ఏడు జిల్లా స్థాయి హరితమిత్ర అవార్డులు రావడం గర్వకారణమన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.71లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉండేలా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని ఎస్సారెస్పీకి తరలించి జిల్లాలోని ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు నీరందించే వీలు కలుగుతుందన్నారు. రోళ్లవాగు ఆధునీకరణతో పదివేల ఎకరాల ఆయకట్టుతోపాటు అదనంగా మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరందించే వీలు ఏర్పడిందని తెలిపారు.

మూడో విడత మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో రూ.32 కోట్లతో 162 చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా జిల్లాలో రూ.1,430 కోట్లతో చేపట్టిన ప్రధాన పైప్‌లైన్లు, హెడ్‌వర్క్స్, నీటిశుద్ధిప్లాంట్ల పనులు, రూ. 224 కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్‌ పైప్‌లైన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు గోదావరి జలాలను నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందజేస్తామన్నారు.

తెల్లకాగితం ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులకు భూహక్కులు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన సాదాబైనామా కార్యక్రమం మంచి ఫలితాలిచ్చిందన్నారు. మొత్తం 67వేల దరఖాస్తులు రాగా, 50వేల దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచామని చెప్పారు. అపరిష్కృత భూసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జమీన్‌బందీ కార్యక్రమంతో జిల్లావ్యాప్తంగా వచ్చిన 19వేల పైచిలుకు సమస్యలను పరిష్కరించామన్నారు.

గత రబీలో అంచనాలకు మించి ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే జగిత్యాల అగ్రగామిగా నిలిచిందన్నారు. ధాన్యం సేకరణలో జగిత్యాల ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌ శరత్‌ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించిందని చెప్పారు.  వ్యవసాయ రుణప్రణాళికలో భాగంగా ఇప్పటికే 37వేల మంది రైతులకు రూ.248 కోట్లు అందజేశామన్నారు. రుణమాఫీ కింద నాలుగు విడతల్లో 99వేల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.389 కోట్లు జమ చేశామని వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.6.12కోట్ల వ్యయంతో 147 ట్రాక్టర్లను 50 రాయితీపై రైతులకు అందజే శామన్నారు.

కేజీ టు పీజీ ఉచిత విద్య అమలులో భాగంగా జిల్లాలో మూడు బీసీ, ఐదు మైనార్టీ, నాలుగు ఎస్సీ, ఒక మహిళా డిగ్రీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.53 కోట్లతో అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ, స్త్రీశక్తి భవనాలతో పాటు వ్యవసాయ గోడౌన్లు, సీసీ రోడ్లు పూర్తిచేశామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ సత్ఫలితాలిస్తోందన్నారు. 60శాతం ప్రసవాలు సర్కారు ఆస్పత్రుల్లో జరగడం అభినందనీయమన్నారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, నేత, బీడీ, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు 2,06,157 పెన్షన్లు కోసం రూ. 21కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్‌ నిరంతరాయంగా అందజేస్తున్నామని చెప్పారు. టీ–ఎస్‌ ఐపాస్‌ కింద ఇప్పటివరకు రూ. 262 కోట్లతో 61 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటి ద్వారా 872 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 5,400 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ. 290 కోట్లు మంజూరు చేశామన్నారు.

భూమి లేని 484 మంది నిరుపేద దళితులను గుర్తించి 548 ఎకరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు జిల్లాలో 1030 మంది బీసీలకు రూ.5కోట్లు, 258 ఎస్సీలకు రూ.1.35 కోట్లు, 35 మంది ఎస్టీలకు రూ.18.57లక్షలు, 205 మంది మైనార్టీలకు రూ.1.05కోట్ల ఆర్థికసాయం అందజేశామన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం 10,557 మందికి యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు రూ.31కోట్లతో 3,352 యూనిట్లు పంపిణీచేశామని చెప్పారు. ఈ పథకంలోనూ జగిత్యాల రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. గుడుంబారహిత జిల్లాగా మార్చేందుకు  159 గుడుంబా తయారీదారులకు రూ.2లక్షల చొప్పున ప్రత్యామ్నాయ పథకానికి రూ.3.18 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలో రూ.70 కోట్లతో మేడిపల్లి నుండి బోర్నపల్లి వంతెన పనులు జరుగుతున్నాయని చెప్పారు.

జిల్లాలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని,  షీ టీమ్స్‌ బాగా పని చేస్తున్నాయని కితాబునిబిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంతశర్మను అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 158 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్‌ శరత్, ఎస్పీ అనంతశర్మ, జిల్లా జడ్జి రంజన్‌కుమార్, మొదటి అదనపు జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ మధు, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement