
క్షణం.. ఆలోచిస్తే..
- భవిష్యత్తు బంగారమే..
- •క్షణికావేశమే అనర్థాలకు మూలం
- •ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది
- •ఆత్మన్యూనతే పెద్ద ఉపద్రవం
- ఆత్మవిశ్వాసం గెలుపునకు రాచబాట
- •నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం
జీవితంలో వెనక్కి తీసుకోలేనివి రెండే.. ఒకటి కాలం.. మరొకటి ప్రాణం. తొందరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది. మనపై ప్రేమను పెంచుకున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం అంటాడు ఓ కవి. జీవిత ప్రయాణాన్ని ముగించే మరణం సహజంగా ఉంటేనే ఆ జీవితానికి సార్థకత. అయితే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక, చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూస్తూ భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితులో అధికమవుతున్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, న్యూనతా భావం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం. క్షణికావేశానికి గురైన వ్యక్తుల ఆలోచనలను కొద్ది సేపు మళ్లించగలిగితే మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయబోరని చెబుతున్నారు. ఇలాంటి మానసిక బలహీనుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిని మంచి మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
క్షణికావేశంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అమ్మతిట్టిందనో..నాన్న కొట్టాడనో...ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దన్నారనో.. అడిగిన డబ్బులు ఇవ్వలేదనో...తరగతిలో టీచర్ అవమానించారనో చిన్న చిన్న వాటికి యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్రిమిసంహారక మందులు వేసుకోవడం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకోవడం, చెరువులల్లో దూకి చనిపోవడం వంటివి చేసుకుంటున్నారు.
మనకు తల్లిదండ్రులు ఎందుకు ఈ జన్మను ఇచ్చారన్న విషయాన్ని మరచిపోయి అప్పటికప్పడు నిర్ణయాలు తీసుకొని, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న యువత కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధకరం. సమాజంలో నలుగురిని చైతన్య వంతులుగా చేసే తెలివి ఉన్న వారు కూడా అప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలమీదుకు తెచ్చుకుంటున్నారు.
రైతుల ఆత్మహత్యలు
పంటల కోసం పెట్టిన పెట్టుబడులు చేతికిరాక, వాతావణం అనుకూలించక చేసిన కష్టం కూడా దక్కేటట్లు లేదని ప్రతి రోజు రైతులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా కూడా రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్నరణాలకు దిగుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్, ఎరువులు , విత్తనాలు ఆమాంతం పెరగడం.. కష్టించి తీరా పంట వస్తే గిట్టు బాటు ధర లభించడంలేదు. వ్యవసాయానికి బ్యాంకుల్లోను సొసైటీల్లోను, అప్పులు తీసుకొన్నా.. తిరిగి చెలించలేక కుటుంబాన్ని పోషించుకోలేక అనుదినం మానసిక సంఘర్షణలకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తెలిసిందే.. రెండేళ్ల కాలంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
డిప్రెషన్‌కు లోనైన వారే ఎక్కువ
‘ఆత్మహత్యలు చేసుకునేవారిలో చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్థత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభం. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆత్మహత్య భావన మదిలో కదలినపుడు ఒకసారి అలా బయటకు వెళ్లి ఏకాంతంగా గడపడం, శ్వాసపై ధ్యాస ఉంచి ఓ పది నిమిషాలు నెమ్మదిగా ఉండడం ఉపయోగపడుతుంది.
బంధువులు, కుటుంబ సభ్యులు సైతం బలహీన మనస్థత్వమున్న వారిని ఒంటరిగా వదలడం మంచిది కాదు.జీవితం పట్ల అనురక్తిని పెంచేలా మాట్లాడడం ఉదాహరణలుగా ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలే కాదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనల్ని నమ్ముకున్న వారికి కడుపు కోత పెట్టడం ఎంతటి పాపమో ఆలోచిస్తే తప్పకుండా మనసు మారుతుంది.
- ప్రముఖ వైద్యుల, డాక్టర్ నాగరాజు