పోలీసు స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం
కొండాపురం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక పోలీసు స్టేషన్‌లోనే ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న తండ్రి, బంధువు స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డికి నాలుగు నెలల క్రితం మధుసూదనరెడ్డి అనే వ్యక్తి కడపకు చెందిన మధుభూషన్‌రెడ్డి కారును రూ.2 లక్షల 66వేలకు ఇప్పించాడు. కారు కొనుగోలు చేసిన సమయంలో కిరణ్కుమార్రెడి్డ కేవలం రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మిగిలిన సొమ్ముకు మధుసూదన్‌రెడ్డి పూచీకత్తు రాయించాడు. అయితే నెలరోజుల పాటు బాగా నడిచిన కారు కొద్దిరోజుల్లోనే ఇంజన్ సీజ్ అయింది. అయితే మధుసూదన్‌రెడ్డి మాత్రం కారు కొనుగోలు సమయంలో తాను రూ.2 లక్షల 6వేలు పూచీకత్తు పడ్డానని ఆ డబ్బులను ఇప్పించాలంటూ మూడు నెలల క్రితం పోలీసు స్టేషన్‌లో పంచాయితీ పెట్టించాడు. అయితే మల్కిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను ఎవరికీ డబ్బులు బాకీ లేనని పూర్తి డబ్బులు చెల్లించడంతోనే తనపేరుమీద కారు రిజిస్రే‍్టషన్ చేయించారని, అనవసరంగా తనను వేధించ వద్దంటూ పోలీసుతో గట్టిగా వాదించారు. కాగా దీనికి సంబంధించి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. రెండురోజుల క్రితం తాళ్లప్రొద్దుటూరుకు రావడంతో సోమవారం మధుసూదన్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి ఎస్‌ఐ కృష్ణయ్య కిరణ్‌కుమార్‌రెడ్డిని పట్టుకుని రావాలంటూ కిందిస్థాయి పోలీసులను ఆదేశించారు. ఇంటి వద్ద ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు తాళ్లప్రొద్దుటూరు స్టేషన్‌కు తీసుకొని వచ్చారు. ఎస్‌ఐ రూ.2 లక్షల6 వేలు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తీసుకొని రావడంతో పాటు పరుషంగా దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు తన వెంట తెచ్చుకున్న వాస్మోల్ తాగి పోలీసు స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గమనించిన పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు ఎలాంటి విషయం తెలియపరచకపోవడంతో తన కుమారుడిని పోలీసులు ఏం చేశారంటూ తండ్రి వెంకట్రామిరెడ్డి, బంధువు శ్రీకాంత్‌రెడ్డి కూడా పోలీసు స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై కొండాపురం సీఐ రవిబాబు విలేకరులతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డిపై 420 కేసు నమోదై ఉండటంతో అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషన్‌కు పిలిపించామన్నారు. అతను తమకు తెలియకుండా ఆత్మహత్యకు యత్నించాడని తెలిపారు.