జలాశయంలో మునిగి యువకుడి మృతి
Published Mon, Sep 26 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
వర్ని:
మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల జలపాతంలో మునిగి మండలంలోని సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. బంధువుల రోదనల మధ్య సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల కథనం ప్రకారం.. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన భీష్మ, గోవిందకుమారి దంపతులకు కూతురు కీర్తి, కుమారుడు శరత్‌కుమార్ (21) ఉన్నారు. చిన్ననాటి చదువులో రాణించిన శరత్ ఐఐటీలో 57వ ర్యాంకు సాధించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పుణెలోని ప్రముఖ కంపెనీలో గత జూన్‌లో ఇంజినీర్‌గా చేరాడు. కీర్తి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవలే అమెరికా వెళ్లింది. శనివారం సెలవు కావడంతో పుణెకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లునావాల పావని దరవత్ జలాశయం చూడడానికి కలిసి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ముగ్గురు స్నేహితులు ఒడ్డున ఉండగా, మరో ఇద్దరితో కలిసి నీటిలోకి దిగిన శరత్ మునిగిపోయాడు. స్నేహితుల సమాచారంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. స్వగ్రామమైన సత్యనారాయణపురంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement