
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది
పెద్దవూర
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన కొర్ర లక్పతి–ధరియాయిలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. వీరిలో చిన్న కుమారుడు కొర్ర సక్రు(17) తండాలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి చిరు జల్లులతో కూడిన వర్షం పడింది.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇంట్లో ఉన్న బల్బును బంద్ చేయటానికి కరెంట్ బోర్డు వద్దకు వెళ్లాడు. స్విచ్ బంద్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు.
ట్రాన్స్‌కో అధికారులే కారణమంటూ..
తండాలో మూడు నెలల క్రితం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దానికి ఎర్త్‌ను సక్రమంగా బిగించకపోవడంతో తండాలో ఏది ముట్టుకున్నా విద్యుత్ షాక్ వస్తుందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని గతంలోనూ తండాలో ఐదారుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారని వాపోయారు. అధికారులు స్పందించి ఎర్త్ తీగలను సరిచేసి మరమ్మతులు చేపడితే ఇంత ఘోరం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం కారణంగానే సక్రు మృతి చెందాడని ఆగ్రహించిన మృతుని బందువులు, తండావాసులు ట్రాక్టర్‌లు, ఆటోలు, ద్వి చక్రవాహనాలపై మృతదేహంతో పెద్దవూర సబ్ స్టేషన్‌కు తరలివచ్చారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి గంట సేపు రాస్తారోకో చేశారు. దీంతో ఎటూ కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడిని ఫలితం లేకుండా పోయింది. సక్రు మృతికి కారణమైన ట్రాన్స్‌కో ఏఈని సస్పెండ్ చేయాలని, ఉన్నతాధికారులు వచ్చేదాకా రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. ఎస్‌ఐ బాడాన ప్రసాదరావు, పీఎస్‌ఐ కె.శ్రీనివాస్‌లు మృతుని బందువులతో మాట్లాడి టాన్స్‌కో ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని సర్ది చెప్పటంతో రాస్తారోకోను విరమించుకున్నారు.
డీఐజీ వాహనాన్ని అడ్డుకున్న మృతుడి బంధువులు
నాగార్జునసాగర్‌లో పోలీస్‌స్టేషన్ నూతన భవన ప్రారంభానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ వస్తుండటంతో డీఐజీ నాగిరెడ్డి సైతం రోడ్డు మార్గంలో వాహనంలో వెళ్తున్నారు. ఆయన వాహనం రాస్తారోకోలో చిక్కుకుంది. డీఐజీ వాహనాన్ని గమనించిన పోలీసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతుడి బంధువులు, గిరిజనులు అంతా ఒక్కసారిగా వాహనానికి అడ్డు వచ్చి తమకు న్యాయం జరిగేదాకా పోనిచ్చేది లేదని అడ్డుకున్నారు. వారికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో వారిని పక్కకు నెట్టి వాహనాన్ని పంపించారు.