పీతల సాగుతో అధిక లాభాలు
Published Mon, Aug 28 2017 11:09 PM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM
నరసాపురం రూరల్: పీతలు, పండుగప్ప సాగులో ఆధునిక పద్ధతులు అవలబించడం ద్వారా అధిగ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజలి అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద సోమవారం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన మూడు రోజుల సదస్సును ఆమె ప్రారంభించారు. తీరప్రాంత గ్రామాల్లో వా తావరణం పీతలు, పండుగప్పల సాగుకు అనుకూలమన్నారు. ఇప్పటి వరకూ రైతులు చేప, వనామీ, టైగర్, రొయ్యల సాగుపైనే ఎక్కువగా దృష్టి సారించారని, పీతలను బాక్సుల్లో ఉంచి సాగుచేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు అధిక లాభాలను ఆర్జించవచ్చని వివరించారు. మూస పద్ధతిలో కాకుండా మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు సాగు చేయాలన్నారు. నరసాపురం మండలంలో ఇప్పటికే చంద్రన్న రైతు క్షేత్రంలో భాగంగా పండుగొప్ప, పీతల రైతు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్పంచ్ చామకూరి సుబ్బలక్ష్మీరామ్మొహనరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఫణి ప్రకాష్, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ధి అధికారులు ఎల్‌ఎన్‌ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, రైతులు పాల్గొన్నారు.
Advertisement