హవ్వ..‘పెద్ద’ మోసం
నోట్లు మార్పిస్తానని దుండుగుడి పరారు
ఎస్‌బీఐ వద్ద కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు
ధర్మవరంటౌన్ : పెద్దనోట్ల మార్పిడి వృద్ధులకు తీరని వేదనను మిగుల్చుతోంది. వృద్ధాప్యంలో ఆదరువు ఉంటుందని దాచుకున్న పెద్ద నోట్లను మార్చుకుందామని బ్యాంకు వద్దకు వెళితే ఓ అవ్వను ఏమార్చి రూ.2 వేలు ఎత్తుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన వృద్ధురాలు సుబ్బమ్మ వద్ద రూ.2వేల పింఛన్ సొమ్ము (రూ.500 నోట్లు 2, రూ.1000 నోటు 1)ఉంది. ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు శుక్రవారం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎస్‌బీఐ బ్రాంచి వద్దకు చేరుకుంది. పెద్ద నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియక బ్యాంక్ ఆవరణలో తికమక పడుతోంది.
ఇది గమనించిన ఓ వ్యక్తి ‘అవ్వా.. నోట్లు మార్చుకునేందుకు వచ్చావా..? క్యూలైన్ చాలా ఉంది. నీవు నిలబడ లేవు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వు నగదు మార్చుకుని కొత్త నోట్లు ఇస్తా’నని అన్నాడు. అతడి మాయమాటలను నమ్మిన వృద్ధురాలు డబ్బు, ఆధార్ జిరాక్స్ అతని చేతికి ఇచ్చింది. గంట, రెండు గంటలు గడిచినా అతను రాలేదు. అనుమానం వచ్చి బ్యాంక్ సిబ్బందికి చెబితే ఎవ్వరూ పట్టించుకోలేదు. బ్యాంకు ఆవరణలో కూర్చుని కంటతడి పెట్టింది. వృద్ధులను ఇన్ని అగచాట్లు పెడుతున్న ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసింది. ఇంత రద్దీగా ఉండే బ్యాంక్‌లో కనీసం పోలీసులు మచ్చుకైనా కానరాకపోవడంతో ఆమె గోడు వినే నాథుడే లేకుండాపోయారు. అధికారులు స్పందించి వృద్ధులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్ పెట్టి పోలీసుల నిఘా పెంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.