రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట్‌లో పదిహేను రోజుల క్రితం జరిగిన చోరీ, మైనర్‌పై అత్యాచారం కేసును నార్సింగి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
గండిపేటలోని అమృత ఆనందనిలయంలో ఉంటున్న మనోజ్ కుమార్ ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రెండు విలువైన ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు మూటగట్టుకున్నారు. వారి అలికిడికి మేల్కొన్న మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు (మైనర్)గట్టిగా అరవబోయింది. దీంతో అప్రమత్తమైన దుండగులు ఆమెను నోటిని గట్టిగా మూసి అక్కడికి నుంచి బయటకు ఎత్తుకుపోయి, అత్యాచారానికి పాల్పడ్డారు.
కొద్దిసేపటి తర్వాత మేల్కొన్న మనోజ్‌కుమార్ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపునకు వెలుపలి నుంచి గొళ్లెం పెట్టి ఉంది. దీంతో ఆయన గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తీశారు. కనిపించకుండా పోయిన బాలిక కొద్దిసేపటి తర్వాత భయంతో వారి వద్దకు చేరుకుంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగతనానికి పాల్పడటంతోపాటు బాలికపై అత్యాచారం చేసిన బబ్లూ శర్మ, అరుణ్ శర్మ అనే వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.