నంబర్ చెబితే.. గుల్లే!
బడా సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్‌లు
డబ్బులు కొల్లగొట్టాక మాయం
ఆన్‌లైన్ మోసాలకు అమాయకుల బలి
నగరానికి చెందిన సుబ్బారావు మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పెప్సీకోలా మోటార్స్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తీసిన లాటరీలో మీ మొబైల్ నంబర్‌కు డ్రా పలికిందని, రూ.3.5 కోట్లు గెలుచుకున్నారని.. దాని సారాంశం. ఆ సొమ్ము మీకు పంపించాలంటే మీ పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, ఈ మెయిల్ ఐడీతో పాటు, బ్యాంకు అకౌంటు నంబరు తెలియజేయాలంటూ మరో ఎస్‌ఎంఎస్ వచ్చింది. దాంతో పాటు ఒక ఫోన్ నంబరు కూడా పంపించారు.
సుబ్బారావు వెంటనే మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందిస్తూ.. ‘ఆ మొత్తం పంపించాలంటే ముందుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందు కోసం ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. చెక్కు మీ చిరునామాకు పంపిస్తాం’ అని చెప్పాడు. సుబ్బారావు ఆ మొత్తాన్ని వారు చెప్పిన అకౌంట్‌లో వేశారు.మళ్లీ మోసగాళ్ల నుంచి ఫోన్. పన్ను కట్టారు సరే.. మీ ఇండియా కరెన్సీగా మారాలంటే మరో రూ.2లక్షలు అవసరం ఉంటుంది. అర్జెంటుగా ఆ మొత్తాన్ని మరో అకౌంటు నంబరు పంపిస్తున్నాం. అందులో డిపాజిట్ చేయండి.. అని సారాంశం. అది కూడా డిపాజిట్ చేశాడు సుబ్బారావు.
ఇలా దఫదఫాలుగా రూ.5 లక్షల మేర డిపాజిట్ చేశాడు మన సుబ్బారావు. ఒకసారి వాడిన ఫోన్ నంబరు మరోసారి వాడకుండా, ఒకసారి ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు మరోసారి ఇవ్వకుండా ఆన్‌లైన్ మోసగాళ్లు డబ్బులు కట్టించుకుపోయారు. సుబ్బారావుకు ఎట్టకేలకు అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించి తన దగ్గరున్న వివరాలతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు కేసు నమోదు చేసి, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చే శారు. ఇలాంటి సుబ్బారావులు మన మహా విశాఖ నగరంలో చాలా మంది ఉన్నారు. అత్యాశకు పోయి చాలా మంది జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. - అల్లిపురం
నగరంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లక్కీ లాటరీలో కోట్లాది రూపాయలు దక్కించుకున్నారంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ మోసగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ప్రజలను నమ్మించడం కోసం ఇందుకు బడా కంపెనీల పేర్లను వినియోగించుకుంటున్నా రు. కౌన్‌బనేగా కరోడ్‌పతి, ఎయిర్‌టెల్ లాట రీ, టాటా డొకొమో లాటరీ, ఐసీసీ కప్ లాటరీ, స్టార్ స్పోర్ట్సు లాటరీ, బీబీసీ, హీరో హోండా, షెవర్లట్ మోటార్స్ తదితర కంపెనీల పేర్లతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొడుతున్నారు.
ప్రజలూ.. బహుపరాక్!: సైబర్ నేరగాళ్లు దేశ విదేశాల్లో ఉంటూ ఇక్కడి ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారు. మాకు కొంత డబ్బు వచ్చింది. ఇక్కడ తమకు బ్యాంకు ఖాతా లేదు. మీ అకౌంట్ నంబర్ ఇస్తే.. అందులో డబ్బులు జమ చేస్తామంటారు. ఆ తరువాత తాము చెప్పిన ఖాతాలో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా మీకు కమీషన్ ఇస్తామంటూ అమాయకుల నుంచి ఖాతా వివరాలు సేకరిస్తారు. మరో వైపు ఫేక్ మెసేజ్‌లతో నమ్మించి ఇలాంటి ఖాతాలో ఆ సొమ్మును జమ చేయిస్తారు. తరువాత ఆన్‌లైన్‌లో ఆ సొమ్మును లాగేస్తుంటారు. తీరా.. పోలీసులు దర్యాప్తులో ఇలా అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతుంటారు. అసలు నిందితులు మాత్రం తప్పించుకు తిరుగుతుండడం గమనార్హం.
మూడేళ్లలో నమోదైన సైబర్ కేసులు
నగరంలో మూడేళ్లలో నమోదైన సైబర్ నేరాల్లో 90 శాతం బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని మోసాలు చేసినవే. 2014లో 198 కేసులు నమోదు కాగా.. వాటిలో 30 కేసులు పిషింగ్ విషింగ్‌వే. 2015లో 267 కేసులో నమోదవ్వగా.. వాటిలో 128 కేసులు, 2016లో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు కాగా.. వాటిలో 85 కేసులు పిషింగ్ విషింగ్‌వి ఉన్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
ప్రస్తుతం సైబర్ నేరాల అధికంగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాల రూపంలో ముద్రించి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు. ఒక వేళ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు. అలా ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లతో అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ మెసేజ్‌లను మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. పెద్ద మొత్తంలో డబ్బులు మీ మొబైల్ నంబర్ గెలుచుకుందంటూ పలు కంపెనీల పేర్లతో వచ్చే ఈ-మెయిల్స్‌ను నమ్మొద్దు. -ఎం.సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ
విషింగ్.. పిషింగ్..!
ఇటీవల వెలుగు చూస్తున్న విషింగ్, పిషింగ్ కాల్స్ గురించి అవగాహన అవసరం. అపరిచితులు విషింగ్ కాల్స్ ద్వారా ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం పిన్ నంబర్లు సేకరించి డ బ్బులు కాజేస్తారు. ఆన్‌లైన్లో ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. మీ ఏటీఎం కార్డు కాలవ్యవధి రేపటి నుంచి అయిపోతుంది. ఈ రోజు కొత్త నంబరు మార్పు చేసుకోండి. మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు చెప్పండి అంటూ మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు ద్వారా మీరు ఫోన్లో ఉంటుండగానే మీ అకౌంట్‌లోను, క్రెడిక్ కార్డులో ఎంత ఉంటే అంత డబ్బును డ్రా చేసుకోవటం, ఆన్‌లైన్లో కొనుగోళ్లు చేయడం చకాచకా జరిగిపోతుంటాయి. తీరా మీ సెల్‌ఫోన్‌కు మీ ఆర్డర్ బుక్ అయింది, మీ అకౌంట్ నుంచి ఇంత డబ్బులు డ్రా అయ్యాయి అని మెసేజ్ వస్తేగాని.. మోసపోయామని తెలుసుకోలేరు. ఇంతలో మీకు ఫోన్‌లో కాంటాక్ట్ చేసిన వ్యక్తి స్విచాఫ్ చేసేస్తాడు. ఆ తరువాత లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు.