అడ్డాకుల మండలంలో సాగుతున్న సైకిల్‌యాత్ర
ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల సైకిల్‌యాత్ర
స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై ప్రచారం
అడ్డాకుల: కేరళ రాష్ట్రానికి చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై వినూత్న ప్రచారం చేట్టారు. తిరువనంతపురం (త్రివేండ్రం) నుంచి ఢిల్లీకి సైకిల్‌యాత్ర చేస్తున్నారు. తిరువనంతపురంలో యిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ ఎన్‌ఎస్‌కే సింగ్ ఆధ్వర్యంలో 12మంది ఉద్యోగులు చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం అడ్డాకుల మండలంలో 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా సాగింది. ఆగస్టు 31న తిరువంతపురం నుంచి సైకిల్‌యాత్రను మొదలుపెట్టారు.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్తున్న ఈ యాత్ర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలను దాటి అక్టోబర్ 5న ఢిల్లీకి చేరనున్నట్లు చేరుకోనున్నట్లు కమాండర్ ఎన్‌ఎస్‌కే సింగ్, ఖమ్మం జిల్లాకు చెందిన సైకిల్ యాత్రికుడు దిలీప్ తెలిపారు. తిరువనంతపురం నుంచి ఢిల్లీకి 3200 కిలోమీటర్ల దూరం సైకిల్‌యాత్ర సాగుతుందని చెప్పారు. దేశంలో స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణపై విస్త్రృత ప్రచారం జరగాల్సి ఉందన్నారు. మానవ మనుగడలో కీలకపాత్ర పోషించే రెండింటిపై ప్రజలు మరింత చైతన్యవంతులై ముందుకు సాగాలని కోరారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు విశేష కృషి జరగాలని పేర్కొన్నారు.