వారు ఉరిశిక్షకూ అర్హులే: సీఎం
♦ కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ నిందితులపై చంద్రబాబు
♦ ఆ వ్యవహారాన్ని నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది
♦ ఆధారాల కోసం పత్రికలు, చానళ్లకు నోటీసులు
♦ తహసీల్దార్ వనజాక్షి పరిధి దాటారు...ఆమెపై కూడా చర్య తీసుకోవాలి..
సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కేసులో నిందితులు ఉరి శిక్షకు కూడా అర్హులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాల్ మనీపై శాసన మండలిలో చర్చ సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యవహారంపై ప్రజా ప్రతినిధులుగాని లేదా బాధితులు ఎవ్వరైనా తప్పుడు ఆరోపణలు చేయకుండా వారి వద్దనున్న ఆధారాలు తనకు ఇస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని పసిగట్టడంలో నిఘా వ్యవస్థ సైతం విఫలమైందన్నారు. ఈ కేసుకు సంబంధించి మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తోచిన విధంగా రాస్తూ ప్రజలను గందరగోళం చేస్తోందన్నారు.
సాక్ష్యాధారాలుంటే నిర్భయ కేసు న మోదు చేస్తున్నామని...కొన్ని ఛానెళ్లు మహిళలకు ముసుగులు వేసి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ మాట్లాడిస్తున్నాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకోలేమని, స్పష్టమైన ఆధారాలు కావాలన్నారు. అందుకే వార్తలు ప్రచురించి, ప్రసారం చేసిన పత్రికలు, టీవీ ఛానెళ్లకు నోటీసులు ఇచ్చి వాటి ఆధారాలు సేకరించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఇసుక మాఫియాకు సంబంధించి మహిళా తహసీల్దార్‌పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై ఏమి చర్యలు తీసుకున్నారని సీపీఐ సభ్యుడు పి.జె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిని ప్రశ్నించగా తహసీల్దార్ తన పరిధి దాటి వెళ్లినందునే అక్కడ సమస్య ఉత్పన్నమైందన్నారు. ఆమె మండల పరిధి కాదు...ఏకంగా ఇతర జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో ఆమె తల దూర్చారు... వాస్తవానికైతే ఆమెపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఇప్పటి వరకు 227 కేసులు
కాల్ మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, సొంత సమాచారంతో ఇప్పటి వరకు 227 కేసులు నమోదు చేసి 188 మందిని అరెస్టు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. కాల్‌మనీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై ఇప్పటికే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కరువు రహిత రాష్ట్రమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌ను కరువులేని రాష్ట్రంగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తోందని ‘నీరు - ప్రగతి’పై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ నూతన రాజధాని ప్రాంతం నుంచే పని చేస్తాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు బి.చెంగల్ రాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయమై సచివాలయంలోని అన్ని శాఖలకు, శాఖాధి పతులకు ఈ నెల 1వ తేదీన ప్రధాన పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు.