జిల్లాలో సమైక్య సెగలు
Published Sun, Aug 11 2013 12:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
జిల్లాలో సమైక్య సెగలు హోరెత్తుతున్నాయి. రోజురోజుకూ ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఊరూరా పోరు ఉధృతమవుతోంది. ఎడ్లబండ్లతో.. ట్రాక్టర్లతో.. ఆటోలతో.. పల్లెలు జనకెరటాలై కదులుతున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఒక్కటై రోడ్లమీదకొచ్చి సమైక్యాంధ్రకు జైకొడుతున్నారు. శనివారం జిల్లా అంతటా ర్యాలీలు, మానవహారాలు, విభిన్న ప్రదర్శనలతో మోతెక్కిపోయింది. రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ధి పొందాలనే కుయుక్తితో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ తీరుకు నిరసనగా జగన్, విజయమ్మల రాజీనామాలను జిల్లా ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించారు.
సాక్షి, విజయవాడ :సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు వెల్లువెత్తుతోంది. మచిలీపట్నంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం వివిధ కళాశాలలకు చెందిన సుమారు మూడువేల మంది విద్యార్థులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు నిరసన గళం విప్పారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఈ నెల 13న మహాధర్నా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కోనేరుసెంటర్‌కు చేరుకునే నాలుగు ప్రధాన రహదారులను సైతం దిగ్బంధించాలని నిర్ణయించామన్నారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దు గరికపాడు నుంచి అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, చిల్లకల్లు గ్రామాల మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట వరకు రైతులతో కలసి ట్రాక్టర్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ ఉదయభాను ట్రాక్టర్ నడుపుతూ పాల్గొన్నారు. మచిలీపట్నం-చల్లపల్లి 216 జాతీయ రహదారిపై మూడు వేల మందికిపైగా ప్రజలు, కార్మికులు నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై నడుస్తూ ర్యాలీ నిర్వహించారు.
పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ జరిపారు. వందకు పైగా ఎడ్లబండ్లతో చల్లపల్లిలో ర్యాలీ నిర్వహించారు. గుడివాడలో ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు వంటావార్పు, నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో సమైక్యాంధ్ర కోరుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.
ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకరరావు ప్రకటించారు. కంచికచర్లలో జాతీయ రహదారిపై ముగ్గులువేసి విద్యార్థినులు నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలులో సంపూర్ణ బంద్ పాటించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద శనివారం 20 మంది సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు.
నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష..
ముదినేపల్లిలో వీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చి పోరంకిలో స్థిరపడిన కల్లుగీత కార్మికులు తాడిగడప సులాబీ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. పెదపారుపూడి మండల పరిధిలోని వెంట్రప్రగడ ప్రధాన సెంటర్లోని గుడివాడ-కంకిపాడు రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నూజివీడులో శ్రీశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉయ్యూరు రిక్షా కార్మికులు ప్రధాన సెంటరులో ప్రదర్శన నిర్వహించి, మానవహారం నిర్మించారు.
గులాబీలు పంచి..
కంకిపాడు హవీలా పాఠశాల విద్యార్థులు బస్టాండు సెంటరులో గులాబీలు పంచి సమైక్యాంధ్రకు మద్దతు తెలియచేయాలని కోరారు. ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట ఏపీఈఈ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పెనుగంచిప్రోలులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతమ్మ ఆలయం వద్ద నుంచి ఎడ్లబండ్లపై కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, రాస్తారోకో జరిగింది.
Advertisement
Advertisement