ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
Published Tue, Aug 2 2016 10:00 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ఆకు పచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం 25 లక్షల ఈత చెట్లను నాటాలని తెలిపారు. మొక్కల కొరత ఉన్నందున పొరుగు రాష్ట్రాల నుంచి మొక్కలు తేవడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో నర్సరీల్లో మొక్కల కొరత ఉన్నట్లయితే పొరుగు జిల్లాలలో ఉన్న నర్సరీ మొక్కలను అవసరమైన చోటకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ సీఎం ప్రతి రోజు హరితహారం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇన్‌చార్జి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పని చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలకు నీటి సరఫరా తగ్గినట్లు తెలిపారు. మొక్క సంరక్షణకు ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అనుమతి లేదని తెలియజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున సంబంధిత అటవీ భూములలో వెంటనే మొక్కలు నాటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ అయినందున అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మొక్కలు విధిగా నాటించాలని తెలిపారు.
కల్యాణలక్ష్మీకి మార్గదర్శకాలు జారీ
కల్యాణలక్ష్మీ పథకానికి లబ్ధిదారుల ఎంపిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత తహసీల్దార్ పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 4 కోట్ల 80 లక్షల మొక్కల లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.. ఇప్పటివరకు ఒక కోటి 61 లక్షల మొక్కలు నాటించామని తెలిపారు. జిల్లాలో ఇంకా 25 లక్షల మొక్కలు అవసరం ఉన్నాయని తెలియజేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే జిల్లాకు మొక్కలను పంపిస్తామని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. ఇన్‌చార్జి అధికారులను నియమించి కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పుష్కర ఘాట్లను రాష్ట్ర మంత్రులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ అదనపు సీసీఎఫ్ ఫరై్గన్, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్. యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ తదితరులు పాల్గొన్నారు.
Advertisement