
దొంగలు పగులగొట్టిన బీరువా
ముదినేపల్లిరూరల్(కైకలూరు) : మండలం లోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంలో గురవారం మధ్యాహ్నం తాళం వేసివున్న ఇంట్లో చొరబడిన దొంగలు రూ.2.5 లక్షల వివులైన సొత్తును చోరీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పెదగొన్నూరు గ్రామానికి చెందిన గునుపూడి నాగరాజు, జయలక్ష్మి దంపతులు. వారి కుమారుడు గుడ్లవల్లేరు కాలేజీలో చదువుతున్నాడు. గురువారం జయలక్ష్మి పొలానికి, కుమారుడు కళాశాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో నాగరాజు కూడా ఇంటికి తాళం వేసి గుడివాడ వెళ్లారు.
జయలక్ష్మి పొలం నుంచి ఇంటికి వచ్చే సరికి తలుపు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో లోనికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 6 కాసుల బంగారు నగలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలాన్ని పరిశీలిచాయి. ఎస్‌ఐ వి.రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.