నెల్లూరులో పట్టపగలు దోపిడీ
Published Tue, Aug 2 2016 11:55 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
వద్ధురాలిపై దాడిచేసి నగల అపహరణ
బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నెల్లూరు(క్రైమ్) : ఒంటరిగా ఉన్న వద్ధురాలిపై ఇద్దరు దొంగలు దాడి చేసి బంగారునగలను అపహరించిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. బాలాజీనగర్‌లో వెంకటమ్మ నివాసముంటోంది. ఆమె కుమారుడు రఘురామరాజు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ఏఓగా పనిచేస్తున్నాడు. దీంతో అతని భార్య సునీత వెంకటమ్మతో పాటు ఉంటోంది. సోమవారం సునీత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో వెంకటమ్మ ఒక్కటే ఉంది. మంగళవారం ఉదయం ఆమె పనులు ముగించుకొని పక్కపోర్షన్ గ్రిల్స్‌కు గడియపెట్టుకొని వరండాలో నిద్రించింది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇంటికి వచ్చి గ్రిల్స్‌తట్టాడు. ఆమె ఎవరని ప్రశ్నించగా.. అవ్వా తలుపుతెరువు నీకు రూ.20 ఇవ్వాలంటూ అతను మాటలు కలిపాడు. దీంతో ఆమె గడి తీసింది. ఆ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి తన చేతిలో ఉన్న నగదును కిందపడేసి ఆమెపై దాడిచేశాడు. ఇంట్లోనుంచి బయటకు లాక్కొచ్చి గొంతుపై కాలుపెట్టి తొక్కుతుండగా మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఆమె మెడలోని రెండుసవర్ల బంగారు సరుడును లాక్కొన్నారు. అనంతరం చేతికున్న గాజులు(పిచ్చివి)బంగారువని భావించి వాటిని తీసుకున్నారు. నిందితులు వెళ్లిపోతుండగా బాధితురాలు తేరుకుని పెద్దగా కేకలువేసింది. ఈ ఘటనలో వద్ధురాలి మెడకు, చేతులకు గాయాలయ్యాయి.
నిందితులను పట్టుకుందిలా..
వెంకటమ్మపై దాడిచేసి పరారవుతోన్న దుండగులను స్థానికులు గుర్తించారు. అందులో ఓ వ్యక్తి రామ్‌నగర్ మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న పిండిమిల్లు యజమాని కుమారుడు పి.లక్ష్మయ్యగా గుర్తించి దోపిడి ఘటనపై బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ చెంచురామారావు, ఎస్సైలు వెంకటరావు, సుధాకర్‌లు పరిశీలించి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆరాతీయగా అతను ఇంట్లో లేకపోవడంతో ఫొటో సేకరించి రెండు బందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ సమీపంలోని గాయత్రిబార్ గోడ వెనుకవైపును లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని వెంటబెట్టుకొని మరో నిందితుడైన వెంటకేశ్వరపురం భగత్‌సింగ్ కాలనీకి చెందిన లారీ మెకానిక్ వలిని జాతీయరహదారిపై ఆటో ఎక్కుతుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ స్నేహితులు. మంగళవారం ఉదయం ఫూటుగా మద్యంసేవించి, వెంకటమ్మ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఎవరూ లేరని నిర్ధారించుకుని దాడికి తెగబడ్డారు. విడిపోయి సాయంత్రం వాటిని అమ్మిసొమ్ము చేసుకుందామని భావించారు. ఇంతలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరు గతంలోనూ ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారు. కాగా పట్టపగలు జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది.
Advertisement