మనసున్న మారాజు కేసీఆర్: కడియం
- సన్నబియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్నాడు
- హరితహారం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మెచ్చుకున్నాడు
పరకాల(వరంగల్ జిల్లా)
చదువుతోపాటు సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొనియాడారు. వరంగల్ జిల్లా పరకాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల హాస్టల్ భవన నిర్మాణం, జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, మల్లక్కపేట సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన సైన్సు ల్యాబ్, ఆత్మకూరుకు మంజూరైన నూతన గురుకుల పాఠశాలలను బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ మనువడు, మనుమరాలు తింటున్న సన్న బియ్యాన్ని విద్యార్ధులకు అందించిన మహామనిషి అని కొనియాడారు.
రాష్ట్రంలో 319 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో 200 గురుకులాలను కేవలం బాలికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారన్నారు. మన రాష్ట్రంలోనే చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం అభినందించారని చెప్పారు. ఏడాదికి 46కోట్ల మొక్కల చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను పెంచడం కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
ప్రభుత్వం రూ.46వేల కోట్లతో మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షితమైన నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. చెరువుల పూడికతీత కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.4600 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రూ.17వేల కోట్లతో రుణమాఫీని అమలు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.