ఖద్దరు నీడన ఖాకీ | The magic of transfers in the police department | Sakshi
Sakshi News home page

ఖద్దరు నీడన ఖాకీ

Published Sat, Aug 12 2017 11:18 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ఖద్దరు నీడన ఖాకీ - Sakshi

ఖద్దరు నీడన ఖాకీ

పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం
రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్‌
ఏళ్ల తరబడి జిల్లా సరిహద్దుల్లో మగ్గిపోతున్న కొందరు


క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్‌ శాఖలో అందరికీ సమన్యాయం జరగడం లేదు. రాజకీయ పలుకుబడి ఉంటే కోరుకున్న ప్రాంతంలో దర్జాగా బతకవచ్చు. ఎలాంటి పలుకుబడి లేకపోతే మారుమూల మండలాల్లో  మగ్గిపోవాల్సిందే. రాజకీయ నాయకుల కన్నుసన్నల్లో జిల్లా పోలీస్‌ యంత్రాంగం నడుస్తుండడం వల్లనే పోలీస్‌ సిబ్బంది దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

అనంతపురం సెంట్రల్‌(అనంతపురం): పోలీసు శాఖలో బదిలీల మాయాజాలం అంతా ఇంతా కాదు. రాజకీయ పలుకుబడి లేని చాలా మంది జిల్లా సరిహద్దు మండలాల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు రెండు వందలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయా పోలీసు స్టేషన్‌లో ఉన్నతాధికారులతో సఖ్యతగా లేరనే సాకుతో కొంతమందిని దూరప్రాంతాలకు బదిలీ చేశారు. మిగిలిన శాఖలతో పోలీస్‌ శాఖలో ఇలాంటి కక్ష సాధింపు బదిలీల మోతాడు ఎక్కువగానే ఉంటోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అయితే ఇలాంటి బదిలీలు మంచిగానే ఉన్నా.. సంవత్సరాల తరబడి సుదూర ప్రాంతాలకే వారిని పరిమితం చేయడం విమర్శలకు దారితీస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగానే..
బదిలీల నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్ల ఒకసారి ఉద్యోగిని మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సి ఉంది. ఒకే ప్రాంతంలో మూడేళ్లు దాటిన ఉద్యోగికి, అతని ఇష్టపూర్వకంగానే మరో ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. అయితే ఈ నిబంధనలు పోలీస్‌ శాఖ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఒకే ప్రాంతంలో ఆరేళ్లకు పైగా పనిచేస్తున్న పోలీస్‌ ఉద్యోగుల సంఖ్య దాదాపు 200కు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది వయోభారంతో అనారోగ్య సమస్యల బారిన పడిన వారు ఉన్నారు. అంతేకాక ఉద్యోగ విరమణకు అత్యంత సమీపంలో ఉన్న వారు కూడా ఉన్నారు.

శాసిస్తున్న రాజకీయం
నేర నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తూ అంతర్గత అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడే కీలక బాధ్యత నెత్తిన వేసుకున్న పోలీస్‌ శాఖకు విధుల నిర్వహణలో స్వయం ప్రతిపత్తి ఉంది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ పరిస్థితి పోలీస్‌ శాఖలో ఎక్కడా కనిపించడం లేదు. యావత్‌ పోలీస్‌ యంత్రాంగాన్ని రాజకీయం శాసిస్తోంది. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితి నేడు పోలీస్‌ శాఖకు పట్టింది. రాజకీయ నాయకులను ధిక్కరిస్తే తమను మారుమూల మండలాలకు బదిలీ చేస్తారన్న భయం చాలా మంది పోలీస్‌ సిబ్బందిని వెన్నాడుతోంది. దీంతో ఒకవిధమైన అభద్రతాభావంతో వారు పనిచేయాల్సి వస్తోంది.

బదిలీల్లోనూ నేతల హవా
పోలీస్‌ శాఖ బదిలీలను సైతం రాజకీయ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. వారి సిఫారసు ఉంటే తాము కోరుకున్న చోటులో దర్జాగా బతికేయవచ్చునన్న ఊహ చాలా మంది పోలీస్‌ సిబ్బందిలోనూ వ్యక్తమవుతోంది. ఇందుకు అద్దం పడుతోంది ఇటీవల ముగిసిన పోలీసుల బదిలీల పర్వం. ఫలితంగా జిల్లాలోని పలు సబ్‌డివిజన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇటీవల కొంతమంది ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా స్వయానా ఓ డీఎస్పీ కలుగుజేసుకుని వాటిని నిలుపుదల చేయాలని ఎస్పీని కోరారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఉన్నవారిని బదిలీ చేస్తే శాంతిభద్రతలను కాపాడటం చాలా కష్టమని ఎస్పీ ఎదుట సదరు డీఎస్పీ వాపోయినట్లు సమాచారం.
కొత్త ఎస్పీపై ఆశలు
నెలరోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జీవీజీ అశోక్‌కుమార్‌పై పలువురు పోలీసులు ఆశలు పెంచుకుంటున్నారు. తమ సమస్యలను అర్థం చేసుకుని బదిలీల్లో న్యాయం చేకూరుస్తారనే చాలామంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే తమ అనారోగ్య పరిస్థితులను విన్నవిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి.

దృష్టి సారిస్తున్నాం 
(ఎస్పీ పేరుతో పీపీ ఉంటుంది) కొంతమంది ఐదేళ్లకు పైబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. తొలి ప్రాధాన్యత కింద వారి సమస్యలను పరిగణలోకి తీసుకుంటాం. నిజంగా ఇబ్బందులు ఉన్న వారికి న్యాయం చేస్తా. ఇందు కోసం గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం. అందులో వారి సమస్యను తెలుపుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.
– జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement