
నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ పూజ
రూ.9.20లక్షల సొత్తు స్వాధీనం
వరంగల్: ఘరానా దొంగను అరెస్ట్ చేసి అతడి నుంచి 302 గ్రాముల బంగారు ఆభరణాలు, 105 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు, మొత్తం రూ.9.20లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సిటీ క్రైం ఏసీపీ ఇంజారపు పూజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏసీపీ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బక్కశెట్టి కొమురయ్య అలియాస్ అజయ్‌కుమార్ సెంట్రింగ్, రాడ్ బైండింగ్ పనిచేసుకునేవాడు.
తాగుడుకు బానిసై సైకిల్ దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుపడి జైలు శిక్ష అనుభవించాడు. 2005లో హైదరాబాద్‌కు వెళ్లి నారాయణగూడ, చిక్కడపల్లి, ఇందిరాపార్కు ప్రాంతాల్లో, 2010–11లో వరంగల్‌లోని ఇంతేజార్‌గంజ్, సుబేదారి, కేయూసీ పీఎస్‌ల పరిధిలో దొంగతనాలు చేసి స్థానిక సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. 2014లో నిజామాబాద్‌లో రెండు, 2015–16లో జగిత్యాల జిల్లాలో పది దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
ఇతడిపై పలు జిల్లాలకు చెందిన నాన్ బెయిలబుల్ వారెంట్లు, 17 పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఉండేవాడు.ఈ ఏడాది ఫిబ్రవరి–ఏప్రిల్ నెల వరకు కమిషనరేట్ పరి«ధిలోని కాజీపేట, మట్వాడ, కేయూసీ, జనగామ పీఎస్ పరి«ధిలో నాలుగు దొంగతనాలకు పాల్పడి 302 గ్రాముల బంగారు, 105 గ్రాముల వెండి అభరణాలతో పాటు రూ.17వేల నగదును దోచుకుపోయాడు.
దొంగిలించిన బంగారు, వెండి నగలను విక్రయించి ఒక టాటా ఏస్ వాహనం కొనుగోలు చేయాలని బుధవారం జగిత్యాల నుంచి వరంగల్‌కు బస్సులో వస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు కేయూసీ క్రాస్ రోడ్డు వద్ద కొమురయ్యను అదుపులోకి తీసుకొని రూ. 9.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అంతరాష్ట్ర దొంగ కొమురయ్యను చాకచక్యంతో పట్టుకున్న క్రైం ఏసీపీ పూజ, ఇన్స్‌పెక్టర్ డేవిడ్‌రాజు, ఎస్‌ఐ బీవీ సుబ్రమణ్యేశ్వర్‌రావు, హెడ్‌కానిస్టేబుళ్లు వీరస్వామి, శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్వర్, రాజశేఖర్, హరికాంత్, జంపయ్యలను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.