న్యాయవాదికి సంకెళ్లు
- ఆస్పత్రిలో మంచానికి కట్టేశారు
- జ్యుడీషియల్ కస్టడీలోని లాయర్‌పై పోలీసుల చర్య
- అడ్వొకేట్ల తీవ్ర ఆగ్రహం.. కర్నూలు జిల్లా నంద్యాలలో రాస్తారోకో
- వారంపాటు విధుల బహిష్కరణకు తీర్మానం
నంద్యాల: జ్యుడీషియల్ కస్టడీలోని న్యాయవాదికి పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు విధులను బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. వారంపాటు విధులను బహిష్కరించేందుకు తీర్మానించారు. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డలో ఈనెల 7న నవ నిర్మాణ దీక్ష సదస్సులో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ప్రభుత్వ అధికారుల అవినీతిపై వితంతువు విమలారాణి ప్రశ్నించారు. ఆర్డీవో స్పందిస్తూ.. సమావేశం ముగిసిన తర్వాత చర్చిద్దామని చెప్పారు. దీంతో ఈనెల 10న బాధితురాలితోపాటు సీపీఐ నేత మురళి, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాది పాములేటి నంద్యాలలో ఆర్డీవోను కలసి సమస్యపై చర్చించారు. ఆ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆర్డీవో ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ వెంకటరమణ వీరిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టయిన న్యాయవాది పాములేటి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కోర్టు అనుమతితో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సందర్భంగా ఆయన కాళ్లకు సంకెళ్లు వేసి మంచానికి కట్టేశారు. ఇది గమనించిన న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను నిరసిస్తూ సోమవారం కోర్టు ప్రాంగణం నుంచి టూటౌన్ పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే బైఠాయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీఐ వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలోని న్యాయవాదికి సంకెళ్లు వేయడంపై సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసమూర్తి, దుర్గాప్రసాద్, రమణ, రాజేశ్వరరెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలసుబ్బయ్య తదితరులు టూటౌన్ సీఐ గుణశేఖర్‌బాబుతో వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీఐ గుణశేఖర్‌బాబు చెప్పడంతో న్యాయవాదులు రాస్తారోకో విరమించారు.
న్యాయవాదిని అవమానిస్తారా?
రాస్తారోకో అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి అధ్యక్షతన న్యాయవాదులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యాయవాదిని అవమానించడం పట్ల పోరాటానికి కమిటీగా ఏర్పడ్డారు. వారం రోజు లు విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, సీఐ వెంకటరమణలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.