Fake Message
-
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
కొత్త స్కాం వెలుగులోకి: సొమ్ము గోవిందా! లబోదిబోమంటున్న నగల వ్యాపారులు
‘మీ అకౌంట్లో డబ్బు పడింది’ అంటూ జ్యూయల్లరీ వ్యాపారులను దోచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కరు ఇద్దరుకాదు చాలామంది నగల వ్యాపారులు ఇలాంటి మోసానికి బలైనట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీ అందించిన కథనంలోని వి వరాలను పరిశీలస్తే నగలవ్యాపారి నావల్ కిషోర్ ఖండేల్వాల్ ఢిల్లీలో అతిపెద్ద బంగారం, వెండి మార్కెట్లో ఐదు దశాబ్దాల నాటి దుకాణాన్ని నడుపుతున్నారు. గత వారం అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఒక వ్యక్తి ఫోన్లో సంప్రదించి, 15 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలుకు కొడుకులతో డీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు. తాను దుకాణాన్ని సందర్శించ లేనని ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తానంటూ ఖండేల్వాల్ని నమ్మించాడు. ఇంటర్నెట్-బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో రూ. 93,400 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన కుమారులకు స్క్రీన్‌షాట్ పంపాడు. దీంతో పేమెంట్ అయినట్టుగా భావించిన వారు ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు బంగారు గొలుసును పంపించారు. ఇదే ప్లాన్‌ను పక్కగా మరోసారి అమలు చేశారు కేటుగాళ్లు. దీంతో మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి తనకు 30 గ్రాముల బంగారు గొలుసు కావాలని చెప్పాడు. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఖండేల్వాల్కి రూ.1,95,400 తన ఖాతాలో జమ చేసినట్లు ఎస్ఎంఎస్ రావడం, ఆ గోల్డ్ చెయిన్‌ను అతనికి పంపడం జరిగిపోయింది. ఆ తరువాత తీరిగ్గా నగల వ్యాపారి బ్యాంక్ మొబైల్ యాప్‌లో అకౌంట్ చెక్ చేసుకొని డబ్బు జమ కాలేదని గ్రహించాడు. అపుడు తనకు వచ్చిన మెసేజ్ అచ్చం బ్యాంకు ఫార్మాట్లో ఉన్న ఫేక్ మేసేజ్ అని తెలుసుకుని లబోదిబోమన్నాడు. మరోవైపు ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నేరగాళ్లు ఎవరు అనేది కనుగొనలేక పోయారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతనితో పాటు దేశంలో పలు చోట్ల పలువురు వ్యాపారులు కూడా ఇలాంటి మోసానికి బలైయ్యారనేది తమ దృష్టికి వచ్చిందని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్ తెలిపారు. అయితే బ్యాంక్ పోర్టల్ లేదా ఏదైనా వెబ్ పోర్టల్ ఉపయోగించలేదు కాబట్టి ఈ మోసం సైబర్ చట్టం కిందకు రాదని ఇది మోసం, ఫోర్జరీకి సంబంధించిన విషయం కాబట్టి క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తుందని సైబర్ లా నిపుణుడు సజల్ ధమిజా అన్నారు. -
టీటీడీపై ఆ ప్రచారం అవాస్తవం.. నమ్మొద్దు
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సేవ్’ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీటీడీ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ ట్విటర్ పేజీ ద్వారా స్పష్టత ఇచ్చింది. శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారనేది ఆ వాట్సాప్ సందేశం సారాంశం. అయితే ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధారాల్లేని ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రజలెవ్వరూ ఇది నమ్మవద్దని, ఇతరులకు ఈ సందేశాలను ఫార్వర్డ్ చేయొద్దని టీటీడీ కోరుతోంది. అంతేకాదు ప్రధాని కార్యాలయం పేరిట అక్కడ కనిపిస్తున్న నెంబర్.. మన్‌కీ బాత్ ప్రొగ్రాంకు సంబంధించిందని స్పష్టం చేసింది. #FactCheck తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏ ఒక్కటీ నిజం కాదు. దీన్ని రాష్ట్ర ప్రజలెవ్వరూ నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని టీటీడీ కోరుతోంది. pic.twitter.com/PA6TzqokoX — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 14, 2022 -
సీఎం పీఏ పేరుతో ఫేక్ మెసేజ్‌లు
సాక్షి, తాడేపల్లి రూరల్: సీఎం పీఏనంటూ ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్ పంపి డబ్బులు డిమాండ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ శేషగిరి తెలిపిన వివరాల ప్రకారం సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినంటూ మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌లో ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆంధ్రాకు చెందిన రుక్కిబుయ్ అనే యువకుడు సెలెక్ట్ అయ్యాడని, అతడికి ఇంటర్నేషనల్ క్రికెట్ కిట్ అవసరమయ్యిందని, దానిని కొనుగోలు చేసేందుకు రూ.10,40,440ను పంపించాలని మెసేజ్ పెట్టాడు. బెంగళూరులో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ తాడేపల్లిలోని మణిపాల్ అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఆ మెసేజ్‌ను పంపించి పరిశీలించాలని ఆదేశించారు. అది ఫేక్ మెసేజ్‌గా గుర్తించి జరిగిన ఘటనపై రామాంజనేయరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మణిపాల్ హాస్పిటల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెసేజ్ పెట్టిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సదరు ఫేక్‌మెసేజ్ పెట్టిన వ్యక్తి ఉమ్మడి ఏపీలో పలువురు ప్రముఖుల పేర్లతో కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై ఆరు కేసులు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఓ మంత్రి పీఏ నంటూ ఫోన్ చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: (దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదు: అంబటి రాంబాబు) -
సరికొత్త ఆన్లైన్ మోసం.. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు!
ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, మీడియా ఎంత చెబుతున్నా కొందరు అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దేశంలో చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. ఫోన్లో బ్యాంకు వివరాలు అడిగే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని ముఖ్యంగా ఎటిఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అసలే తెలుపవద్దని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎంత ప్రచారం చేస్తున్న అమాయకులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆన్లైన్ మోసాలకు గురవుతునే ఉన్నారు. తాజాగా మరోసారి హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతున్న కొత్త ఆన్లైన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు ప్రజలను మోసగించడానికి, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు. ఈ కొత్త డిజిటల్ మోసాన్ని మొదట జర్నలిస్ట్ విశాల్ కుమార్ నివేదించారు. తన స్వంత అనుభవాలను పంచుకున్న కుమార్ హ్యాకర్లు తనను ఏ విధంగా మోసం చేయలని చూశారో పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ స్కామ్ ప్రకారం.. మొదట హ్యాకర్లు మీ సిమ్ కార్డ్ డాక్యుమెంటేషన్ అసంపూర్ణంగా ఉందని, వెంటనే వివరాలను పంచుకోవాలని లేకపోతే 24 గంటల్లోగా సేవలు డీయాక్టివేట్ చేయనున్నట్లు ఒక సందేశాన్ని ప్రజలకు పంపుతారు. వాస్తవానికి, అది హ్యాకర్లు పంపిన నకిలీ సందేశం మాత్రమే. ఈ నకిలీ యాప్స్ డౌన్లోడ్ చేయలని ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో మీ వివరాలను సేకరిస్తాయి. అందులో ఇచ్చిన ఒక నెంబర్ కి చేయాలి మెసేజ్ సూచిస్తుంది. కుమార్ ఆ కస్టమర్ కేర్ నెంబరుకు డయల్ చేశాడు. అప్పుడు ఆ నకిలీ కస్టమర్ Any Remote DeskTop అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని హ్యాకర్ సూచించినట్లు చెప్పాడు. అయితే, ఈ యాప్ ద్వారా అవతలి వ్యక్తి మీ స్క్రీన్ నమోదు చేసే వివరాలు మొత్తం చూసే అవకాశం ఉంది. మీరు గనుక డబ్బులు చెల్లించడానికి ఆ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగిస్తే ఆ వివరాలు హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకని, కస్టమర్, ఈ-కెవైసీ పేరుతో ఎవరైనా కాల్ చేసిన, మెసేజ్ పంపిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!) -
వాట్సాప్ ఫేక్ మెసేజ్: వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారు!
వ్యాక్సిన్ వేయించుకున్నారా? అయితే చావు ఖాయం. అది కూడా రెండేళ్లలోపే!. ఇది ఇప్పుడు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఫార్వార్డ్ మెసేజ్ సారాంశం. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు.. ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్ టుక్ మోటాగ్నైర్. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం.. కరోనాకు సరైన మందు లేకపోవడంతో వ్యాక్సిన్లనే నమ్ముకుంది యావత్ ప్రపంచం. మరోవైపు వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రభావం ఉండబోదని, సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడాల్సి వస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు మరో ఫార్వార్డ్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే రెండేళ్లలోపు చావు తప్పదనేది ఆ మెసేజ్ సారాంశం. పైగా ఫ్రెంచ్ వైరాలజిస్ట్, నోబెల్ గ్రహీత అయిన టుక్ మోటాగ్నైర్ పేరుతో ఆ వార్త వైరల్ అవుతోంది. దీంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అసలు విషయం ఏంటంటే.. వ్యాక్సిన్‌తో చావు ఖాయమని టుక్ మోటాగ్నైర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు లైఫ్సైట్న్యూస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పైగా ఆయన వికీపీడియా పేజీలో కొంత కంటెంట్‌ను కూడా అది షేర్ చేసింది. అయితే ఆ వెబ్సైట్ దానిని యూఎస్‌కు చెందిన ఎన్జీవో రెయిర్ ఫౌండేషన్ వెబ్సైట్ నుంచి తీసుకుంది(మే 18న పబ్లిష్ అయ్యింది). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరును మాత్రమే తప్పుబట్టారు. అయితే ఆ వీడియోలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పొరపాటున అర్థం చేసుకుని వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారని ఆ ఫౌండేషన్ కథనం రాసింది. అక్కడి నుంచి అది వాట్సాప్‌లో వైరల్ అయ్యింది. అయితే ఇది ఫేక్ కథనం అని తేలడంతో అస్సాం పోలీసులు ఫేస్బుక్ పేజీలో ఫార్వార్డ్ చేయొద్దంటూ ఒక అలర్ట్ పోస్ట్‌తో వాట్సాప్ యూజర్లకు సూచించారు. ఆయన ఉద్దేశం.. హెచ్ఐవీ పై పరిశోధనలకు గానూ 2008లో మోటాగ్నైర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ విషయంలో మొదటి నుంచి మోటాగ్నైర్ది విచిత్రమైన వాదనే. వ్యాక్సిన్లనేవి అసలు శాస్త్రీయం కాదని ఆయన వాదిస్తుంటారు. పైగా కరోనా వ్యాక్సిన్స్ వల్లే ఇప్పుడు కొత్త వేరియెంట్స్ పుడుతున్నాయనేది ఆయన అభిప్రాయం. అంతేకాదు కరోనా నోవెల్ వైరస్ అనేది మనిషి తయారు చేసిందేనని, హెచ్ఐవీ నుంచి జెనెటిక్ మెటీరియల్‌తో దానిని రూపొందించారని స్టేట్మెంట్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. ఎయిడ్స్ జబ్బుకు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో చైనా వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని స్టేట్మెంట్తో ఆయన పెద్ద దుమారమే రేపారు. -
ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త!
వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త! అమెజాన్ 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెజాన్ ఉచితంగా బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక నకిలీ వాట్సాప్ సందేశం తెగ వైరల్ అవుతుంది. ఇలాంటివి రాగానే అందులో నిజమెంతో తెలుసుకోకుండా కొందరు ఇతరులకు పంపించేస్తుంటారు. బహుమతి సంగతి ఏమో కానీ అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడడం మాత్రం ఖాయం. తాజాగా అమెజాన్ పేరిట కూడా ఇలాంటి లింక్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. అందుకని జర జాగ్రత్తగా ఉండండి. అమెజాన్ లోగోతోనే ఈ లింకుతో వస్తుండడం వల్ల ఎక్కువ మంది సులభంగా నమ్మడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ, నిశితంగా పరిశీలిస్తే యూఆర్ఎల్ HTTPతో ప్రారంభమవుతోంది. ఎప్పుడైనా ‘S’ లేదంటే అది సెక్యూర్ కాదని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లింకులు హెచ్‌టీటీపీతోనే ప్రారంభమవుతాయని గమనించాలి. అలాగే యూఆర్ఎల్ xyz అనే దానితో ముగుస్తుంది. ఎక్కువ శాతం వ్యాపార సంస్థలు .comతో ముగుస్తాయని గుర్తుంచుకోవాలి. అసలు అమెజాన్ స్థాపించి 30 ఏళ్లు పూర్తీ కాలేదు. ఇక లింక్ క్లిక్ చేస్తే ఫలానా ఫోన్ గెలుచుకోవాలంటే ఈ సందేశాన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ, వ్యక్తులకు పంపించాలని వస్తుంది. వాస్తవానికి అమెజాన్ ఎలాంటి ఆఫరూ ప్రకటించలేదు. అంతపెద్ద కంపెనీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు తన వెబ్సైట్లో పొందుపరచకుండా ఉంటుందా? కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజులు నమ్మొద్దు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు! -
వాట్సప్ కలర్ కాదు.. మీ కలర్ మారుతుంది జాగ్రత్త!
న్యూఢిల్లీ: మనకు చాలా సార్లు స్మార్ట్ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్‌లు, స్టేటస్లు మార్చుకోవడం కోసం చాలా లింకులు వాట్సాప్ గ్రూపులను, చాట్లలో చక్కర్లు కొడతాయి. అలాంటి లింకులను పొరపాటున క్లిక్ చేయడం ద్వారా యూజర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం కూడా ఒక మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ మెసేజ్ లో వాట్సప్ కొత్త కలర్లను యాక్టివేట్ చేసుకోవాలంటూ చూపిస్తోంది. మీరు వాట్సాప్ గ్రీన్ కలర్ చూసి విసుగెత్తిపోయారా? అయితే మీకోసం ఉచితంగా వాట్సాప్ కలర్ మార్చుకోండి అని ఉంది. (చదవండి: నాలుగు మిలియన్లతో సత్తా చాటిన ఫౌజీ) మీ కలర్ కూడా మారిపోద్ది: దింతో చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండా అందులో ఉన్న లింక్‌ను ఓపెన్ చేస్తున్నారు. మొబైల్ఫోన్లో ఆ లింక్‌ను ఓపెన్ చేస్తే యాక్టివేట్ నౌ అనే మరో లింక్ వస్తోంది. యాక్టివేట్ కోసం క్లిక్ చేస్తే యూజర్ వెరిఫికేషన్ అని మరో మెస్సేజ్ కనిపిస్తోంది. ఈ సర్వీసును యాక్టివేట్ చేసుకోవాలంటే 20 మంది ఫ్రెండ్స్‌కు, 5 గ్రూపులకు ఈ సమాచారం చేరవేయాలని వాళ్లను కూడా ఆహ్వానించాలని అందులో ఉంది. ఇలా లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి పోతుంది. ఎప్పుడు కూడా అధికారిక సంస్థలు ఇలా యూజర్లకు మెసేజ్ లు పంపవు. ఒకవేల మీరు కనుక ఈ లింకును క్లిక్ చేస్తే వాట్సాప్ కలర్ తో పాటు మీ కలర్ కూడా మారిపోద్ది జాగ్రత్త మరి. అలాగే దీంతో పాటు "వాట్సాప్ డైరెక్టర్" వరుణ్ పుల్యానీ పేరుతో ఒక పంపిన వాట్సాప్ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సందేశాన్ని కనీసం 20 వ్యక్తులకు ఫార్వార్డ్ చేయాలనీ యూజర్లను అడుగుతుంది. ఒకవేల వారు అలా చేయడంలో విఫలమైతే వారు వాట్సాప్ సేవలకు ఉపయోగించినందుకు కొంత మొత్తం చెల్లించాలని ఆ సందేశంలో ఉంది. సందేశంలో ఇలా ఉంది.. "దీనిని విస్మరించవద్దు దయచేసి జాగ్రత్తగా చదవండి. హలో, నేను వాట్సాప్ డైరెక్టర్ వరున్ పుల్యాని ఈ సందేశం మా వినియోగదారులందరికీ మేము 19 బిలియన్ డాలర్లకు మార్క్ జుకర్‌బర్గ్‌కు వాట్సాప్‌ను విక్రయించాము. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ నియంత్రణలో ఉంది. మీరు కనీసం 20 మందికి ఈ మెసేజ్ ను షేర్ చేయండి. అప్పుడు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్బుక్ యొక్క "ఎఫ్"తో కొత్త చిహ్నంగా మారడంతో పాటు నీలం రంగులోకి మారిపోతుంది. మీ క్రొత్త వాట్సాప్‌ను వినియోగించుకోవాలంటే ఈ సందేశాన్ని 10 మందికి పైగా ఫార్వార్డ్ చేయండి. లేకపోతే మీ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి" అని నకిలీ వాట్సాప్ సందేశంలో ఉంది. బహుశా ఇలాంటి సందేశం మీకు కూడా వాట్సాప్ గ్రూప్‌లోనో, వ్యక్తిగతంగానో ఇప్పటికే వచ్చి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వాట్సాప్ సందేశం ఇది. ఒకవేల కనుక మీకు ఇటువంటి మెసేజ్ రాకపోతే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే, ఇది ఒక నఖిలి మెసేజ్. దీన్ని క్లిక్ చేసిన వారంతా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. (చదవండి: ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్) మరి నిజమెంత? మొదట మనం ఈ వరుణ్ పుల్యానీ గురుంచి తెలుసుకోవాలి. చాలా కాలం నుంచి వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ మెసేజ్ లు ఫార్వార్డ్ అవుతున్నాయి. కానీ వాట్సాప్ సంస్థలో అటువంటి పేరుతో ఎవరు లేరు. కంపెనీ వెబ్సైట్లో కూడా ఎక్కడా అతని పేరు కనిపించలేదు. ఇలాంటి ఫేక్ సందేశాల్లో తప్ప ఎక్కడ అతని పేరు కనిపించే లేదు అని నిపుణులు తెలుపుతున్నారు. వాట్సాప్ ప్రైవసీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటువంటి నకిలీ మెసేజ్ లను పంపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు వచ్చిన ఇలాంటి సందేశాలు పంపి సమయాన్ని వృథా చేసుకోకండి. మీతో పాటు మీ తోటి వారిని సైబర్ నేరగాళ్లకు బలి చేయకండి. కేవలం అధికారిక సంస్థ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. -
‘వాట్సాప్ గోల్డ్' మళ్లీ వైరల్, మీకు వచ్చిందా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఫేక్ మెసేజ్‌లను అడ్డుకుంటున్నప్పటికీ తాజాగా వాట్సాప్ గోల్డ్ మెసేజ్ పేరుతో ఓ ఫేక్ మెసేజ్ మళ్లీ వాట్సాప్ యూజర్లపై పంజా విసురుతోంది. 'ధనవంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 'వాట్సాప్ గోల్డ్' వెర్షన్ లీక్ అయింది. మీకు కూడా ఆ సేవలు ఉచితంగా కావాలంటే, ఈ లింక్ పై క్లిక్ చేయండి' అంటూ మెసేజ్‌లు మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి. అలా ఈ వలలో పడిన యూజర్లను డేటాను హ్యాక్ చేస్తుంది. 'వాట్సాప్ గోల్డ్'..ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేస్తే మీ వాట్సప్... గోల్డ్ కలర్లోకి మారిపోతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే వాస్తవానికి ఇది ఒరిజినల్ యాప్ కాదు. అదొక మాల్వేర్. ఇదొక భయంకరమైన వైరస్. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. భారీ నష్టం తప్పదు. 'వాట్సాప్ గోల్డ్' మెసేజ్ వస్తే ఏం చేయాలి? ఇది ఫేక్ వ్యాట్సాప్ యాప్. ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఆ వైరస్ ఫోన్లోకి చొరబడి డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. 'వాట్సాప్ గోల్డ్' పేరుతో వచ్చే ఎటువంటి లింక్స్ పై క్లిక్ చేయొద్దని, సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఈ వైరస్ ఫోన్ లో చేరితే, ఫోన్ లో నిక్షిప్తమైన వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్స్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు ఇలా ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా 2016 సంవత్సరంలో 'వాట్సాప్ గోల్డ్' పేరిట మాల్వేర్ మెసేజ్‌లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
బీ అలర్ట్: వదంతులు నమ్మకండి!
సాక్షి, ముంబై: గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘17వ వార్షికోత్సవం సందర్భంగా డీమార్ట్ రూ.2500 ఫ్రీ షాపింగ్ వోచర్ ఇస్తుంది’’ అనే వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. యూజర్లు వివిధ గ్రూపులలో దీన్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్అని, తద్వారా ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నకిలీ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వైరస్ ఎటాక్‌తో ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఈ విషయంపై డీమార్ట్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, మెసేజ్‌లు అవాస్తవమని, తాము అటువంటి ఆఫర్లు ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కాగా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ చేసేటపుడు మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటి రెండు సార్లు పరిశీలించుకొని, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్ చేయాలి. ఇది ఎవరికి వారు విధించుకోవాల్సిన నియంత్రణ. లేదంటే మనంతో మోసపోవడంతో పాటూ.. మరింత మందిని ప్రలోభపెట్టినవారమవుతాం... తస్మాత్ జాగ్రత్త! -
ఢిల్లీలో భారీ భూకంపం.. నాసా హెచ్చరిక!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏ చిన్న సంఘటన జరిగిన అది దేశం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. అదే భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు ఢిల్లీలో సంభవిస్తే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేము. ఒకవేళ భూకంపం లాంటివి సంభవిస్తాయని ముందే తెలిస్తే దేశం అంతటా ఎంతటి భయాందోళనలు కల్గుతాయో మనం ఊహించగలం. ఇంతకు ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే ఏప్రిల్ 7 నుంచి 15లోపు ఢిల్లీలో ఒక తీవ్రమైన భూకంపం రానుంది. రిక్టారు స్కేలు మీద దాని తీవ్రత 9.1-9.2గా నమోదు కానుంది. లక్షల మంది ప్రాణాలు కొల్పోనున్నారని, దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయనే మెసేజ్ గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది. గురుగ్రామ్‌లో సంభవించబోయే ఈ భూకంపం ప్రపంచంలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటిలో రెండవది కానుంది. భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయి. పాకిస్థాన్‌లో కూడా భూకంపం రానున్నట్లు అక్కడ దీని తీవ్రత 4-4.2 వరకు నమోదు కానున్నట్లు ఈ సందేశ సారాంశం. ఢిల్లీలో ఉంటున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వారిని ఒక వారం పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లమని చెప్పండి. ప్రభుత్వం తొందరలోనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే నాసాఅలర్ట్.కామ్‌లో చూడండి అని ఉంది. అంటే నిజంగానే ఢిల్లీలో భూకంపం రానుందా... అంటే అదేమి లేదు. ఇది ఒక ఫేక్ మెసేజ్. మెసేజ్‌లో చాలా స్పెల్లింగ్ మిస్టెక్‌లు ఉండటమే కాక ఒక ముఖ్యమైన ప్రాధమిక అంశాన్నే అది మర్చిపోయింది. భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదు. ఈ వెబ్సైట్ కూడా నకిలీ వెబ్సైట్. ఇది స్పేస్ ఏజెన్సీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదని తేలడంతో ఢిల్లీ వాసులు ఊపరి పీల్చుకున్నారు. -
‘నిర్భయ’ బాలనేరస్తుడి ఫేక్ ఫొటో.. వైరల్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.. ఆరుగురు దోషుల్లో ఒకడు చనిపోగా, నలుగురికి మరణశిక్ష పడింది. శిక్షల అమలుపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.. ఇక ఈ కేసులో అందరి దృష్టినీ ఆకర్షించిన బాలనేరస్తుడు.. మూడేళ్ల శిక్ష అనంతరం విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అతనికి సంబంధించిన వివరాలేవీ బయటికిరాలేదు.. కానీ ఆ బాలనేరస్తుడి పేరుతో ఓ నకిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘ఇతను నిర్భయ కేసులో బాలనేరస్తుడు. పేరు .........., ఢిల్లీలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రస్తుతం వాడు దక్షిణభారతంలో ఉంటున్నట్లు తెలిసింది. హోటళ్లలో సర్వర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే వాడి ఫొటో.. వెతకండి.. అంతటి దారుణానికి పాల్పడినవాణ్ని పనికిరాకుండా చేసేయండి లేదా పైకి పంపేయండి..’’ అనే మెసేజ్ వాట్సప్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లోనూ ఇంతే! అయితే ఇది నకిలీ ఫొటోఅని విశ్వసనీయంగా తెలినట్లు ప్రఖ్యాత ఏఎల్టీ న్యూస్ వెబ్సైట్ ఒక కథనాన్ని రాసింది. ‘‘హోం నుంచి విడుదలైన తర్వాత ఆ బాలనేరస్తుడి బాధ్యతను ఓ స్వచ్ఛంద సంస్థ తీసుకుంది. అతని పేరుగానీ, ఫొటోగానీ, ఇతర వివరాలేవి బయటికిరాలేదు. బాలనేరస్తుడిదిగా చెబుతోన్న ఆ ఫొటోను ఓ ట్విటర్ ఖాతా నుంచి తీసుకున్నారు. ఆ ఖాతా 2013లో మొదలైంది. ఇప్పటివరకు దానినుంచి రెండు ట్వీట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి ఆ సమయంలో నిర్భయ నేరస్తులంతా జైలులోనే ఉన్నారు. కాబట్టి ఆ ట్వీటర్ ఖాతా ఖచ్చితంగా నేరస్తుడిదిమాత్రం కాదు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ప్రచారమిది. ఇలాంటి మెసేజ్‌లు మీకొస్తే స్పందించకండి..’’ అని పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నట్లు ఏఎల్టీ న్యూస్ తెలిపింది. వైరల్ అయిన నకిలీ మెసేజ్..(బ్లర్ చేశాం) -
నంబర్ చెబితే.. గుల్లే!
బడా సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్‌లు డబ్బులు కొల్లగొట్టాక మాయం ఆన్లైన్ మోసాలకు అమాయకుల బలి నగరానికి చెందిన సుబ్బారావు మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పెప్సీకోలా మోటార్స్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తీసిన లాటరీలో మీ మొబైల్ నంబర్‌కు డ్రా పలికిందని, రూ.3.5 కోట్లు గెలుచుకున్నారని.. దాని సారాంశం. ఆ సొమ్ము మీకు పంపించాలంటే మీ పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, ఈ మెయిల్ ఐడీతో పాటు, బ్యాంకు అకౌంటు నంబరు తెలియజేయాలంటూ మరో ఎస్ఎంఎస్ వచ్చింది. దాంతో పాటు ఒక ఫోన్ నంబరు కూడా పంపించారు. సుబ్బారావు వెంటనే మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందిస్తూ.. ‘ఆ మొత్తం పంపించాలంటే ముందుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందు కోసం ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. చెక్కు మీ చిరునామాకు పంపిస్తాం’ అని చెప్పాడు. సుబ్బారావు ఆ మొత్తాన్ని వారు చెప్పిన అకౌంట్లో వేశారు.మళ్లీ మోసగాళ్ల నుంచి ఫోన్. పన్ను కట్టారు సరే.. మీ ఇండియా కరెన్సీగా మారాలంటే మరో రూ.2లక్షలు అవసరం ఉంటుంది. అర్జెంటుగా ఆ మొత్తాన్ని మరో అకౌంటు నంబరు పంపిస్తున్నాం. అందులో డిపాజిట్ చేయండి.. అని సారాంశం. అది కూడా డిపాజిట్ చేశాడు సుబ్బారావు. ఇలా దఫదఫాలుగా రూ.5 లక్షల మేర డిపాజిట్ చేశాడు మన సుబ్బారావు. ఒకసారి వాడిన ఫోన్ నంబరు మరోసారి వాడకుండా, ఒకసారి ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు మరోసారి ఇవ్వకుండా ఆన్లైన్ మోసగాళ్లు డబ్బులు కట్టించుకుపోయారు. సుబ్బారావుకు ఎట్టకేలకు అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించి తన దగ్గరున్న వివరాలతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు కేసు నమోదు చేసి, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చే శారు. ఇలాంటి సుబ్బారావులు మన మహా విశాఖ నగరంలో చాలా మంది ఉన్నారు. అత్యాశకు పోయి చాలా మంది జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. - అల్లిపురం నగరంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లక్కీ లాటరీలో కోట్లాది రూపాయలు దక్కించుకున్నారంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ మోసగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ప్రజలను నమ్మించడం కోసం ఇందుకు బడా కంపెనీల పేర్లను వినియోగించుకుంటున్నా రు. కౌన్‌బనేగా కరోడ్‌పతి, ఎయిర్టెల్ లాట రీ, టాటా డొకొమో లాటరీ, ఐసీసీ కప్ లాటరీ, స్టార్ స్పోర్ట్సు లాటరీ, బీబీసీ, హీరో హోండా, షెవర్లట్ మోటార్స్ తదితర కంపెనీల పేర్లతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొడుతున్నారు. ప్రజలూ.. బహుపరాక్!: సైబర్ నేరగాళ్లు దేశ విదేశాల్లో ఉంటూ ఇక్కడి ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారు. మాకు కొంత డబ్బు వచ్చింది. ఇక్కడ తమకు బ్యాంకు ఖాతా లేదు. మీ అకౌంట్ నంబర్ ఇస్తే.. అందులో డబ్బులు జమ చేస్తామంటారు. ఆ తరువాత తాము చెప్పిన ఖాతాలో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా మీకు కమీషన్ ఇస్తామంటూ అమాయకుల నుంచి ఖాతా వివరాలు సేకరిస్తారు. మరో వైపు ఫేక్ మెసేజ్‌లతో నమ్మించి ఇలాంటి ఖాతాలో ఆ సొమ్మును జమ చేయిస్తారు. తరువాత ఆన్లైన్లో ఆ సొమ్మును లాగేస్తుంటారు. తీరా.. పోలీసులు దర్యాప్తులో ఇలా అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతుంటారు. అసలు నిందితులు మాత్రం తప్పించుకు తిరుగుతుండడం గమనార్హం. మూడేళ్లలో నమోదైన సైబర్ కేసులు నగరంలో మూడేళ్లలో నమోదైన సైబర్ నేరాల్లో 90 శాతం బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని మోసాలు చేసినవే. 2014లో 198 కేసులు నమోదు కాగా.. వాటిలో 30 కేసులు పిషింగ్ విషింగ్వే. 2015లో 267 కేసులో నమోదవ్వగా.. వాటిలో 128 కేసులు, 2016లో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు కాగా.. వాటిలో 85 కేసులు పిషింగ్ విషింగ్వి ఉన్నాయి. అవగాహన కల్పిస్తున్నాం ప్రస్తుతం సైబర్ నేరాల అధికంగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాల రూపంలో ముద్రించి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు. ఒక వేళ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు. అలా ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లతో అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ మెసేజ్‌లను మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. పెద్ద మొత్తంలో డబ్బులు మీ మొబైల్ నంబర్ గెలుచుకుందంటూ పలు కంపెనీల పేర్లతో వచ్చే ఈ-మెయిల్స్‌ను నమ్మొద్దు. -ఎం.సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ విషింగ్.. పిషింగ్..! ఇటీవల వెలుగు చూస్తున్న విషింగ్, పిషింగ్ కాల్స్ గురించి అవగాహన అవసరం. అపరిచితులు విషింగ్ కాల్స్ ద్వారా ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం పిన్ నంబర్లు సేకరించి డ బ్బులు కాజేస్తారు. ఆన్లైన్లో ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. మీ ఏటీఎం కార్డు కాలవ్యవధి రేపటి నుంచి అయిపోతుంది. ఈ రోజు కొత్త నంబరు మార్పు చేసుకోండి. మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు చెప్పండి అంటూ మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు ద్వారా మీరు ఫోన్లో ఉంటుండగానే మీ అకౌంట్లోను, క్రెడిక్ కార్డులో ఎంత ఉంటే అంత డబ్బును డ్రా చేసుకోవటం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం చకాచకా జరిగిపోతుంటాయి. తీరా మీ సెల్‌ఫోన్‌కు మీ ఆర్డర్ బుక్ అయింది, మీ అకౌంట్ నుంచి ఇంత డబ్బులు డ్రా అయ్యాయి అని మెసేజ్ వస్తేగాని.. మోసపోయామని తెలుసుకోలేరు. ఇంతలో మీకు ఫోన్లో కాంటాక్ట్ చేసిన వ్యక్తి స్విచాఫ్ చేసేస్తాడు. ఆ తరువాత లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు.