నేటి నుంచి రవాణాబంద్
జిల్లా వ్యాప్తంగా సమ్మెలో 1.72 లక్షల లారీలు
మూతపడనున్న పెట్రోలు బంక్‌లు
మద్దతుగా నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు
విజయవాడ వ్యాట్, టోల్ ఫీజులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ట్రాన్స్‌పోర్టు నిరవధిక బంద్ జిల్లాలో గురువారం నుంచి జరగనుంది. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి జిల్లాలోని ట్రాన్స్‌పోర్టర్లు సమాయత్తమవుతున్నారు. లారీ ఓనర్లు, ట్రక్కుల యజమానులు, పెట్రోలు డీలర్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 1.72 లక్షల లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోనున్నాయి. 220 పెట్రోలు బంక్‌లు మూతపడనున్నాయి. ఆయిల్ ట్యాంకర్లను కూడా నిలిపివేస్తారు.
డీజిల్, పెట్రోల్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన లీటరుపై అదనంగా పెంచిన రూ.4 వ్యాట్‌ను రద్దు చేయాలని, టోల్ ట్యాక్స్‌లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌పోర్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్రంలో రూ.4 వ్యాట్ వల్ల లారీల యజమానులు సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. వ్యాట్ వల్ల ఇటు లారీ ఓనర్లు, పెట్రోలు డీలర్లు, ప్రజలపై కూడా భారం పడుతోంది. ఆయిల్ ట్యాంకర్ల కిరాయిలపై కూడా కేంద్రప్రభుత్వం వ్యాట్ వసూలు చేయడాన్ని ట్రాన్స్‌పోర్టర్లు వ్యతిరేకిస్తున్నారు.
పెట్రోలు బంకుల వద్ద కోలాహలం
నిరవధిక సమ్మె కారణంగా బుధవారం సాయంత్రం నుంచి పెట్రోలు బంకుల్లో రద్దీపెరిగింది. వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులో కొన్ని బంకుల వద్ద కార్లు క్యూ కట్టాయి. వాహనదారులు బంకులకు వెళ్లి ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. జిల్లాలో 220 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకు 11 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లాలో మొత్తం ఆరున్నర లక్షల వాహనాలు ఉన్నాయి. వాహనదారులు సమ్మె ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందోననే ఆందోళనతో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, నూజివీడు, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు వాహనాలతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో బంకుల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు పూర్తి సంఘీబావం ప్రకటిస్తున్నట్లు ఏటీఏ అధ్యక్షుడు బాబ్జి తెలిపారు. ఆటోనగర్‌లోని ఏటీఏ కార్యాలయంలో బుధవారం అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు.
సమ్మె జయప్రదం చేయాలి
ట్రాన్స్‌పోర్టు సమ్మెను జయప్రదం చేయాలి. ఎనిమిది నెలలుగా వ్యాట్ భారం తగ్గించాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీనివల్ల ప్రజలపై కూడా భారం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వస్తోంది. వెంటనే ప్రభుత్వం వ్యాట్ ఎత్తివేయాలి.
-పెట్రోలు, డీజిల్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు