బీటెక్ చదివి.. జల్సాలకు అలవాటు పడి...
అన్నం పెట్టిన సంస్థకే కన్నం
జ్యూయలరీ షాపులో 350 గ్రాముల బంగారు బిస్కట్లు అపహరణ
గుట్టు విప్పిన సీసీ కెమెరా
యువకుడి కి రిమాండ్
అల్లిపురం : యువత చెడువ్యసనాలకు అలవాటు పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఓ సంఘటన ఇది. బీటెక్ చదివిన కుర్రాడు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఓ జ్యూలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ, వ్యసనాలకు అలవాటుపడి.. సంపాదన చాలక అన్నం పెడుతున్న సంస్థకే కన్నం పెట్టాడు. ఫలితంగా ఆ యువకుడిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 350 గ్రాముల బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ టి. రవికుమార్‌మూర్తి కేసు వివరాలు వెల్లడించారు.
అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, తలారి చెరువు గ్రామానికి చెందిన జంగంరెడ్డి గారి కుమార్‌రెడ్డి బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయే పెంచి పెద్ద చేశాడు. చదువు పూర్తయిన తరువాత ఈ ఏడాది జనవరి 21న విశాఖలోని తనిష్క్ జ్యూయలరీ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. బాబాయికి దూరంగా ఉండటంతో మంచిచెడులు చెప్పేవారు లేక కుమార్ రెడ్డి దుర్వ్యసనాలపైపు ఆకర్షితుడయ్యాడు. గ్యాంబ్లింగ్, కేసినో బెట్టింగ్‌లతో జల్సాలకు అలవాటు పడ్డాడు.
ఆదాయం చాలకపోవడంతో పనిచేస్తున్న సంస్థకు కన్నం వేయడానికి తెగించాడు. ఈ మేరకు గత నెల 26 షోరూం సిబ్బంది అంతా సమావేవంలో ఉండగా, పక్క గదిలో సొరుగు తెరిచి రూ.3.50లక్షల విలువ గల 350గ్రాముల బంగారు బిస్కట్లు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న సంస్థ సిబ్బంది త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడని శుక్రవారం ద్వారకా బస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీపీ టి.రవికుమార్‌మూర్తి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియకుండా, అపరిచిత వ్యక్తులను ఉద్యోగంలో పెట్టుకోవ ద్దని వ్యాపారులకు సూచించారు.