వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు | Staff shortages in Telangana University! | Sakshi
Sakshi News home page

వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు

Published Mon, Feb 29 2016 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు

వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు

తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి నియాకాలు లేవు. ఉన్నత విద్యారంగానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడమే తప్పా ఆచరణలో అవేవి లేవు. దీంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువైంది. రెగ్యులర్ వారిలో చాలా మందికి పరిపాలనా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తరగతి గదుల మొఖం చూడటం మానేశారు.

అదనపు బాధ్యతలు లేని వారిలో పలువురు మొక్కుబడిగా వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అకడమిక్ కన్సల్టెంట్ల(ఏసీ)తోనే కొద్దో గొప్పో తరగతులు సా..గుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. బోధనా సిబ్బంది పొందుతున్న వేతనాలకు సంబంధం లేకుండా మొక్కుబడిగా విధులు బోధిస్తున్నారని, నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధ్యాపకులు వర్సిటీకి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని దుస్తితి.
 
పలు విభాగాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువు..
వర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. 26 కోర్సులకు పలు కోర్సుల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే సాగుతున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మాస్యూటిక్ కెమిస్ట్రీ, ఐడేళ్ల కోర్సు ఐఎంబీఏలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక ఏసీలతోనే తరగుతులు నెట్టుకొస్తున్నారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సు ఉంది. ఇది ఓయూ నుంచి తెయూకు బదిలీ అయ్యాక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏసీతో నెట్టుకొస్తున్నారు.

గతంలో ఈ కోర్సు చేసి న విద్యార్థులు 30కి 30 మంది సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్, మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. దీంతో సౌత్ క్యాంపస్‌లో సరైన బోధన లేక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం లేదు. రెగ్యులర్ ఫ్యా కల్టీ లేని కోర్సుల్లో విద్యార్థులు పీహెచ్‌డీ చేసేందుకు వీలు లేక నష్టపోతున్నారు. 67 రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టు లు ఖాళీ ఉండగా, 57 మంది ఏసీలు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 42 అధ్యాపకల పోస్టులు మంజూరు కావాల్సి ఉంది.
 
నాక్ గ్రేడింగ్‌పై ప్రభావం..!
ఇటీవల వర్సిటీ నాక్ గుర్తింపు సాధించింది. అయితే నాక్ పీర్‌టీం వచ్చినపుడు రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండ టం, ప్రత్యేక సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేకపోవడం మైన స్‌గా మారాయి. ఈ అంశాలు నాక్ గ్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో కేవలం నాక్ బీ గ్రేడ్‌నే ఇచ్చింది. లేదంటే ఏ గ్రేడ్ సాధించే అవకాశం ఉండేదని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
 
సైన్స్ కళాశాల, ల్యాబ్‌లు లేవు..

తెయూలో సైన్స్ కళాశాల లేక మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలోనే సైన్స్ కోర్సులు సాగుతున్నాయి. సరిపోయే గదులు లేక తరగతి గదుల్లోనే ల్యాబ్స్ ఉన్నాయి. దీంతో సరైన ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు సాగించలేక పోతున్నారు. ల్యాబ్స్ లేక సైన్స్ విద్యార్థులు ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ఫెలోషిప్’లను పొందలేక పోతున్నారు.
 
తగినంత ఫ్యాకల్టీ అవసరం..
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. ప్రభుత్వం వర్సిటీల్లో కోర్సులు, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని రిక్రూట్ చేయాలి. ప్రస్తుతం తెయూలో తగినంత రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకున్నా సాధ్యమైనంత మేర నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు చేయలేక పోతున్నారు. వీసీ పార్థసారథి వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాక్ గుర్తింపు రావడంతో యూజీసీ, రూసా, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖల నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement