కడప అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగ షేక్ నిజాముద్దీన్ అలియాస్ నిజాంను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నాలుగు కేసుల్లో అరెస్టయి ఈ ఏడాది మే 7న జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి కడప టుటౌన్ పరిధిలో 15 చోరీలు, చిన్నచౌకు పరిధిలో ఒక దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో ఒక కేసులో చోరీకి పాల్పడ్డాడు. కాగా కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తమ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన వివరాలను, రికవరీ చేసిన సొత్తు గురించి వెల్లడించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ కడప కేంద్రకారాగారం నుంచి విడుదలైన తర్వాత నిజాముద్దీన్ జులై మొదటి వారంలో చిలకల బావి వద్ద టీవీఎస్‌ను చోరి చేశాడు. అప్పటి నుంచి ఆ వాహనంలో తిరుగుతూనే కడప దండోరా కాలనీ, బిస్మిల్లా నగర్ తదితర చోట్ల ఇళ్లల్లో చోరీ చేశాడు. చోరీ చేసిన బంగారు వస్తువులను తిరుపతిలో కొత్తవారికి అమ్ముకుని, కొన్ని వస్తువులను తన దగ్గరే పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈనెల 28న కడప మాచుపల్లె రోడ్డులో హిందూ శ్మశానవాటికకు ఎదురుగా నిందితుడు టీవీఎస్ ఎక్సెల్‌లో వెళుతుండగా వాహనాల తనిఖీ చేస్తుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి నుంచి మూడు చోరీల్లోని 185 బంగారు ఆభరణాలను, 250 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కృషి చేసిన టూటౌన్ ఎస్‌ఐలు జి. అమరనాథ్‌రెడ్డి, రుష్యేంద్రబాబు తదితరులను డీఎస్పీ అభినందించారు.