సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. వర్షాలున్నా, పరీక్షకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది.
17 నుంచి 19 వరకూ ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ తేదీలను గతంలోనే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది.
ఇదే విషయాన్ని మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌కు హాజరుకాలేని విద్యార్థులుంటే ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 17 నుంచి జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ సమయానికి వర్షాలు తగ్గుతాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో ఎంసెట్ వాయిదా వేస్తే ఇప్పటికే సిద్ధమైన విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని లింబాద్రి తెలిపారు.
పేద విద్యార్థులకు నష్టం: విద్యార్థి సంఘాలు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎంసెట్ వాయిదా కుదరదని ఓ సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ చెబితే ప్రభుత్వం వినడం ఏమిటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment