Ishwar KOPPULA
-
బంగారు తెలంగాణకు బాటలు
►అభివృద్ధిలో పరుగులు పెడుతున్న జిల్లా.. ►అనేక పథకాల్లో ముందంజ ►మొక్కల సంరక్షణ బాధ్యులకు అభినందనలు ►ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్‌తో రెండు పంటలకు నీరు ►స్వాతంత్య్ర వేడుకల్లో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ జగిత్యాల: గ్రామీణప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ ప్రభుత్వ సంకల్పంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతోపాటు అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని చారిత్రాత్మక ఖిలాలో జాతీయ పతాకాన్ని మంగళవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న త్యాగధనులకు కొప్పుల నివాళులర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో, అహింస, శాంతి మార్గంలో తెలంగాణను సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మూడేళ్లలో జిల్లా గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు. అనేక పథకాల అమలులో జగిత్యాల మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. హరితహారం అమలులో భాగంగా ఈ ఏడాది 1.32 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని, 125 నర్సీలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 70లక్షల మొక్కలు నాటామని వివరించారు. 1,669 హరిత దళాలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. జిల్లాలో మొక్కల సంరక్షణకు బాధ్యత తీసుకున్న వారిని అభినందించారు. హరితహారం విజయవంతం చేసేందుకు జిల్లాకు ఒక రాష్ట్ర, ఏడు జిల్లా స్థాయి హరితమిత్ర అవార్డులు రావడం గర్వకారణమన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.71లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉండేలా రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని ఎస్సారెస్పీకి తరలించి జిల్లాలోని ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు నీరందించే వీలు కలుగుతుందన్నారు. రోళ్లవాగు ఆధునీకరణతో పదివేల ఎకరాల ఆయకట్టుతోపాటు అదనంగా మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరందించే వీలు ఏర్పడిందని తెలిపారు. మూడో విడత మిషన్ కాకతీయ కార్యక్రమంలో రూ.32 కోట్లతో 162 చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మిషన్ భగీరథలో భాగంగా జిల్లాలో రూ.1,430 కోట్లతో చేపట్టిన ప్రధాన పైప్లైన్లు, హెడ్‌వర్క్స్, నీటిశుద్ధిప్లాంట్ల పనులు, రూ. 224 కోట్లతో చేపట్టిన ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు గోదావరి జలాలను నల్లాల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందజేస్తామన్నారు. తెల్లకాగితం ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులకు భూహక్కులు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన సాదాబైనామా కార్యక్రమం మంచి ఫలితాలిచ్చిందన్నారు. మొత్తం 67వేల దరఖాస్తులు రాగా, 50వేల దరఖాస్తులను పరిష్కరించి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచామని చెప్పారు. అపరిష్కృత భూసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జమీన్‌బందీ కార్యక్రమంతో జిల్లావ్యాప్తంగా వచ్చిన 19వేల పైచిలుకు సమస్యలను పరిష్కరించామన్నారు. గత రబీలో అంచనాలకు మించి ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే జగిత్యాల అగ్రగామిగా నిలిచిందన్నారు. ధాన్యం సేకరణలో జగిత్యాల ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ శరత్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించిందని చెప్పారు. వ్యవసాయ రుణప్రణాళికలో భాగంగా ఇప్పటికే 37వేల మంది రైతులకు రూ.248 కోట్లు అందజేశామన్నారు. రుణమాఫీ కింద నాలుగు విడతల్లో 99వేల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ.389 కోట్లు జమ చేశామని వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.6.12కోట్ల వ్యయంతో 147 ట్రాక్టర్లను 50 రాయితీపై రైతులకు అందజే శామన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలులో భాగంగా జిల్లాలో మూడు బీసీ, ఐదు మైనార్టీ, నాలుగు ఎస్సీ, ఒక మహిళా డిగ్రీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.53 కోట్లతో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, స్త్రీశక్తి భవనాలతో పాటు వ్యవసాయ గోడౌన్లు, సీసీ రోడ్లు పూర్తిచేశామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ సత్ఫలితాలిస్తోందన్నారు. 60శాతం ప్రసవాలు సర్కారు ఆస్పత్రుల్లో జరగడం అభినందనీయమన్నారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, నేత, బీడీ, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు 2,06,157 పెన్షన్లు కోసం రూ. 21కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్ నిరంతరాయంగా అందజేస్తున్నామని చెప్పారు. టీ–ఎస్ ఐపాస్ కింద ఇప్పటివరకు రూ. 262 కోట్లతో 61 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటి ద్వారా 872 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 5,400 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ. 290 కోట్లు మంజూరు చేశామన్నారు. భూమి లేని 484 మంది నిరుపేద దళితులను గుర్తించి 548 ఎకరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు జిల్లాలో 1030 మంది బీసీలకు రూ.5కోట్లు, 258 ఎస్సీలకు రూ.1.35 కోట్లు, 35 మంది ఎస్టీలకు రూ.18.57లక్షలు, 205 మంది మైనార్టీలకు రూ.1.05కోట్ల ఆర్థికసాయం అందజేశామన్నారు. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఈ సంవత్సరం 10,557 మందికి యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు రూ.31కోట్లతో 3,352 యూనిట్లు పంపిణీచేశామని చెప్పారు. ఈ పథకంలోనూ జగిత్యాల రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. గుడుంబారహిత జిల్లాగా మార్చేందుకు 159 గుడుంబా తయారీదారులకు రూ.2లక్షల చొప్పున ప్రత్యామ్నాయ పథకానికి రూ.3.18 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలో రూ.70 కోట్లతో మేడిపల్లి నుండి బోర్నపల్లి వంతెన పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, షీ టీమ్స్ బాగా పని చేస్తున్నాయని కితాబునిబిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంతశర్మను అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 158 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ శరత్, ఎస్పీ అనంతశర్మ, జిల్లా జడ్జి రంజన్‌కుమార్, మొదటి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మధు, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బతికే అవకాశం లేదు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికే అవకాశమే లేదని, ఆ పార్టీ పునాదులను టీఆర్ఎస్ కదిలిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోన్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అక్కసంతా వెళ్లగక్కుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక వైపు రాష్ట్రంలో అభివృద్ధి జరగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడలో చెప్పగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాత్రం అసలు అభివృద్ధి జరగడం లేదనడం శోచనీయమన్నారు. భట్టి విక్రమార్క గాంధీ భవన్లో కూర్చుని సీఎం కేసీఆర్ కుటుంబంపై విషంగక్కడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. -
రాజకీయ ఏకీకరణ కోసమే చేరికలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: పేదల అభ్యున్నతి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని, వీటిని చూసే పలువురు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఏకీకరణ కోసమే ఈ చేరికలు జరుగుతున్నాయన్నారు. గడిచిన 60 ఏళ్లలో కూడా జరగని అభివృద్ధి కేసీఆర్ విజన్‌తో జరుగుతోందని, ఇక తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీల అవసరమే లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, కేసీఆర్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. -
నాడు తండ్రి..నేడు తనయుడు
పార్లమెంటరీ కార్యదర్శిగా సతీష్‌బాబు సహాయ మంత్రి హోదా విద్యాశాఖ అప్పగింత కరీంనగర్ సిటీ/హుస్నాబాద్ : హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో టీఆర్ఎస్కు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఈటెల రాజేందర్, కేటీఆర్‌లకు కేబినెట్ పదవులు లభించాయి. మరో సీనియర్ నేత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఇటీవలనే చీఫ్‌విప్ పదవి వరించింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి దక్కింది. మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలను ఇతర పదవుల్లో భర్తీ చేయాలనే కేసీఆర్ ఆలోచన మేరకు సతీష్‌బాబుకు పార్లమెంటరీ కార్యదర్శి వచ్చింది. సతీష్‌బాబు తండ్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో కేబినెట్ కూర్పు సమయంలోనే సతీష్‌కు మంత్రి పదవి లభిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత కేబినెట్ విస్తరణలో బెర్త్ ఖాయమని భావించినప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలోనే సహాయ మంత్రి హోదా గల పార్లమెంటరీ కార్యదర్శి పదవిని అప్పగించారు. విద్యాశాఖ కేటాయింపు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తూ సతీష్‌బాబుకు విద్యాశాఖను కేటాయించారు. ఆయన సహాయ మంత్రి హోదాలో పనిచేస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పాటు ఆ శాఖ బాధ్యతలను సతీష్‌బాబు నిర్వర్తిస్తారు. ఇప్పటివరకు జిల్లాలో ముగ్గురు విద్యాశాఖ, అనుబంధ శాఖల మంత్రులుగా పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో పాటి రాజం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబునాయుడు హయాంలో ముద్దసాని దామోదర్‌రెడ్డి, వైఎస్సార్ హయాంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సాంకేతిక విద్యాశాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి సతీష్‌బాబు నాలుగో విద్యాశాఖ మంత్రి. నాణ్యమైన విద్యనందించేందుకు కృషి రాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తానని పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖను కేటాయించడం ఆనందంగా ఉందని, ఈ విభాగంపై తనకు అనుభవం ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ : రాజకీయంగా వెనకబాటుకు గురైన హుస్నాబాద్‌కు పార్లమెంటరీ కార్యదర్శి రూపంలో సహాయమంత్రి హోదా లభించింది. రాజకీయ నేపథ్యం కలిగిన వొడితెల కుటుంబం నుంచి ఒకప్పుడు లక్ష్మీకాంతరావు మంత్రిగా పనిచేయగా ఇప్పుడు ఆయన తనయుడు సతీశ్‌కుమార్‌ను పార్లమెంటరీ సెక్రటరీ పదవి వరించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వంలోనే సహాయమంత్రి హోదా దక్కించుకున్నారు. లక్ష్మీకాంతరావు ప్రస్తుతం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగుతుండగా ఆయన భార్య సరోజనీదేవి హుజూరాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. విద్యాసంస్థల అధినేతగా అనుభవమున్న సతీశ్‌ను విద్యాశాఖ మంత్రికి అనుబంధంగా నియమించడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగిన ఈ నియోజకవర్గం నుంచి చాలా సార్లు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే ఉండేవారు. ఇది అభివృద్ధిపై ప్రభావం చూపగా... ఇప్పుడు సహాయమంత్రి హోదా దక్కడం నియోజకవర్గ ప్రగతికి తోడ్పడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాడు దేవిశెట్టి.. నేడు సతీశ్‌కుమార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇందుర్తి నియోజకవర్గంలో ముఖ్యనేతగా ఉన్న దేవిశెట్టి శ్రీనివాస్‌రావు ఆప్కాబ్ చైర్మన్‌గా ఎన్నికై సహాయమంత్రి హోదా దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గమే హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత వొడితెల సతీశ్‌కుమార్‌కు కూడా సహాయమంత్రి హోదా లభించడం విశేషం. సతీశ్‌కుమార్ రాజకీయ నేపథ్యం 1995: హుజూరాబాద్ మండలం సింగాపురం సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక 2001 : టీఆర్ఎస్లో చేరిక 2002 : హుజూరాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక 2005 : తుమ్మనపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2006, 2011 : వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు డెరైక్టర్‌గా ఏకగ్రీవ ఎన్నిక 2012 : హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జీగా నియామకం 2014 : హుస్నాబాద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక 2014 : పార్లమెంటరీ కార్యదర్శిగా నియామకం