రాజధానిలో భద్రత డొల్ల
సాక్షి, అమరావతి : అది రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి గ్రామం. ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున ఏపీ07టీజీ 7477 నంబర్ ట్రాక్టర్ అపహరణకు గురైంది. 8వ తేదీన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీలపై ఆ«ధారపడ్డారు. తాడేపల్లి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ట్రాక్టర్ వారధిపై నుంచి వెళ్లడాన్ని స్పష్టంగా గమనించారు. అదే దారిలో సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించుకుంటూ బ్యారేజీ నుంచి విజయవాడ నగరంలోకి వెళితే ట్రాక్టర్ దొంగను పట్టుకోవచ్చని ధీమాగా ముందుకు సాగారు.
అయితే ప్రకాశం బ్యారేజీపై విజయవాడ వైపు ఉన్న 15 సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడం లేదని తెలిసి కంగుతిన్నారు. అంతే కాదు విజయవాడ నగరంలోని వన్‌టౌన్, ప్రధాన రహదారిలోనూ సీసీ కెమెరాల్లో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని పోలీసులకే అనుభవమైంది. ఫుటేజీ చూడటానికి అసలు సీపీ కెమెరాలే పనిచేయడం లేదని నిర్ధారించారు. ఇంతకీ ట్రాక్టర్ వెళ్లిన దారిలో వెదుకుదామని వెళితే నిఘా నిద్రపోతున్న వైనం వెలుగు చూసింది. ప్రకాశం బ్యారేజీ, వన్‌టౌన్‌కు ఆనుకుని ఉన్న విజయవాడ ప్రధాన రోడ్డు మార్గంలో నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తుంటారు.
ఈ మార్గంలో లెక్కకు మిక్కిలి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినప్పటికీ అవి ఏమేరకు పనిచేస్తున్నాయో పరిశీలించడంలో మాత్రం ఘోర వైఫల్యం కన్పిస్తోంది. చిత్రం ఏమిటంటే ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక స్తంభానికి ఏకంగా ఏడు సీసీ కెమెరాలు బిగించారు. అందులో ఏ ఒక్కటీ పనిచేయడంలేదని గుర్తించారు. మూడు రోజలపాటు జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు సైతం దేశవిదేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. బౌద్ధమత గురువు దలైలామాకు, మావోయిస్టుల నుంచి చంద్రబాబుకు హాని ఉందని గతంలోనే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి కీలక సమయంలో సీసీ కెమెరాలు ఎంత వరకు పనిచేస్తున్నాయనే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కన్పిచడం గమనార్హం.