- మూడు ఔట్.. మూడు ఇన్
- పునర్విభజనలో అనూహ్య మార్పులు
- తొర్రూరు, స్టేషన్ఘన్పూర్‌కు డివిజన్ హోదా
కొత్తగా 12 మండలాలు
Published Tue, Oct 4 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాలో కొత్తగా 12 మండలాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ నేతలతో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగష్టు 22న ప్రకటించిన ముసాయిదా నోటిఫికేషన్లో ఇందులో 6 మండలాలను పొందుపరిచారు. తాగాగా మరో ఆరు మండలాలు ప్రకటించారు. వీటితో పాటు తొర్రూరు, స్టేషన్ఘన్పూర్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
కొత్త మండలాలు
జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాయి. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. గత ఆగష్టు 22న వెలువరించిన జిల్లాల పునర్విభజనలో కాజీపేట, ఖిలావరంగల్, ఐనవోలు, వేలేరు, చెల్పూరు, ఇల్లంతకుంట మండలాలను ప్రకటించగా, కొత్తగా దంతాలపల్లి, పెద్దవంగర, తరిగొప్పుల, చిన్నగూడూరు, కొమురవెల్లి, టేకుమట్లను మండలాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటు కానున్న 12 మండలాల్లో వరంగల్ జిల్లాలో 5 , జయశంకర్ జిల్లాలో 1, జనగామలో 3, మహబూబాబాద్‌లో 2 , సిద్ధిపేటలో ఒక మండలం కలువనున్నాయి.
మారనున్న సరిహద్దులు
ముసాయిదా నోటిఫికేషన్లో ప్రకటించిన జిల్లాల సరిహద్దులు మారేందుకు ఆస్కారం ఉంది. కొత్తగా జనగామ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఉన్న మూడు మండలాలు జనగామ, జయశంకర్ జిల్లాల్లో కలపాలని నిర్ణయించింది. నల్గొండ జిల్లాలోని గుండాల మండలాన్ని చేర్చాలని నిర్ణయించారు. ముసాయిదాలో ఈ మండలం యాదాద్రి జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాలను జయశంకర్ జిల్లాలో కలపాలని నేతలు సూచించగా సీఎం సానుకూలంగా స్పందించారు. ముసాయిదాలో ఈ మండలాలు కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ముసాయిదాలో హన్మకొండ జిల్లాలో పేర్కొన్న జమ్మికుంట, హుజురాబాద్ మండలాలు తిరిగి కరీంనగర్ జిల్లాలోకి వెళ్తున్నాయి. ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలు కలుస్తున్నాయి. జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్లో తొర్రూరు, స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు జనగామ జిల్లాలో స్టేషన్ఘన్పూర్‌ను రెవెన్యూ డివిజన్గా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో ఉన్న తొర్రూరును డివిజన్ చేయాలనే డిమాండ్‌కు గతంలో సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement