Professor Limbadri
-
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాది నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు లింబాద్రి ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్చార్జి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ఎస్కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. -
డిగ్రీ నచ్చేలా.. విద్యార్థులు మెచ్చేలా!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మళ్ళించడం ఎలా? డిగ్రీ చేసిన వారికి ఆశాజనకమైన భవిష్యత్ ఇవ్వడమెలా? కార్పొరేట్ స్థాయికి తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడమెలా? ఇప్పుడిది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ పాఠ్య ప్రణాళికను సైతం మేళవించి, అదనంగా సాంకేతిక విద్య కోర్సులను జోడించిన హైబ్రిడ్ మోడల్ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులను, కాలేజీలను మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం మీద అదనపు హంగులు అద్ది ఆకర్షణీయంగా మారిస్తే తప్ప విద్యార్థులు డిగ్రీపై దృష్టి సారించేలా చేయలేమని అనేక సర్వేలు పేర్కొంటుండటంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సైతం డిగ్రీని విభిన్నమైన కోర్సులతో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ఆశించినంతగా సత్ఫలితాలివ్వకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు, సగానికిపైగా సీట్లు ఖాళీగానే.. రాష్ట్రంలో 1080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. అంటే విద్యార్థుల సంఖ్యకు మించి దాదాపు 1.68 లక్షల సీట్లు అదనంగా ఉంటున్నాయి. మరోవైపు ఇంటర్ పాసై డిగ్రీలో చేరుతున్నవారు సగటున 2.5 లక్షలకు మించడం లేదు. ఈ ఏడాది తొలి విడత దోస్త్ (డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ) కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 1.12 లక్షల మందికి మాత్రమే డిగ్రీ సీట్ల కేటాయింపు జరిగింది. 1.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా, 6 వేల మంది వరకు అసలు వెబ్ ఆప్షన్లే ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే ఆఖరి విడత వరకు కూడా 2.20 లక్షలకు మించి సీట్లు భర్తీ అయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో మిగతా వారంతా ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపు దృష్టి పెట్టినట్టుగానే భావించవలసి ఉంటుంది. ఉపాధి లభించే కోర్సులపైనే ఆసక్తి సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలావరకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధి లభించాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కన్పిస్తోంది. పోస్టు–గ్రాడ్యుయేషన్, పరిశోధన విద్య వైపు వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యనో, డిగ్రీలో తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపో మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపే ఎక్కువగా వెళ్తున్నారు. డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజా దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ఈ విధంగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్ లేకపోవడం, తక్షణ ఉపాధి లభించే డిగ్రీలపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తుండటంతో.. డిగ్రీ కోర్సులకు అదనపు హంగులు అద్దాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉపాధి కల్పించేలా డిగ్రీ డిగ్రీని సమూలంగా మార్చి ఆశాజనకంగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధన ప్రణాళికలపై విదేశీ విశ్వవిద్యాలయాలతో సమాలోచనలు జరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలతో కలిసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) మూస విధానం మారితే ఆదరణ విద్యా విధానంలో మూస పద్ధతులు పూర్తిగా మారాలి. ఈ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రయోగాలు చేస్తోంది. ఏ సబ్జెక్టులో డిగ్రీ చేసినా, అదే సబ్జెక్టులో పీజీ చేయాలనే నిబంధనలు సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మా రింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకూ మంచి ఆదరణ లభిస్తుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (ఉప కులపతి, ఉస్మానియా వర్సిటీ) కొత్త కాంబినేషన్లతో డిగ్రీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కొత్త హంగులు అద్దుతున్నారు. గతంలో ఉన్న పది రకాల కాంబినేషన్ డిగ్రీ కోర్సులకు ఇప్పుడు మరిన్ని జోడించారు. బీఏలోనే 68, బీఎస్సీలో 73, బీకాంలో 13 రకాల కాంబినేషన్ కోర్సులు చేర్చా రు. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు తీసుకొచ్చారు. బీఎస్సీ గణిత, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ వంటి కాంబినేషన్ కోర్సులు మార్కెట్ అవసరాలు తీర్చేలా ఉన్నాయి. బయోకెమెస్ట్రీ, రసాయన శాస్త్ర కోర్సులకు కాంబినేషన్‌గా కంప్యూటర్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. కమ్యూనికేషన్ ఇంగ్లిష్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను బీఏలో చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే తరహాలో వచ్చే ఐదేళ్ళలో మరిన్ని కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఇష్టమైన డిగ్రీని దేశ, విదేశాల్లోని ఏ యూనివర్సిటీ నుంచైనా ఆన్లైన్ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులు డిగ్రీ వైపు మళ్ళేందుకు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: లాసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా సెట్లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పీజీ లా సెట్లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగింది. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ పాల్గొన్నారు. -
Telangana: ఎంసెట్ నిర్వహణపై.. ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. వర్షాలున్నా, పరీక్షకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. 17 నుంచి 19 వరకూ ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ తేదీలను గతంలోనే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌కు హాజరుకాలేని విద్యార్థులుంటే ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 17 నుంచి జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ సమయానికి వర్షాలు తగ్గుతాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో ఎంసెట్ వాయిదా వేస్తే ఇప్పటికే సిద్ధమైన విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని లింబాద్రి తెలిపారు. పేద విద్యార్థులకు నష్టం: విద్యార్థి సంఘాలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎంసెట్ వాయిదా కుదరదని ఓ సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ చెబితే ప్రభుత్వం వినడం ఏమిటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ప్రశ్నించారు. -
డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌కు సరికొత్త విధానం ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఏ సబ్జెక్టు తీసుకుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనూ అదే కోర్సు చేయాల్సి ఉండేది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. అందుకే ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష నిబంధనలు సడలించారు. ఇక సోషల్ సైన్స్ గ్రూపులైన ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి కోర్సులు ఇంగ్లిష్, తెలుగులో చేయాలంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా సరిపోతుంది. ఉన్నత విద్యలో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌పై కూడా సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉస్మానియా వర్సిటీ వీసీకి ఉన్నత విద్యా మండలి సూచించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా దాదాపు 50 కాలేజీల్లో పలు కోర్సుల్లో జీరో ప్రవేశాలు ఉంటున్నాయి. వీటిని రద్దు చేయడమే మంచిదని మండలి భావిస్తోంది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులను కాలేజీలు నిర్వహించుకునేందుకు అనుమతించడంపై కసరత్తు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లేని గ్రూపుల స్థానంలో విద్యార్థులు కోరుకునే గ్రూపులకు కాలేజీలు ముందుకొస్తే పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 20 శాతం పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 20 శాతం పెంచాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఈ కోటా 5 శాతమే ఉంది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి విదేశీ భాషల కోర్సులను కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యా మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధన విధానంపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌కు అప్పగించింది. సమావేశంలో రాష్ట్ర కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా మండలి వైఎస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ పాల్గొన్నారు. -
గాంధీ మార్గంతోనే సమాజోద్ధరణ
సాక్షి, హైదరాబాద్: సమాజోద్ధరణకు గాంధీ మార్గమే శరణ్యమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. డాక్టర్ ఎస్డీ సుబ్బారెడ్డి రచించిన ‘ఎడ్యుకేషన్ అండ్ రెలవెన్స్ ఆఫ్ గాంధీ వ్యూస్’అనే ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి మంచి ఆలోచనలతో, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ముందుకెళ్ళేందుకు గాంధీ బోధనలు అవసరమన్నారు. గాంధేయవాదమే మార్గం : దిలీప్ రెడ్డి విలువలతో కూడిన విద్యా వ్యవస్థకు గాంధీ ఆశయాలే శరణ్యమని సమాచార హక్కు మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయుడు దిలీప్‌రెడ్డి తెలిపారు. ఈ దృక్కోణం లోపించడం వల్లే విద్యావ్యవస్థ అ నేక సవాళ్ళను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, విద్యావేత్తలు ఆచార్య ప్రకాశ్, పుల్లయ్య, ఎంవీ గోనారెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా రాష్ట్రంలో బీఏ (ఆనర్స్) పాఠ్య ప్రణాళిక రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. సామాజిక, ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన, బహుళజాతి సంస్థల్లోనూ ఉపాధి అవకాశం కల్పించగల నైపుణ్యం అందించడమే కోర్సుల ముఖ్య లక్ష్యమని చెప్పింది. సివిల్స్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకొచ్చే ప్రమాణాలు ఆనర్స్ కోర్సుల ప్రత్యేకతలని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న బీఏ(ఆనర్స్) పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక తలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో నిపుణులు గురువారం విలేకరులకు వివరించారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్, నిజాం కాలేజీలో ఎకనమిక్స్ ప్రవేశపెట్టామని, ఈ నెల 20 వరకూ ప్రవేశం పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి మరికొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో విస్తరించనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ చెప్పారు. ఉన్నత విద్యా మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జుల్లత, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, వరంగల్: తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ర్యాంకులు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో వైఎస్ చైర్మన్‌గా ఉన్న లింబాద్రికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ చదవండి: ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ -
వర్సిటీని వేధిస్తోన్న ఖాళీలు
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏళ్ల తరబడి నియాకాలు లేవు. ఉన్నత విద్యారంగానికి ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడమే తప్పా ఆచరణలో అవేవి లేవు. దీంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు నాణ్యమైన విద్య కరువైంది. రెగ్యులర్ వారిలో చాలా మందికి పరిపాలనా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తరగతి గదుల మొఖం చూడటం మానేశారు. అదనపు బాధ్యతలు లేని వారిలో పలువురు మొక్కుబడిగా వచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అకడమిక్ కన్సల్టెంట్ల(ఏసీ)తోనే కొద్దో గొప్పో తరగతులు సా..గుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. బోధనా సిబ్బంది పొందుతున్న వేతనాలకు సంబంధం లేకుండా మొక్కుబడిగా విధులు బోధిస్తున్నారని, నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధ్యాపకులు వర్సిటీకి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని దుస్తితి. పలు విభాగాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ కరువు.. వర్సిటీలో ప్రస్తుతం 18 విభాగాలు, 26 కోర్సులు నడుస్తున్నాయి. 26 కోర్సులకు పలు కోర్సుల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే సాగుతున్నాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాథ్స్, బీఈడీ, ఎల్ఎల్ఎం, ఫార్మాస్యూటిక్ కెమిస్ట్రీ, ఐడేళ్ల కోర్సు ఐఎంబీఏలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక ఏసీలతోనే తరగుతులు నెట్టుకొస్తున్నారు. భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో ఒకప్పుడు రాష్ట్రంలోనే పేరొం దిన ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సు ఉంది. ఇది ఓయూ నుంచి తెయూకు బదిలీ అయ్యాక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏసీతో నెట్టుకొస్తున్నారు. గతంలో ఈ కోర్సు చేసి న విద్యార్థులు 30కి 30 మంది సీఎస్ఐఆర్ ఫెలోషిప్, మంచి ఉద్యోగాలు సాధించేవారు. ప్రస్తుతం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో రెగ్యులర్ ఫ్యాకల్టీ మొత్తం ఇక్కడే ఉండి పోయారు. దీంతో సౌత్ క్యాంపస్‌లో సరైన బోధన లేక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం లేదు. రెగ్యులర్ ఫ్యా కల్టీ లేని కోర్సుల్లో విద్యార్థులు పీహెచ్డీ చేసేందుకు వీలు లేక నష్టపోతున్నారు. 67 రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టు లు ఖాళీ ఉండగా, 57 మంది ఏసీలు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన కోర్సులకు మరో 42 అధ్యాపకల పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. నాక్ గ్రేడింగ్‌పై ప్రభావం..! ఇటీవల వర్సిటీ నాక్ గుర్తింపు సాధించింది. అయితే నాక్ పీర్టీం వచ్చినపుడు రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండ టం, ప్రత్యేక సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేకపోవడం మైన స్‌గా మారాయి. ఈ అంశాలు నాక్ గ్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో కేవలం నాక్ బీ గ్రేడ్‌నే ఇచ్చింది. లేదంటే ఏ గ్రేడ్ సాధించే అవకాశం ఉండేదని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. సైన్స్ కళాశాల, ల్యాబ్‌లు లేవు.. తెయూలో సైన్స్ కళాశాల లేక మైనస్‌గా మారింది. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలోనే సైన్స్ కోర్సులు సాగుతున్నాయి. సరిపోయే గదులు లేక తరగతి గదుల్లోనే ల్యాబ్స్ ఉన్నాయి. దీంతో సరైన ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు సాగించలేక పోతున్నారు. ల్యాబ్స్ లేక సైన్స్ విద్యార్థులు ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ఫెలోషిప్’లను పొందలేక పోతున్నారు. తగినంత ఫ్యాకల్టీ అవసరం.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. ప్రభుత్వం వర్సిటీల్లో కోర్సులు, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని రిక్రూట్ చేయాలి. ప్రస్తుతం తెయూలో తగినంత రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకున్నా సాధ్యమైనంత మేర నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. సైన్స్ కళాశాల, ల్యాబ్స్ లేక విద్యార్థులు పరిశోధనలు చేయలేక పోతున్నారు. వీసీ పార్థసారథి వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నాక్ గుర్తింపు రావడంతో యూజీసీ, రూసా, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖల నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. - ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్