దొంగ కోళ్లు
దొంగ కోళ్లు
Published Fri, Jan 13 2017 10:48 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
కార్పొరేషన్‌లో టెండర్ ఆట
- రింగ్ చేసేందుకు ఒక నేత యత్నం
- అందరూ టెండర్లు వేయాలని మరో నేత ఆదేశం
- బరిలో పలువురు కాంట్రాక్టర్లు
- కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్‌లో దొంగ కోళ్ల సందడి మొదలయింది. కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి.. కేవలం ఒకరిద్దరే టెండర్‌లో పాల్గొనేలా చేసి సులభంగా ‘ఆట’ గెలిచేందుకు అధికార పార్టీ నేత ఒకరు ప్రయత్నం చేశారు. అయితే, టెండర్‌లో అందరూ పాల్గొనాలంటూ మరో నేత ఆదేశించడంతో కార్పొరేషన్‌లో గెలుపు కోడి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. రింగ్ కావడం ద్వారా ఏకపక్షంగా పందెం గెలవాలనుకున్న నేత కాస్తా మెత్తపడ్డారు. ఫలితంగా రూ.10.2 కోట్ల విలువ చేసే ఈ పనులన్నింటిలో ఇప్పుడు పోటీ మొదలయ్యింది. మొదట్లో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరను కోట్ చేసి టెండర్ దక్కించుకుందామనుకున్న సదరు నేత ఆలోచనకు బ్రేకులుపడ్డాయి. తాజాగా కాంట్రాక్టర్లు పోటీపడటంతో తక్కువ ధరకే పనులు దక్కే అవకాశం ఉంది. ఈ మొత్తం రూ.10.2 కోట్ల పనుల్లో సుమారు కోటి రూపాయల మేరకు కార్పొరేషన్ ఖజానాకు మిగలనుందని సమాచారం. అంతిమంగా ఈ ఆటలో కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు వచ్చినట్లయింది.
ఇవీ పనులు....!
– రూ.70 లక్షల విలువైన కల్లూరు దర్వాజా నుంచి ఉస్మానియా కాలేజీ మీదుగా ఉమర్ అరబిక్ కాలేజీ వరకు రోడ్డు వెడల్పు పనులు.
– రూ.80 లక్షల అంచనా వ్యయంతో రేణుక ఆసుపత్రి నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు వెడల్పు పనులు.
– గాయత్రీ ఎస్టేట్ నుంచి మద్దూరు నగర్ మీదుగా సి–క్యాంపు సర్కిల్ వరకు రోడ్డు వెడల్పు పని. ఈ పని అంచనా వ్యయం రూ.85 లక్షలుగా కార్పొరేషన్ అధికారులు తేల్చారు.
– కోటి రూపాయల విలువ కలిగిన విష్ణుటౌన్‌షిప్ నుంచి జాతీయ రహదారి–44 వరకు(ఈద్గా పశ్చిమవైపునకు)
– కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యుబీ) వద్ద పశ్చిమ వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు.
– కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యుబీ) వద్ద తూర్పు వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు.
– రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నంద్యాల రోడ్డు (ఎన్‌హెచ్–18) నుంచి గుత్తి రోడ్డు (ఎన్‌హెచ్–44) వరకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు నిర్మాణం.
కోటి ఖన్నానికి బ్రేకులు
మొత్తం ఎనిమిది పనుల విలువ రూ.10.2 కోట్లు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లను రింగు చేసి.. టెండర్‌లో కేవలం ఒక్కరిద్దరే పాల్గొని అధిక ధరకు టెండర్ వేయించాలనేది అధికార పార్టీలోని ఒక నేత ప్రయత్నం. తద్వారా కనీసం 5 శాతం అధిక ధర అంటే టెండర్ విలువ కంటే రూ.50 లక్షల మేరకు అధికంగా కొట్టేయాలనేది పన్నాగం. అంటే రూ.10.2 కోట్ల విలువైన పనులను రూ.10.7 కోట్లకు కొట్టేయాలని నిర్ణయించారు. అయితే, తాజాగా అందరూ టెండర్‌లో పాల్గొనడంతో ఈ మొత్తం టెండర్లన్నీ తక్కువ ధరకే(లెస్సుకే) పనులు దక్కే అవకాశం ఉంది. కనీసం 5 శాతం లెస్సు లెక్కించినా.. టెండర్ ధర కంటే రూ.50 లక్షలు తగ్గుతుంది. అంటే రూ.9.7 లక్షలకే కాంట్రాక్టర్లు పనులు చేయనున్నారు. ఒకవేళ టెండర్‌లో రింగు అయితే.. కోటి రూపాయల మేరకు అధికంగా పనులు కొట్టేయాలనుకున్న సదరు నేత పన్నాగంగా ఉంది. తాజా పరిణామాలతో దీనికి బ్రేక్ పడినట్లయింది. ఫలితంగా కార్పొరేషన్‌కు ఆ మేరకు లబ్ధి చేకూరనుంది.
Advertisement