అధ్యాపకుల ఉద్యమబాట
3 నుంచి సమ్మెకు దిగనున్న ఒప్పంద అధ్యాపకులు
క్రమబద్ధీకరణ, పదో పీఆర్‌సీ అమలే ప్రధాన డిమాండ్లు
భవిష్యత్తుపై భరోసా కల్పించాలని కోరుతూ ఒప్పంద అధ్యాపకులు ఉద్యమ బాటపట్టనున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, లేకుంటే కనీసం పదో వేతన సిఫా రసులు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈనెల 3నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలుండడంతో కాంట్రాక్టు టీచర్ల ఆందోళన ప్రభావం పది ఫలితాలపై పడనుంది.
పుత్తూరు: రెగ్యులర్ అధ్యాపకులకు తోడు ఒప్పంద అధ్యాపక వ్యవస్థను 2000లో నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో సుమారు 474 మంది ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు తమ సేవలను గుర్తించి ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తుందని ఇన్నేళ్లు ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఇటీవల కనిపించిన ప్రభుత్వ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ముగ్గురు నిపుణుల కమిటీ ఆధారంగా ఒప్పంద అధ్యాపకుల నియామకాలు జరిగారుు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు క్రమబద్ధీకరణకు అడ్డంకి కాదని వారు వాదిస్తున్నారు. క్రమబద్ధీకరణ ఆలస్యమయ్యే పక్షంలో 10వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసి జీతాలైనా పెంచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇప్పటికే పోటీ పరీక్షలకు వయస్సు దాటిపోరుుందని, ఉన్న ఈ ఉద్యోగాలు కూడా తీసేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడాతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 2వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహిస్తామని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే 3వ తేది నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ పరిణామం ఉన్నతవిద్యపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరో మూడు నెలల్లో వార్షిక పరీక్షలుండగా, వీరంత ఒక్కసారిగా సమ్మెలోకి వెళితే ఆ ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది.