దొంగతనాలకు పాల్పడుతూ ప్రవర్తన మార్చుకోని దాసరి నరేష్(27)పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. బోరబండ శివగంగ నగర్‌లో నివసించే దాసరి నరేష్ దొంగతనాలు చేయడంలో దిట్ట. గత కొంత కాలంగా నేరేడ్‌మెట్, వనస్థలిపురం, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అయిదు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి.
ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఏ మాత్రం ప్రవర్తన మారకపోగా జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నరేష్ 2013లో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ తర్వాత వరుసగా దొంగతనాలకు పాల్పడుతుండటంతో పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు.