
వెంటిలేటరే..రాజమార్గమై!
ఒంగోలు ఇందుర్తి నగర్ సమీపంలో ఉన్న కాకతీయనగర్ మూడో లైన్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది.
♦ ఒంగోలు కాకతీయ నగర్‌లో దొంగల చేతివాటం
♦ రూ.2.50 లక్షల నగదు, 7సవర్ల బంగారం మాయం
♦ సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
♦ ఆధారాలు సేకరించిన వేలిముద్ర నిపుణులు
ఒంగోలు క్రైం : ఒంగోలు ఇందుర్తి నగర్ సమీపంలో ఉన్న కాకతీయనగర్ మూడో లైన్‌లోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారు జామున దొంగతనం జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉండగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు. అటవీ శాఖలో బీటు ఆఫీసర్‌గా పనిచేస్తున్న యడ్లపల్లి జాన్సన్ ప్రస్తుతం చీమకుర్తిలో విధులు నిర్వర్తిస్తూ ఒంగోలులో నివాసం ఉంటున్నారు. ఇంటి వెంటిలేటర్ నుంచి లోనికి వెళ్లిన దొంగలు.. నగదు, బంగారాన్ని మాయం చేశారు. బీరువాలో దాచిన రూ.2.50 లక్షల నగదుతో పాటు 7 సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. తీరా తెల్లవారి లేచి చూసుకునేసరికి తలుపులు తీసి బార్లా ఉన్నాయి.
జాన్సన్‌తో పాటు కుటుంబ సభ్యులు తలుపులు తీసి ఉండటాన్ని గమనించి అవాక్కయ్యారు. బీరువా కూడా తీసి ఉండటాన్ని గమనించి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ సమాచారాన్ని ఒంగోలు టూటౌన్ పోలీసులకు అందించారు. సీఐ పి.దేవప్రభాకర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వెంటనే ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు కూడా వచ్చి వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి యజమాని జాన్సన్ నుంచి రాబట్టారు. నగదుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేలిముద్రల నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని నిందితుల వేలిముద్రలు సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవప్రభాకర్ తెలిపారు.