విజిలెన్స్‌ అధికారుల దాడి | The Vigilance officers raid | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అధికారుల దాడి

Published Sat, Sep 10 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

విజిలెన్స్‌ అధికారుల దాడి

విజిలెన్స్‌ అధికారుల దాడి

  •  కోళ్ల ఫౌల్టీ ఫాంలో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత
  •  258 సంచులు స్వాధీనం
  • తాడ్వాయి :
    పౌల్ట్రీఫాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. విజిలెన్స్‌ సీఐ శ్రీనివాస్‌ రావు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేమికలాన్‌కు చెందిన 14 నంబరు రేషన్‌ డీలర్‌ జలగం సునీత భర్త జలగం రాజు రేషన్‌ సంబంధించిన 50 కిలోల బరువు గల 258 సంచుల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచాడు. రెండు రోజుల నుంచి అదే గ్రామానికి చెందిన బాలూరి రాజిరెడ్డి అనే రైతుకు సంబంధించిన పౌల్ట్రీఫాంలో అక్రమంగా నిల్వఉంచారు. ఈ విషయం విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి అధికారులు అక్కడికి చేరుకొని అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. శనివారం తిరిగి అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన బియ్యం 125 క్వింటాళ్ల వరకు ఉంటాయన్నారు. ఇతర ప్రాంతాల్లో గల గోదాములు, రేషన్‌ దుకాణాల నుంచి బియ్యం తీసుకురావచ్చని అనుమాన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు జలగం రాజుపై కేసు నమోదు చేసి నివేదిక ఆర్డీవోకు పంపిస్తామన్నారు. బియ్యాన్ని కామారెడ్డిలోని గోదాముకు పంపిస్తామని చెప్పారు. దాడిలో ఎస్సై సాదత్‌ మియ, అసిస్టెంటు రిజిస్టార్‌ రమేశ్‌ కుమార్, కానిస్టేబుల్‌ రాములు, తహసీల్దార్‌ రఘునాథ్, సివిల్‌ సప్ల్సై డీటీ నర్సింలు, వీఆర్వో జనార్దన్‌ పాల్గొన్నారు.
    అక్రమ బియ్యం తరలింపు వాహనాలను పట్టుకున్న అధికారులు
    నవీపేట :
    నిజామాబాద్‌ నుంచి మహారాష్ట్ర వైపు మూడు టాటా ఏస్‌ వాహనాల్లో అక్రమంగా తరలుతున్న 62.40 క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్‌ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం ఉదయం మండలంలోని యంచ సమీపాన గల రైస్‌మిల్‌ వద్ద పట్టుకున్నారు. నవీపేట మీదుగా మూడు టాటాఏస్‌(ఏపీ 15వై 1706, ఏపీ 25 ఎక్స్‌ 2456, ఏపీ 25 డబ్ల్యూ 3724 నంబర్లు గల) వాహనాల్లో పీడీఎస్‌ బియ్యం తరులుతున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ సతీశ్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందింది. ఆయన వెంటనే యంచలోని వీఆర్వోలు లింగం, భూమన్న, వీఆర్‌ఏలు నరేశ్, సాయికుమార్, పండరిలను అప్రమత్తం చేశారు. స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల ప్రాంతంలో యంచ సమీపాన మహేశ్వరి రైస్‌మిల్‌ వద్ద వాహనాలను పట్టుకున్నారు. భయపడిన వాహన డ్రైవర్లు తప్పించుకుని పక్కనే ఉన్న రైలు పట్టాలు దాటి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్‌ సప్లై ఏఎస్‌వో రెహమాన్, డీటీలు సతీశ్‌ రెడ్డి, సుధాకర్, హరిబాబు, గిర్దావర్‌ రవీందర్‌ రెడ్డిలు వాహనాలను సీజ్‌ చేశారు. పట్టుబడిన మూడు వాహనాల్లో రెండు వాహనాలు నిజామాబాద్‌ నుంచి బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైనట్లు అధికారులు తెలిపారు. మరో వాహనంలోని బియ్యం ఎక్కడివో విచారణ చేస్తున్నామన్నారు. బియ్యాన్ని నవీపేటలోని కార్తీకేయ రైస్‌మిల్‌లో ఉంచామని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement