పల్లెల బడ్జెట్ ప్రకటించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల వార్షిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వం వినూత్నంగా తయారు చేసింది. గ్రామాల వారీగా రాబోయే నాలుగేళ్ల బడ్జెట్‌ను ప్రకటించింది. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా ఒక్కో పంచాయతీలో గుర్తించిన పనులకు ఈ ఏడాది ఎంత మొత్తం కేటాయించాలి...? వరుసగా 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రాబోయే నాలుగేళ్లలో ఏటా ఎంత మొత్తం నిధులు అంచనాగా అవసరమవుతాయి..? అనే లెక్కలను ప్రభుత్వం అంచనా వేసుకుంది. గ్రామాల వారీగా రూపొందించిన ప్రణాళికల ఆధారంగా పంచాయతీల బడ్జెట్‌ను ప్రకటించింది. గ్రామ పంచాయతీల వారీగా సంబంధిత కేటాయింపుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచింది.
ఏయే పద్దుల నుంచి ఈ నిధులను సమకూర్చనుందో.. అందులో సవివరంగా వెల్లడించింది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలోని అంతాపూర్ గ్రామ పంచాయతీలో 2,274 మంది జనాభా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.92.72 లక్షలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 97.91 లక్షలు, 2017-18లో రూ.1.02 కోట్లు, 2018-19లో రూ.1.08 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్లలో మొత్తం రూ.4.01 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. పదమూడు, పద్నాలుగో ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, తలసరి గ్రాంటు, సీనరేజీ, వృత్తి పన్ను, సొంత పన్నులు, ఉపాధి హామీ, స్టేట్ ప్లానింగ్ గ్రాంట్లు.. ఏయే పద్దు కింద ఎంతెంత మొత్తం కేటాయిస్తుందో ముందుగానే ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం 8,695 గ్రామ పంచాయతీలున్నాయి. విడివిడిగా అన్ని గ్రామాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఇదే తీరుగా వెల్లడించింది. ఆగస్టు 17న రాష్ట్రప్రభుత్వం వినూత్నంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆశయంతో అడుగు ముందుకేసింది. పల్లెపల్లెనా గ్రామ సభలు నిర్వహించి అక్కడి ప్రజల అవసరాలను తెలుసుకుంది. అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కొన్ని పనులకు పెద్దపీట వేసింది. వాటికయ్యే అంచనా వ్యయం ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించింది.
పక్కాగా రాష్ట్ర ప్రణాళిక
గ్రామజ్యోతిలో గుర్తించిన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. మొత్తం తొమ్మిది పద్దుల నుంచి సమకూరే నిధులన్నీ క్రోడీకరించింది. వీటితో మొత్తం రూ. 21104.44 కోట్లు సమకూరుతాయి. నిర్ణీత గ్రామ ప్రణాళికల్లో ఎంచుకున్న పనులకు వీటిని ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఈ నిధులు సరిపోకపోతే.. ఏటేటా రాష్ట్ర బడ్జెట్టులో నిధులు కేటాయించాలని నిర్ణయించింది.
గ్రామజ్యోతికి పెద్దపీట
రాబోయే నాలుగేళ్లలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ద్వారా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇంటింటా మరుగుదొడ్ల కార్యక్రమం, చెత్త సేకరణపై మొదటగా దృష్టి సారించింది. గ్రామజ్యోతిలో గుర్తించిన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణకు వీలుగా గ్రామాల్లో చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గ్రామజ్యోతి ప్రణాళికలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది.